Tuesday, May 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామీణ యువతకు స్వయం ఉపాధే లక్ష్యం

గ్రామీణ యువతకు స్వయం ఉపాధే లక్ష్యం

- Advertisement -
 ఎస్‌ఐహెచ్ఎంకు పూర్వ వైభవం తీసుకొస్తాం  : మంత్రి జూపల్లి కృష్ణారావు 
నవతెలంగాణ-కోహిర్ 
గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించ డమే తమ ధ్యేయమని, ఎస్‌ఐహె‌చ్‌ఎంకు పూర్వ వైభవం తీసుకొస్తామని పర్యాటక, సాం‌స్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఐహె‌చ్‌ఎం) సంస్థలో ఘనంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులను మంత్రి ప్రారంభించారు. వీటితోపాటు ఈ విద్యా సంవత్సరానికి సంబం ధించిన బీబీఏ, ఎంబీఏ కోర్సుల అడ్మిషన్లను లాంఛనంగా ప్రారంభించారు. పర్యాటక శాఖ రూపొందించిన ‘టూరిస్ట్ గైడ్‌’ పోస్టర్‌ను ఆవిష్క రించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఎ‌స్‌ఐహె‌చ్‌ఎంను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. సుదీర్ఘ కాలంగా నిరుపయోగంగా ఉన్న ఎస్‌ఐహెచ్‌ఎంను పున: ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించ డమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎస్‌ఐహె‌చ్‌ఎంలో చేరిన పేద విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, వారికి స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం తగిన ‌కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.  సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపం చమే ఒక కుగ్రామంగా మారిన ఈ యుగంలో, ప్రయివేట్‌ రంగంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యువత ఈ అవకాశాలను అందుకోవడానికి పర్యాటక, ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు కేవలం కోర్సులకే పరిమితం కాకుండా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న కాలాని కనుగుణంగా మార్కెట్‌లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులను కరికులమ్‌లో చేర్చాలని నిథమ్ డైరెక్టర్ వెంకటరమణను మంత్రి ఆదేశించారు. పిల్లల ఉపాధి కోర్సుల విషయంలో తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మెన్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.​
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -