సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారం వీడీసీ చైర్మెన్‌ను, సభ్యులను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు, నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి పెద్ది వెంకట్రాములు డిమాండ్ చేశారు. గన్నారంలో గ్రామాభివృద్ధి కమిటీ అరాచకాలకు బలవుతున్న దళిత మాదిగ కుటుంబాలతో కలిసి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 40 సంవత్సరాల నుంచి గ్రామానికి, రోడ్డుకు ఆనుకుని ఉన్న 856/9 సర్వే నెంబర్‌లో దోమకొండ కళావతికి ప్రభుత్వం భూమిని కేటాయించిందని, రూ.35 లక్షలు ఖర్చుచేసి ఆ భూమిని అభివృద్ధి చేశారని తెలిపారు. అభివృద్ధి అయ్యేంతవరకూ నోరుమూసుకుని కూర్చున్న వీడీసీ.. ‘ప్రస్తుతం ఆ భూమి మీది కాదు.. మీరు వెళ్లిపోండి.’ అంటూ అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అలాగే పేదలు వేసుకున్న బోరును, నాటిన పండ్ల మొక్కలను ధ్వంసం చేయించారని తెలిపారు. కొంతమందిని భౌతికంగా గాయపరిచారని తెలిపారు. దీనంతటికీ ఆ గ్రామ మాజీ సర్పంచ్, ప్రస్తుత వీడీసీ చైర్మెన్ కుంట మోహన్‌రెడ్డే కారణమని విమర్శించారు. ఆయన సర్పంచ్‌గా ఉన్నప్పుడు వీడీసీ చట్ట వ్యతిరేకమని మాట్లాడాడని, ఇప్పుడు అతనే.. వీడీసీ చైర్మెన్ అవతారం ఎత్తి దళితులపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. 856 సర్వే నెంబర్‌లో 166 ఎకరాలు ఉంటే.. 34 ఎకరాలు మాత్రమే పంచి పట్టాలిచ్చారని.. ఇంకా 132 ఎకరాలు ఉన్నదని తెలిపారు. ఎవరికీ ప్రభుత్వపరంగా చట్టబద్ధంగా కేటాయించిన దాఖలాలు లేవని, అయినప్పటికీ కుంట మోహన్ రెడ్డి, అగ్రవర్ణ రెడ్డిలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చట్ట వ్యతిరేకంగా పేదలకు వర్తించాల్సిన భూమిలో పాగా వేసి వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ భూమిలో లేఅవుట్ చేస్తే అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లేఅవుట్ ప్లాన్ ఇచ్చే అధికారం ఎమ్మార్వోకు ఉంటుందని.. అసైన్‌మెంట్ భూమిలో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) నాయకులు రాజు, గన్నారం గ్రామ దళిత కుటుంబాలు, జగదీష్, నర్సింలు, డి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
గన్నారం వీడీసీ చైర్మెన్,సభ్యులను అరెస్టు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



