తెలంగాణలో ‘రజాకార్ల ఫైల్స్‌’ తీసినా నష్టం లేదు!

జాగృతమవుతున్న ప్రజాతంత్ర చైతన్యాన్ని గణనీయమైన మేరకు మతతత్వ ధోరణులలో మరలించడానికి అన్ని రకాల మాద్యమాలను విస్తృతంగా వాడుకొని రాజకీయంగా మలుచు కోవాలనే అత్యాశతో, దురుద్దేశంతో బీజేపీ సినిమా రంగాన్ని ఎఫెక్టివ్‌గా వాడుకుంటున్నది వాస్తవం. ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని కాశ్మీర్‌ ఫైల్స్‌ అనే సినిమా ద్వారా దేశంలో తాను చేసిన ఘన కార్యంగా ప్రగల్భాలు పలికి ప్రజలను మెప్పించ డానికి సినిమాను ప్రభుత్వమే ప్రమోట్‌ చేసేంత స్థాయికి దిగజారింది. కానీ అక్కడున్న కాశ్మీర్‌ పండిట్‌లు మాత్రం ఈ సినిమాను తిప్పికొట్టడం బీజేపీకి చెంపపెట్టు! నిన్నటి కర్నాటక ఎన్నికల్లో ‘కేరళ స్టోరీ’ సినిమాను బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న ప్రధానియే బహిరంగంగా ప్రచారంలో వాడు కోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. అనేక తప్పుడు సందేశాలతో వాట్సప్‌ల్లో నిత్యం ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఒక ప్రాపగండగా చేసుకొని పనికట్టుకొని మరీ వాస్తవాలను వక్రీకరిస్తూ తాత్కాలిక భావోద్వేగాల్లో ప్రజలను ముంచెత్తి కాలం వెల్లదీస్తున్న తరుణంలో సినిమాను కూడా ఇలాంటి తప్పుడు విషయాల ప్రచారాలకు వేదికగా మలుచుకొని నిత్యం మత రాజకీయాలను ప్రేరేపిస్తూ అభివృద్ధిని గాలికి వదిలేసిన బీజేపీకి కర్నాటక ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు.
కేరళ స్టోరీ అనే సినిమాలో కేవలం ముస్లింలను విలన్‌లుగా చూపించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి వర్యులు లాజిక్‌ మిస్‌ అవ్వడం ఈ సినిమా మిస్‌ఫైర్‌ అయ్యి బీజేపీ పరిపాలనపై అనుమానాలు రేకిత్తించడం ఆసక్తి రేపుతోంది. దేశంలోని విదేశాంగశాఖ, ఇంటలిజెన్స్‌ సంస్థల పనితీరుపై ప్రజలను ఆలోచనలో పడిన మాట వాస్తవం. ఇటలీ, సిరియా దేశాల్లో ఇంత దారుణం జరుగుతున్న దాన్ని కనిపెట్టలేక ఇండి యన్‌ వ్యవస్థలు ఫైయిల్‌ అయ్యాయా అన్న అను మానాలు లేకపోలేదు. కేవలం కమ్యూనిస్టు రాష్ట్రం అయినటు వంటి అత్యంత విద్యావంతులున్న కేరళలో బీజేపీ పాచికలు పారకపోవడంతో ఏదో రకంగా నిందించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న అత్యాశ తీరకముందే, సాక్షాత్తు ప్రధాని సొంత రాష్ట్రం బీజేపీ పాలనలో ఉన్నటువంటి గుజరాత్‌లో ఇటీవలే నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వాళ్ళు గడిచిన ఐదేం డ్లలో నలభై వేల పైచిలుకు మహిళలు మిస్‌ అయినట్టు విస్తుగొలిపే విషయాలను వెల్లడిస్తే ఇదే బీజేపీ సమా ధానం చెప్పలేక గుటికలు మింగుతోంది. ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్‌ ప్రారంభానికి రాజ్యాంగ పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ అయిన ఉప రాష్ట్రపతులను ఆహ్వానించకుండా సన్యాసులతో కూడి పట్టాభిషేకం లాగా చేసు కొని రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలద్ది అవమానించిన ఘనత ప్రధానిదే..! అదేవిధంగా ఎన్నో పథకాలు దేశానికి తెచ్చిపెట్టిన మహిళా రెజ్లర్లను బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు చేస్తూ నూతన పార్లమెంట్‌ ఆవరణలో శాంతి యుతంగా నిరసన తెలిపిన వారిలో హిందువులు, ముస్లింలు అన్ని మతాల మహిళలు ఉన్నప్పటికీ కనీసం కమిటీ వేసి విచారణ జరిపించకపోగా ఢిల్లీ పోలీసు బలగాలతో ఈడ్చి పారేసి నిర్బంధించిన కేంద్రం మహిళల గురించి మాట్లాడుతూ ముసలి కన్నీరు కార్చడం విడ్డూరమే..!? కేరళ స్టోరీలో గడిచిన పదేండ్లలో అంటూ నిరాదార పూరితమైన లెక్కలతో సినిమా తీస్తే చిత్ర యూనిట్‌ను బీజేపీలోని యోగి లాంటి ప్రభుత్వాలు సత్కారాలు, సడలింపులు ఇస్తుండడం, తెలంగాణ చీఫ్‌ బండి సంజరు లాంటి వాళ్ళు హిందూ ఏక్తా యాత్ర పేర మతపరమైన కార్యక్రమాల్లో గెస్ట్‌లుగా పిలుచుకోవడం ఆందోళన కరమైన అంశమే! తెలంగాణలో అధికారంలోకి రావడానికి అంశాల వారిగా విభేదించాలి, అభివృద్ధిలో పోటీపడే విషయాలను చర్చకు లేవనెత్తి ప్రజలకు విపులంగా వివరించాల్సింది పోయి, రజాకార్‌ ఫైల్స్‌ సినిమా తీస్తామని బెదిరిస్తూ, లవ్‌జిహాదీ వంటి పద ప్రయోగంతో ముస్లింలను బూచిగా చూపిస్తూ అధికార పీఠం దక్కించుకోవాలని అత్యాశ పడితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెలివి హీనులు, పాలనా అసమర్థుల చేతిలో పెట్టె సాహ సం తెలంగాణ ప్రజానీకం ముమ్మాటికీ చేయదు. వీర తెలంగాణ పోరాటాన్ని సైతం విమోచన దినోత్సవాల పేరిట మత కోణంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరూ చెవిన పెట్టకపోవడం తెలంగాణ ప్రజా చైతన్యానికి నిదర్శనం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కన్ను తెలంగాణపై పడ్డది. కర్నాటకలో వాడిన రెట్టింపైన అస్త్రశస్త్రాలు ఇక్కడ వాడేందుకు కసితో ఉన్న పార్టీని చావుదెబ్బ కొట్టేందుకు తెలంగాణ సమాజం సిద్ధమైంది. ఇప్పుడు అన్ని రంగాల చైతన్య శీలులు, సామాజిక కార్యకర్తలు, కవులు, కళాకారులు, రచయితలు ఇంకింత అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు దుష్ప్రచారాలను తిప్పి కొట్టే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుని తెలంగాణ నేలను, భరతమాతను విచ్చిన్నవాదులు, విధ్వంస కారుల చెర నుండి విముక్తి కావించాల్సిన సమయం ఆసన్నమైంది.

– ముఖేష్‌ సామల
 9703973946

Spread the love