కామ్రేడ్‌ సునీల్‌ మైత్రా అమర్‌రహే!

 Comrade Sunil Maitra Amarrahe!ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ సునీల్‌మైత్రా వర్థంతిని ప్రతియేటా సెప్టెంబర్‌ 18న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన భౌతికంగా దూరమై ఈ ఏడాదికి 27 సంవత్సరాలు కావస్తున్నా బీమా ఉద్యోగులకు ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ నిత్యం గుర్తుండేవే. ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల సంఘం, ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) నాయకుడిగా ప్రారంభమైన ఉద్యమ ప్రస్థానం, పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ బలపరిచిన సీపీఐ(ఎం) పార్లమెంట్‌ సభ్యునిగా కలకత్తా నార్త్‌ ఈస్ట్‌ నియోజక వర్గం నుండి ఎన్నికల బరిలో నిలిచి గెలిచి విజయం సాధించారు. పార్లమెంట్‌ 7వ లోక్‌సభలో రెండుసార్లు పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించే స్థాయివరకు చేరిన కామ్రేడ్‌ సునీల్‌ మైత్రా ఉద్యమ ప్రస్థానానికి, సైద్ధాంతిక నిబద్ధతకు జోహార్లు.
పశ్చిమ బెంగాల్‌ నాదియా జిల్లా కృష్ణనగర్‌లో 1927లో జన్మించిన సునీల్‌మైత్రా చిన్న వయస్సులోనే స్వాతంత్య్రోద్యమంవైపు ఆకర్షితులై, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కారణంగా అరెస్ట్‌ అయ్యి ఒక ఏడాదిపాటు జైలు జీవితాన్ని అనుభవించారు. 1946లో హిందుస్తాన్‌ కో-ఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరిన నాటినుండి బెంగాల్‌ నందు ఇన్సూరెన్స్‌ ఉద్యోగులను ట్రేడ్‌ యూనియన్‌ కార్యక్రమాలలో పాల్గొనేలా నిర్మాణాత్మకంగా చైతన్య పరిచినందుకుగాను, ఆనాటి ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీ యాజమాన్యం సునీల్‌ మైత్రాను మొదట కోయంబత్తూర్‌కు అనంతరం నాగపూర్‌కు బదిలీ చేసింది. యాజమాన్యం బలవంతపు బదిలీలకు భయపడకుండా శిక్షలను, అవమానాలను, వేధింపులను ఎదుర్కొని సవాళ్ళను అవకాశాలుగా మలుచుకుని బదిలీ అయిన ప్రతిచోటా యూనియన్‌ను చైతన్యవంతంగా నిర్మించారు. 1951లో ఆవిర్భవించిన ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) వ్యవస్థాప కులలో ముఖ్యులుగా ఉండి, ముందుపీఠిన నిలబడి యూనియన్‌ను నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దారు. కలకత్తా డివిజన్‌కు ప్రధాన కార్యదర్శిగా, ఈస్ట్రన్‌ జోన్‌ యూనిట్‌కు జనరల్‌ సెక్రటరీగా, ఎఐఐఇఎకు అఖిల భారత సహాయ కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా దక్షతతో బాధ్యతలు నిర్వహించారు. బెంగాలీ, ఆంగ్ల భాషల మీద మంచి పట్టువున్న సునీల్‌ మైత్రా పరిణతితో కూడిన ఆలోచనతో, భవిష్యత్‌ దార్శనికతో దిశానిర్దేశం చేసే ప్రసంగాలు ఆసాంతం ఉద్యోగులను ఆకర్షించేవి. భవిష్యత్‌ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే ఆటోమేషన్‌కు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక పోరాట సంక్లిష్ట సమయంలో, కలకత్తా ఎల్‌ఐసీ కార్యాలయంలో సూపర్‌ కంప్యూటర్‌ ప్రవేశాన్ని నిలువరించే మహోద్యమ నేపథ్యంలో పరిణతితో కూడిన ఆలోచనతో సంక్షోభ సమయంలో యూనియన్‌ను సైద్ధాంతిక ప్రాతిపదికతో ముందుకు నడిపిన సుశిక్షిత కార్మికోద్యమ సైనికుడాయన.
సునీల్‌ మైత్రా ఉద్యమపథం కేవలం ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల ఉద్యమానికే పరిమితం కాదు. విశాల కార్మికోద్యమ నిర్మాణంలో ఐక్య ఉద్యమ, సంఘీభావ కార్యాచరణలో సునీల్‌ మైత్రా భాగస్వాములయ్యారు. 1952లోనే అప్పటి అవిభక్త కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరారు. 1964లో కమ్యూనిస్ట్‌ పార్టీలో ఏర్పడిన చీలిక అనంతరం సీపీఐ(ఎం)లో ఉండి అనేక క్రియాశీలక బాధ్యతలను నిర్వహించారు. రిటైర్‌మెంట్‌కు ఏడేండ్లకు ముందుగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1980లో కలకత్తా నార్త్‌ ఈస్ట్‌ పార్లమెంటరీ నియోజక వర్గం నుండి లెఫ్ట్‌ఫ్రంట్‌ బల పరిచిన సిపిఐ(ఎం) అభ్యర్థిగా ఎన్నికలలో పోటీచేసి పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. 1980-84 మధ్య సమయంలో అప్పటి 7వ లోక్‌సభలో, ఎల్‌ఐసిని ఐదు ప్రాంతీయ కార్పొరేషన్లుగా విభజించాలనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎల్‌ఐసి విభజన బిల్లుకు సంబంధించి అధ్యయనం చేయడానికి ఏర్పాటుచేసిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీలో సభ్యునిగా ఉన్న సునీల్‌ మైత్రా తన అద్భుతమైన వాదనలతో ఈ బిల్లును ప్రతిఘటించారు. ఇందిరా గాంధీ హత్యానంతరం 7వ లోక్‌సభ రద్దయి 8వ లోక్‌సభ కొలువుతీరి రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన నేపథ్యంలో, సునీల్‌ మైత్రా ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీకి, ఎల్‌ఐసిను ఐదు రీజినల్‌ కార్పొరేషన్లుగా విభజన చేయాలని ప్రతిపాదించిన బిల్లువలన కలిగే అనర్థాలను లేఖ రాశారు. అందులో దీనివలన ఖర్చులు పెరుగుతాయని యాక్చూరియల్‌, వివిధ ప్రొఫెషనల్‌ సంస్థలు ఇచ్చిన నివేదికలను, పెరుగుతున్న ప్రాంతీయ వాద పోకడల ప్రమాదాన్ని వివరిస్తూ, ఎల్‌ఐసి విభజన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.
ఆనాటి ప్రధాని 7వ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎల్‌ఐసి విభజన బిల్లును ప్రభుత్వం పునఃపరిశీలించిందని, ఎల్‌ఐసిని ఐదు ముక్కలుగా చేసే ఈ బిల్లును ముందుకు తీసువెళ్ళబోమని హామీనిచ్చారు. 7వ లోక్‌సభలో ఎల్‌ఐసి విభజన బిల్లును ప్రవేశపెట్టారని, ఆసభ రద్దు అయ్యిందని, 8వ లోక్‌సభలో ఎల్‌ఐసి విభజన బిల్లును ప్రవేశపెట్ట బోమని ప్రధాని రాజీవ్‌గాంధీ రాతపూర్వకంగా సునీల్‌ మైత్రాకు తెలియజేశారు. నేడు ఎల్‌ఐసి దేశం గర్వించే అతిపెద్ద ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థగా రూపొందడానికి ఇటువంటి పోరాటాలే ప్రాతిపదిక అనేది నిర్వివాదాంశం. 1992లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ సైద్ధాంతిక వార పత్రిక ‘పీపుల్స్‌ డెమోక్రసీ’కి ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. ఆయన సతీమణి కామ్రేడ్‌ నీలిమా మైత్రా కూడా విశాల కార్మికోద్యమంలో భాగస్వాములై అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌కు అఖిలభారత స్థాయిలో నాయకత్వం వహించటం అభినందనీయం. అద్భుతమైన నిర్వహణాదక్షుడిగా, పోరాట కార్యాచరణ సంధానకర్తగా, ఉద్యమకారుడిగా, చర్చల సందర్భంగా నైపుణ్యం ప్రదర్శించే నాయకుడిగా, కార్మికోద్యమ విజయాలకు వ్యూహకర్తగా, విశాల కార్మికవర్గ పక్షపాతిగా, ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల హృదయాలలో చిరస్మర ణీయులుగా నిలిచిన కామ్రేడ్‌ సునీల్‌ మైత్రాకు 27వ వర్థంతి సందర్భంగా అరుణాంజలి!
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై ముప్పేట దాడి జరుగుతున్న నేటి తరుణంలో వాటిలో అంతర్భాగమైన ట్రేడ్‌ యూనియన్‌ హక్కులను కాపాడుకోవడం, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణే ప్రభుత్వ విధానంగా కొనసాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో జాతీయ ఇన్సూరెన్స్‌ రంగాన్ని పరిరక్షించుకోవడం, అందుకు అవసరమైన సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావటమే ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు సునీల్‌ మైత్రాకు అర్పించే నిజమైన నివాళి!
జి. కిషోర్‌ కుమార్‌
9440905501

Spread the love