సాహిత్య ప్రక్రియల వినూత్న కృషీవలుడు… శేషేంద్రశర్మ

An innovative cultivator of literature... Sesendra Sharmaగుంటూరు శేషేంద్రశర్మ సుప్రసిద్ధ కవి, పేరెన్నికగన్న సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు. బాల్యంలో తన ఇంట్లోనే పెద్ద లైబ్రరీ ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చింది. అందువల్ల పుస్తక పఠనం ఆయనకు చిన్నతనం నుండి అలవడింది. దానినే ఆయన తన ‘ఊహలో…’ అనే పుస్త కంలో ”ప్రజానీకం, ఆధి వ్యాధులకు పరమౌషధం పుస్తక పఠ నం” అనే వ్యాసంలో వ్యక్తం చేసారు. అనేక పుస్తకాలు చదవడం వల్ల ఆయనకు చదవడమే కాకుండా, ఆలోచించడం, వితర్కిం చడం, రాయడం కూడా తన జీవితంలో అనివార్యం అయిపో యాయి. ప్రాచీన వాల్మీకి ‘రామాయణం’ మొదలుకొని, ఆధునిక వచన కవిత్వం వరకూ ఆయన రచనాంశాలు విస్తరించాయి. తానే స్వయంగా చెప్పుకున్నట్లు ఆయనకు ”కవిత్వమంటే స్వప్న విద్య”. సుమారు యాభైఏళ్లు ఆయన సాహిత్య కృషి కొనసాగింది. తన కాలంనాటి కవులకన్నా ఆయన సాహిత్యం విలక్షణమైనది.
ఆయన కాలానికి సంప్రదాయ కవులూ, అభ్యుదయ కవులూ, కాల్పనిక కవులూ, ఇంకా తిరుగుబాటు, విప్లవ కవులూ అంటూ ఒక్కొక్క కవితా రీతికి ప్రతీకలుగా ఉన్న రోజుల్లో ఈ కవి ఒక్కడూ విలక్షణంగా పైలక్షణాలన్నీ ‘కొత్త పాతల మేలు కలయి కగా క్రొమ్మెరుంగులు చిమ్ముతూ’ తెలుగు సాహిత్య లోకంలోకి ప్రవేశించాడు, ప్రకాశించాడు.
శేషేంద్ర ఊహలో అనే పుస్తకంలో చెప్పుకున్నట్లు తన ఏడెని మిది ఏళ్ల వయసు నుండే బయట స్కూలు చదువుతో బాటూ ఇంట్లో ఉన్న పుస్తకాలు – సంస్కృత తెలుగు కావ్యాలు, పురా ణాలు, నిఘంటువులు, తెలుగుప్రబంధాలు చదువుతూ ”విజ్ఞాన సేకరణ” చేస్తుండేవాడు. ‘చదవని వాడజ్ఞుండగు’ అన్న పోతన మాట శేషేంద్ర నిజమని నిరూపించాడు.. ఇట్లా ఇంట్లోని గ్రంథా లయంలో ఉన్న పుస్తకాలు చదవడం వల్లనే శేషేంద్ర అతి చిన్న వయసులోనే అంటే 1947లోనే సోరాబు వంటి పద్యకావ్యంతో తన సాహిత్య రచనా ప్రయాణం ప్రారంభించాడు.
అంత భాషాసాహిత్య పరిజ్ఞానమే ఆయనకు రామాయణం మొదలుకొని పురాణేతిహాసాలలో తులనుమంత్ర, యోగ, కుండ లినీ వంటి ఆధునికులకు అంతుపట్టని విషయాలతో బాటువ్యక్తి, కుటుంబం సమాజం, దేశం, ప్రపంచందాటి అంతరిక్ష, దిగం తాల వరకు, అలాగే వ్యక్తి ప్రేమ, వైయక్తిక స్వేచ్ఛ Ûమొదలుకొని, సామాన్య మానవుల ఆకలి, పేదరికం, అగచాట్లు, బాధలు, కష్టాలు, కన్నీళ్ల వరకూ విస్తరించి అన్నీ ఆయనకు కవితా/ సాహిత్య రచనా వస్తువులే అయ్యేలా చేశాయి.
మానవుడి బాధలను కవిత్వీకరించడమేకాదు, వాటి నుండి విముక్తి కావటం కోసం దిశానిర్దేశాలూ, సామాజిక న్యాయాల సూచనలూ కూడా ఆయన సాహిత్యంలో కనిపిస్తాయి. ఒకవైపు మనిషి ఉన్నత మానవుడుగా పరిణామం చెందటానికి పుస్తక పఠనం ఎంత ముఖ్యమో చెప్తూనే, మరోవైపు చదువుల కన్నా వ్యవసాయమే (నాగలి) మిన్న అనీ అంటాడు. అయితే మనం దీనిలో వైరుధ్యం చూడకూడదు. మనిషి రాజకీయాల కంపును వదులుకొని, ప్రకృతి పారవశ్యాలను ఆస్వాదిస్తూనే, దానినీ అధిగమించి వైజ్ఞానిక అంశాల వైపు ఎందుకు దృష్టి సారించాలో, ఆ జ్ఞానం మనిషికి ఏ విధమైన అవగాహ నను పెంచి, సృష్టితత్త్వాన్ని అర్థం చేసు కోగల తాత్త్వికచింతనను అలవర్చు తుందో తన కవిత్వం, సాహిత్యం నిండా వివరిస్తాడు. అంటే ఈనాటి చదువుల విధానం పట్ల వ్యంగ్య విమర్శలో భాగం గా ఈనాటి విద్యార్థి చదువుల చట్రంలో ఇరుక్కొని జీవితాన్ని కోల్పోతున్నాడన్న బాధ అందులో మనం గమనిస్తాం. ఇలాంటి చదువుల కన్నా నాగలి పట్టి దున్నుకోవడం మేలని ఆయన ఉద్దేశ్యం గా కనిపిస్తుంది. అంతేకాదు. తనమట్టి మూలాలను ఎవ్వరూ మరవకూడదనీ, నేల విడిచినసాము చేయకుండా ప్రజల జీవన సుఖసంతోషాల కోసం కవి కలం నిలవాలనే ఆకాంక్ష ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఇట్లా ఆయన సాహిత్య వస్తువు కానిదేదీ లేదని తెలిసి మనం ఆ కవన వేగానికి, ఆవేశంలోని ఉధృతానికి వ్యక్తీకరణకూ ఉక్కిరిబిక్కిరి అయిపోతాం.
స్థూలంగా జీవితాన్ని అన్ని కోణాల నుండి దర్శించి, దానితో ముడిపడ్డ ఆధ్యాత్మికత, ప్రేమ, సమానత్వం కోసం విప్లవం, ప్రకృతి ఆస్వాదన ఇలాంటివన్నీ కలగలిపిన ప్రాచీన, ఆధునిక సమ్మేళనం ఈయన కవితా వరణంగా గుర్తించవచ్చు. ఇంత వైవి ధ్యభరితమైన సాహిత్యాన్ని సృష్టించటం ఒక సాహితీవేత్తకు ఎంత కష్టమో అంత సాహిత్యాన్ని అంచనా వెయ్యటమూ, అధ్యయనం చేసి విశ్లేషిం చటమూ ఏఒక్కరికీ ఏ ఒక్క సందర్భం లోనూ పూర్తిగా సాధ్యమయ్యే పని కాదు. మొత్తం మీద సాహితీ ప్రియులను ఆకట్టుకునే కవిత్వీ కరణతోనూ, ఆలోచింపజేసే భావా వేశంతోనూ ఆయన పుస్తకాలు మనల్ని చదివింపచేస్తాయి.
శేషేంద్ర తాను 1970-1986ల మధ్య రాసిన వివిధ రచ నలు నిజానికి వేర్వేరు అంశాలు కావని తనేగుర్తించి వాటన్నిం టినీ కదంబమాలగా కూర్చి ఆధునిక మహాభారతంగా ఏక కావ్యంగా రూపొందించారు. ఈ గ్రంథం 1970-1986 మధ్యకాలంలోని వచన కవితా సమాహారమే అయినా దీనిని సంకలన కావ్యం అని చెప్పటం శేషేంద్రకు సమ్మతం కాదు. ఆయన స్వయంగా ”ఇది నా సంకలన కావ్యం కాదు, ఇది నా సంపూర్ణ కావ్యం” అని చెప్పుకున్నారు. స్థూలంగా ‘నాదేశం, నా ప్రజలు’ అనే తాత్త్విక చింతన చుట్టూ నిర్మితమైన ఈ సాహిత్యంలో అంతర్లీనంగానూ, ప్రత్యక్షంగానూ కూడా కవి ‘నేను’ అనే రూపం లో కూడా మనకు దర్శనమిస్తాడు.
ఈ ఆధునిక మహాభారతంలోని కావ్యాలను వేరువేరుగా, వేర్వేరు కాలాల్లో రాసినప్పటికీ, అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమైనవే. ఈ ఆధునిక మహా భారతాన్ని కవి ‘భారతీయ కర్షకేతిహాస’ మని చెప్పుకున్నారు. దీర్ఘకాలాల తర్వాత ఒక్కొక్కయుగంలో ఒక్కొక్క ఐతిహాసిక కావ్యం, దాని అను బంధం వచ్చాయని చెప్తూ, శేషేంద్ర ఆధునిక మహా భారతానికి అనుబంధ కావ్యంగా ‘జనవంశం’ రాశానని స్వయంగా పేర్కొ న్నారు. నిత్యజీవితంలోనైనా, కవిత్వ జీవితం లోనైనా, మనిషి భావవ్యక్తీకరణకు అవసరమైంది భాష. ప్రతి వ్యక్తీ భాషను తనదైన పద్ధతిలో ఉపయోగించుకొని మాట్లాడినట్లే, కవి, రచయిత (సాహిత్యవేత్త) కూడా భాషను తనదైన పద్ధతిలో వినియోగించి, వ్యక్తీకరిస్తారు. ఆయా వ్యక్తుల రచనా శైలిని, కవితాత్మలను వారి వారి ‘భావవ్యక్తీ కరణ’ విధానమే పట్టి ఇస్తుంది.
నిత్యజీవితంలో మనిషి మాట్లాడే భాష సాధారణంగా ‘విషయ’ సంబం ధంగా, సూటిగా ఉంటుంది. అయినా, సంభాషణల్లో మనుషులు వారివారి తత్త్వాన్ని బట్టి ”ఆకట్టుకొనే విధంగా”, ‘వినాలనిపించే విధంగా’ ‘ఆకర్షణీ యంగా’ మాట్లాడుతుంటారు. కానీ సాహిత్యంలో ఈ ‘ఆకట్టుకునే’, ‘ఆక ర్షించే’, ‘చదవాలనిపించే’ లక్షణాలు ఆయా కవులకూ, రచయితలకూ భిన్న భిన్నంగా ఉంటాయి. అవి వారివారి ‘శైలి’గా మన గుర్తిస్తాం.
శేషేంద్రకు ఉన్న ప్రాచీన అలం కార శాస్త్రాల, ఆధునిక పాశ్చాత్య సాహిత్య విమర్శ శాస్త్రాల అవ గాహన లోతైనది. అందువల్ల ఆయన రచనల నిండా మనకు అనేక రకాలైన అభివ్యక్తి రూపాలు, వర్ణనలు, అలంకారాలూ కనిపిస్తాయి. మచ్చుకు కొన్ని మాత్రమే కింద ప్రస్తావిస్తాను.
ప్రజాపర్వం- పు. 44 : కవిత్వం ఎర్ర గుర్రంలా పరిగె త్తుకు వస్తోంది-రక్తంలో మునిగిన బాణంలా, వీరుడు విడిచిన ప్రాణంలా. (కవిత్వ ధారను పరిగెత్తే ఎర్రగుర్రంతో పోల్చాడు)
పు.42 : చరిత్రలో చెమట ఒక శాశ్వత అంతర్వాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది. (శ్రమజీవి చెమట చరిత్రలో అంతర్భాగ మని అర్థం)
సూర్యపర్వం, పు. 74 : పిల్లల్ని రాత్రి ముక్కలు వెన్నెల్లో ముంచుకొని కొరుక్కుంటూ తినమంటా.
పశుపర్వం. పు. 113 : కష్టాల్ని కన్నీటిలో ముంచుకొని బిస్కెట్లలా తిం టాను. (కష్టాలను దిగమింగి అనటం పరిపాటి. ఇక్కడవాటిని బిస్కట్లతో పోల్చి వాటిని కన్నీళ్ళలో ముంచుకుని ‘తింటాడట’ కవి)
పై ఉపమలన్నీ ఎవ్వరూ ఎప్పుడూ వాడనివి. కవిత్వాన్ని ‘ఎర్ర గుర్రంతో’ పోల్చ డం, ‘చెమట’ అనేది చరిత్రలో ఒక అంతర్వా హిని, అనడం ఎంత కొత్త పోలికలు! అట్లాగే ‘రాత్రి’ ని ముక్కలు చేసుకొని, ‘వెన్నెల’లో ముంచుకుని ‘కొరుక్కు’ తినమని పిల్లలతో చెప్తాడు. తాను కూడా కష్టాలను కన్నీటిలో ముంచు కుని ‘బిస్కెట్ల వలె’ తింటానంటాడు. ఇలాంటివే ఇంకా ఎన్నో ప్రతీకలు ఈయన రచనల నిండా కని పించి, మనల్ని అబ్బుర పరుస్తాయి.
ప్రవాహ పర్వమంతా ఆలంకారికమే. ఏ ఒక్క వాక్యమూ వదలాలనిపించదు. చాలా బాగా ఆకట్టు కొని పదే పదే చదివిస్తాయి. చూడండి :
”నేను ఘనీభవిస్తే ఒక నామరూపాత్మక వేగం. నేను ద్రవీభవిస్తే ఒక జ్ఞాపకాల ప్రవాహం.”
”రాజకీయ నాయకుడు ఇరుసుగా- తిరుగు తోంది పత్రికల భాగోతం.” (పు. 167, ఆద్మీ పర్వం)
”భాష బోధిస్తుంది పెదవులకు, విచ్చుకునే విద్య” (పు. 193)
”అన్ని నేత్రాలకూ కనిపిస్తుంది, వస్తు జాలం..
కానీ కొన్నింటికే కనిపిస్తుంది
వీటిలో కవిత్వం అనే ఇంద్రజాలం.” (ఆద్మీ పర్వం 211). ఇట్లాంటివే అడుగడుగునా అనేకంగా నూత నత్వంతో నిండి ఉన్నాయి.
”రైతులారా! రాజకీయ వర్షం పడుతోంది
మోసపోయి మీ విత్తనాలు చల్లకండి” (302) ఇది రాసి ఎంతో కాలం అయింది. అయినా ఇప్పటికీ దీని ప్రాసంగికత పోక పోగా, ఇంకా బలవత్తరం అయింది. ఇట్లా ఉదహరిస్తూ పోతే, శేషేంద్ర కవిత్వంలోని ప్రతీ వాక్యమూ కవితామయమనీ, ఏదీ కూడా వదిలెయ్యలేం అనీ అర్థం అవుతుంది.
ఇక ‘జనవంశమ్‌’ అనే అనుబంధ కావ్యంలో కూడా ప్రతీ వాక్యమూ కవిత్వీకరించిన కొటేషనే. కొన్ని ఉదాహరణలు :
”చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది.
మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను” (పు. 238)
శేషేంద్ర పదబంధాలు, సమాస కల్పనలు కూడా కొత్తగా, ఆసక్తికరంగా రమణీయంగా ఉంటాయి. ఉదాహరణకు:
‘పువ్వెడు వసంతం, రాజకీయ వర్షం, శిల్పించే, మధురించే, రాజకీయ రుతువు; ప్రజాస్వామ్య శిశువు ప్రసవం…; …. ఇట్లా తన కావ్యాల నిండా ఎన్నో కొత్త కొత్త పద బంధాలను, కవితాత్మక పదాలనూ సృష్టించాడు శేషేంద్ర.
ఆయన రచనల్లో విశ్వనాథ కనిపిస్తాడు, శ్రీశ్రీ కనిపిస్తాడు. జాగ్రత్తగా చూస్తే ఒకసారి తిలక్‌నూ, మరోసారి జాషువానూ తలపిస్తాడు.
ఉదా : ఇది కవిత్వం కాదు. ఇది రక్తంతో,
కన్నీటితో తడిసిన అక్షరాల గుంపులు.
తుపాకి దెబ్బకు బెదిరి చెల్లా చెదరైపోతున్న
పక్షుల సముహాలు (పు. 115) (ఇది తిలక్‌ ”నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అనే కవితను గుర్తు చేస్తుంది)
కవిత్వంలో రామణీయ కతవల్లనే ఆకర్షణశక్తి, కావ్యత్వం సిద్ధిస్తాయనీ మిగిలిన ‘కమిట్‌మెంట్‌’ ‘సార్వజనీన శ్రేయస్సు’ అనేవి ఔపచారికం అనీ ప్రాక్పశ్చిమ సాహితీ విమర్శకులందరూ చెప్పారనే సారాంశాన్ని తనకవిసేన మేనిఫెస్టో ద్వారా అందిం చారు. తన మొత్తం సాహిత్యమంతా ఒకేవిధమైన మహాకావ్య మనీ, అందుకే అది ‘ఆధునిక మహాభారతం’ అనీ నిబద్ధతతో ప్రకటిస్తాడు. తద్వారా, తననూ, తన కావ్యసృష్టినీ ప్రాచీన కవుల సరసన చేర్చుకున్న సమర్థన కనిపిస్తుంది. ‘జనవంశ’మనే అనుబంధ కావ్యంతో ‘తనకావ్యయాత్ర’ ముగిసిం’దని అవతా రికలో (పు.29) చెప్పుకొన్నారు.
ఆయన రచనల్లో పైన చెప్పుకున్న విధంగా ప్రతీ వ్యక్తీకరణ ఆయన సృష్టి, వాటిలో కొన్ని ఎంత వినూత్నం అంటే, ఇతర కవు లెవ్వరిలోనూ అలాంటి వాటిని మనం చూడం.
సంప్రదాయ వ్యాకరణ అలంకార శాస్త్రాలనూ, పాశ్చాత్య సాహిత్య విమర్శనూ, మార్క్సిస్టు సిద్ధాంతాలను అధ్యయనం చేసి, తన సాహిత్య ఆలోచనలను మేళవించి తెలుగు సాహితీ విమర్శ లోకానికి అందించిన కొత్త టానిక్‌ వంటి సైద్ధాంతిక సాహితీ విమర్శ పరికల్పనే ‘కవిసేన మానిఫెస్టో’. ఇది 1977లో వచ్చి, సాహిత్య లోకాన్ని ఒక ఊపు ఊపింది.
తన కవిత్వంలో కూడా అక్కడక్కడా సాహి త్యం, కవిత్వం, కవులపై తన అభిప్రాయాలు నిష్క ర్షగా వెల్లడించిన శేషేంద్ర ”కవి మొదట అనుభూ తిని కళగా అభ్యాసం చెయ్యాలి, ఆత్మీ కరణని కళగా అభ్యాసం చెయ్యాలి, తర్వాత అభివ్యక్తిని కళగా అభ్యాసం చేయాలి.” అనీ వివిధ ప్రాచ్య పాశ్చాత్య విమర్శకులను క్రోడీకరిస్తాడు. (కవిసేన మేనిఫెస్టో పు. 68)
కవిసేన మానిఫెస్టోలో ”కవిత్వం బతుకు తెరువు కాదు; జీవన విధానం” అనీ, యువ తరంలో సాహిత్య విద్యార్థుల కోసం వాళ్ళలో ప్రాచ్య పాశ్చాత్యకావ్య తత్త్వ చింతన గురించిన సరియైన అవగాహన కోసం తపించి శేషేంద్ర అందించిన ఈ మేనిఫెస్టో చదవడం ద్వారా ప్రతీ సాహిత్య అభిరుచి కల తెలుగు వాడూ సాహిత్యం పట్ల సరియైన అవగాహన ఏర్పరచుకోగలు గుతాడు, లేదా ఆయన సిద్ధాం తాన్ని ప్రశ్నించ గల జ్ఞానం నేర్చుకుంటాడు.
శేషేంద్ర రచనల్లో ఎక్కువమంది పరామర్శిం చని రచనలు ఆయన ‘వైజ్ఞానిక రచనలు’. విశ్వ వివేచన, (చైతన్య పరిణామ చరిత్ర), నరుడు- నక్షత్రాలూ, ఊహలో -అనే మూడు గ్రంథా ల్లో ”భూమి, విశ్వం, నక్షత్రాల గమనం, విజ్ఞానానికి కర్త ఎవరు?, నక్షత్రాలు అలసిపోతే?” వంటి అనేక అంశాల గురించి శాస్త్రీ యంగా మనకు తెలియ వస్తోన్న వాటిని వివరించే ప్రయత్నాలు చేశారు. అయితే, వాటిల్లో కొన్ని చోట్ల అంతర్లీనంగా ‘జ్యోతిష’ సంబంధమైన పరామర్శ నిబిడీకృతమై కనిపిస్తుంది. వైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రతిపాదనలను కొన్నింటిని ప్రాచీన భారతీయ తాత్త్విక చింతనతో మేళవించడం జరిగింది. ”డబ్బునూ, అధికా రాన్నీ నిరసించి, ఆంతరజ్యోతిని వెలిగింప జేయడం మన సంప్ర దాయ వ్మాయ పద్ధతి” అని, తన మార్గం కూడా దానిలో భాగమేనని సూచించారు.
శేషేంద్ర స్వయంగా బహుభాషా వ్యవహర్త అయినా, ఆయన రచనలను ఆయనే అనువాదం చేసుకోలేదు. ఆయన రచనల్లో వాల్మీకి సుందరకాండ తాత్త్విక వ్యాఖ్యానమైన ‘షోడశి’ని అదే పేరుతోను, శ్రీహర్ష నైషధ కావ్యా రసావిష్కరణ అయిన స్వర్ణహంసను అదే పేరుతోనూ గురజాడ సూర్య నారాయణ మూర్తి ఇంగ్లీషు లోనికీ, ‘సముద్రం నా పేరు’ కవితను కె. దామోదరరావు ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. షోడశి హిందీలోకి అనువదించబడింది.
శేషేంద్ర శర్మకు ఉర్దూ కవిత్వంపైనా, ప్రత్యేకించి గజల్‌ పైనా ఎంతో ప్రీతి. ”ఈ నగరం జాబిల్లి” హైదరాబాదు నగర పుట్టుకతో పెనవేసుకున్న కులీకుతుబ్‌షా, భాగమతి ప్రణయ గీతి. ‘గజల్‌ వాతావరణం’తో పై కథను నృత్య నాటికగా రాసి ఇచ్చి తీరాలనే మిత్రుని (పి.యస్‌. రామారావు) మాట కాదనలేక ”గజళ్లలోనే జీవించిన” శేషేంద్ర గజల్‌కు లక్ష్యంగా ”ఈ నగరం జాబిల్లి” గీత కావ్యాన్ని రాసి, దీనికి అనుబంధంగా గజల్‌ లక్షణా లనూ వివరించారు. ఈ వ్యాసాలు చదివితే, ఒక సైద్ధాంతిక వివరణ, చర్చ కూడా ఎంత విలక్షణంగా, ఉద్వేగంగా కూడా చేయవచ్చో తెలుస్తుంది. ”గజల్‌ ఒక అయస్కాంతం, ‘ఒక అగ్ని’, ఒక రంగుల పక్షి’, ‘ఒక సంస్కృతి’ -అంటూ గజల్‌ పుట్టుక హైదరాబాదులోనే అని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. గజల్‌ కవిత ప్రేమలో పుట్టి, శోకం మీద బతుకుతుందని తెలిపాడు. శేషేంద్ర సాహిత్యం, పైన వివరించినట్లు భావుకత, మానవత, ఆధ్యాత్మికతలను మేళవించి భారతీయ, భారతీయేతర తాత్త్వికత లతో కలగలిపి తనసాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి నట్లు ఆయన సాహిత్యం చదివితే మనకర్థమవుతుంది. ఆయన పద్యాన్నీ, వచనకవిత్వాన్నీ, వచనాన్నీ సమానంగా, సమర్థ వంతంగా స్వంతం చేసుకుని, తన కవిత్వం ద్వారా వాటికి వినూత్నశక్తిని అందించారు. భారతదేశంలోని రైతుకోసం, శ్రామికుల కోసం, వారి సంక్షేమం కోసం ఆయన సాహిత్యం అధిక స్థానాన్ని ఇచ్చింది.
ఆయన సామాన్య మానవుడికి సమాన న్యాయాన్ని ఎంత ప్రేమించాడో, అంతగా ప్రాచీన భారతీయ సాహిత్య సంప్రదా యాన్ని కూడా అభిమానించాడు, అంతేకాదు ప్రకతినీ ప్రేమనూ ప్రేమించాడు. అల్పాక్షరాలతో అనల్పార్థాలను సష్టించిన ఆయన కవిత్వీకరణను అర్థం చేసుకుని, ఆస్వాదించాలంటే, ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాలను చదివిన జ్ఞానం కొంతలో కొంతైనా అవసరం.
అంటే తానొకకలల వర్తకపు క్యాపిటలిస్టు, ఒకవిప్లవ ఉదయతార, ఒక పల్లెటూళ్ళో మొలకెత్తిన ప్రేమదేవత, గడ్డంలేని మహర్షి, దేవుడు లేని భక్తుడు, జెండా పొగరు వంటి దేశభక్తుడు. ఇన్ని పరస్పర విభిన్న కవితా రూపాలు, జీవనాంశాలు ఏకాకతిగా మూర్తీభవించిన కవితామూర్తి శేషేంద్రకు ఆయన పుట్టినరోజున సాహితీ ప్రేమికులకు మరోసారి ఆయన రచనలు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తాను.
(అక్టోబర్‌ 20 శేషేంద్ర జయంతి)
ఆచార్య అయినవోలు ఉషాదేవి
8500524879

Spread the love