ఈ మధ్య పార్లమెంట్‌లో పెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశ ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఎల్‌ఐసి తమ హయాంలో శక్తి వంతమైందని, సంస్థ పురోగతిపై జరిగిన దుష్ప్రచారాలు పటాపంచలు అయ్యాయని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఎల్‌ఐసి గురించి ప్రధాని సానుకూలంగా మాట్లాడడం ఆహ్వానించదగిన విషయం. ప్రభుత్వాల సహకారం కన్నా, పాలసీదారుల అచంచెల విశ్వాసం వల్లనే, ఎల్‌ఐసి ఇంత అద్భుతమైన పురోగతి సాధించిందనేది తిరుగులేని చారిత్రక వాస్తవం. ఎల్‌ఐసి ఆవిర్బావంలో, ప్రస్థానంలో జాతీయోద్యమ లక్ష్యాలు దాగి ఉన్నాయి. మన మువ్వన్నెల జెండా దేశ స్వాతంత్య్రానికి, దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక. మన దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్వావలంబనపైన ఆధారపడి ఉంటుంది. 200 సంవత్సరాలు వలస పాలనలో ఆర్థికంగా దోచుకోబడింది కనుక, దేశం ఆర్ధికంగా స్వావలంబన సాధించడానికి ప్రభుత్వరంగ సంస్థలు నెలకొల్పారు. 76ఏండ్ల స్వతంత్రంలో దేశం ఆర్థిక స్వావలంబన సాధించడంలో ప్రభుత్వ ఆర్థిక సంస్థలైన బీమా సంస్థల, బ్యాంకుల పాత్ర మహాత్తరమైనది.
స్వాతంత్రోద్యమ పోరాట సమయంలోనే స్వతంత్ర భారతం ఎలా నిర్మించాలనే అంశంపై విస్తృత మేధో మధనం జరిగింది. ‘దోపిడీని అంత మొందించాలంటే, రాజకీయ స్వేచ్ఛతో బాటు, ఆర్ధిక వెనుకబాటు ఉన్న లక్షలాది మందికి నిజమైన ఆర్థిక స్వాతం త్రం కల్పించాలని 1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సదస్సు తీర్మానించింది. 1934లో జరిగిన కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్ సమావేశంలో ‘ప్రజల పొదుపును జాతీయం చేయాల్సిన అవసరం ఉందనీ, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వానికి గట్టి నియం త్రణ ఉండాలని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుందని పేర్కొన్నారు. భారత దేశం స్వాతంత్రం సిద్ధించే నాటికి అప్పుడున్న పెట్టుబడి దారులకు తగినంత నిధులు లేవు గనుక దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థను నెలకొల్పే ఉద్దేశ్యంతోనే వారు బొంబాయి ప్లాన్‌ను రూపొందించారు. (ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు-టాటాలు, బిర్లాలు, దాల్మియాలు, సింఘానియాలు తదితరులు) దేశంలో మౌలిక వనరులు నెలకొల్పే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని, పారిశ్రామీకరణ కూడా ప్రభుత్వమే నిర్వహించాలని వారు పట్టుబట్టారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను సోషలిస్టు నమూనా పద్ధతిలో నిర్మించాలనేది సోషలిజం కాదు. సోషలిజం నమూనాలో ఆర్థిక వ్యవస్థను నిర్మించటం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిం చడమే. ఎటొచ్చి దీనిలో దిగువ, మధ్యతరగతి వర్గాలకు కొన్ని రాయితీలు కల్పిస్తారు. అందువల్లే 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ను జాతీయకరణ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పారు.
జీవిత బీమా అనేది దీర్ఘకాల పెట్టుబడి కనుక జీవిత బీమా వ్యాపారం కేవలం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. యూరోపి యన్ దేశాల్లో ప్రయివేట్ గుత్త సంస్థలు చేసిన ఆర్థిక అరాచకం గుర్తించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బీమా రంగం ప్రభుత్వ అజమాయిషీలోనే ఉండాలని తన స్టేట్స్ అండ్ మైనారిటీస్ గ్రంధంలో పేర్కొన్నారు. ‘బీమా వ్యాపార నిర్వహణ, యాజమాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వానికి బదిలీ చేసే చట్టాన్ని అమలుచేయడానికి వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఈ సభ అభిప్రాయపడుతుంది’ అని రాజ్యాంగ అసెంబ్లీ 12జనవరి 1948 నాడు తీర్మానించింది. ఆనాడు మనదేశ బీమా రంగంలో ఘోరమైన పరిస్థితులు నెలకొన్న నేపద్యంలో జీవిత బీమా రంగంలో పట్టదారుల సొమ్ముకు భద్రత ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో లభించిందని నిర్దారణకు వచ్చిన ప్రభుత్వం, జనవరి 19, 1956న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది. బీమా జాతీయకరణ ఆర్డినెన్స్‌ను అత్యంత గోప్యంగా ఇచ్చి ఉండకపోతే, ప్రయివేటు బీమా సంస్థలు మరింతగా ప్రజల సొమ్మును దిగమింగేవని ఆనాటి ఆర్థికమంత్రి సి.డి దేశముఖ్ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఎల్‌ఐసి ఆవిర్భావాన్ని మన రాజ్యాంగం ఆత్మగా భావింపబడే అదేశిక సూత్రాల అధికరణలు 38, 39లో పొందుపరచబడిన విధంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సౌధంగా చూడవచ్చు. ఈరోజు ఏడా దికి రూ.3.5లక్షల కోట్ల నుండి రూ.4లక్షల కోట్లు దేశాభి వృద్ధికి పెట్టుబడులు అందించగల స్థితిలో ఎల్‌ఐసి ఉందంటే, దానికి జాతీయోద్యమ నాయకుల దార్శనికతే ప్రధాన కారణం. 1956 నుండి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.40లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, 40 కోట్ల పాలసీదారులకు ఎల్‌ఐసి విశేష సేవలందిస్తున్నది.
అప్రతిహతంగా ఎల్‌ఐసి పురోగతి
1956లో కేవలం రూ.5కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసి, నేడు రూ.46లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చుకుంది. 2022-23 మొదటి క్వార్టర్‌తో పోల్చినప్పుడు, 2023-24 మొదటి క్వార్టర్‌లో 1300శాతం లాభం (రూ.9544 కోట్లు) ఎల్‌ఐసి ఆర్జించడం విశేషం. దేశీయ బీమా రంగంలో ప్రయివేటు బీమా కంపెనీల ప్రవేశం జరిగి 23 ఏండ్లు అయినా, ఎల్‌ఐసి నేటికీ ప్రీమియమ్ ఆదాయంలో 63శాతం మార్కెట్ వాటా, పాలసీలలో 72శాతం మార్కెట్ వాటాతో ఇప్పటికీ మార్కెట్ లీడర్‌గా ముందుకు సాగు తోంది. దేశీయ బీమా రంగంలో ఎల్‌ఐసి తర్వాత 2వ స్థానంలో ప్రయివేటు బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్ కంపెనీ!! ఎల్‌ఐసి మార్కెట్ వాటా 63శాతం ఉంటే, ఎస్‌బీఐ లైఫ్ మార్కెట్ వాటా 8శాతం లోపే !! దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మూచువల్ ఫండ్ల ఆస్తుల కన్నా ఎల్‌ఐసి ఆస్తులు 1.2 రెట్లు ఎక్కువ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సమర్థత వంటివాటిని పరిశీలిస్తే, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఎల్‌ఐసి ప్రపంచ రికార్డును కలిగి ఉంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్, నిర్వహణ సామర్థ్యాలు, ఉత్పాదకత పరంగా ప్రపంచంలోని మరే ఇతర కంపెనీ కూడా ఎల్‌ఐసి లాంటి రికార్డును పొందలేదు. ప్రపంచంలో 99శాతం పైబడి క్లైములను పరిష్కరిస్తూ, నేటికీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఎల్‌ఐసి ఉంది. దేశంలో రక్షణ, రైల్వేల తర్వాత ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ఆర్థిక సంస్థగా ఎల్‌ఐసీ పేరెన్నికకంది. ఫార్చ్యూన్ గ్లోబల్ సూచీ-2023లో 107వ ర్యాంక్ పొందడమే గాక, మొత్తం ప్రీమియం ఆదాయంలో ప్రపంచంలో పదవ అతి పెద్ద సంస్థగా ఎల్‌ఐసి నిలిచింది.
”ప్రజల పొదుపు ప్రజల శ్రేయస్సు కోసమే” అనే నినాదంతో 1956 నుండి ఇప్పటివరకి దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 40లక్షల కోట్ల రూపాయలు పైబడి పెట్టుబడులుగా పెట్టింది. 31 మార్చి 2022 నాటికి ఎల్‌ఐసి రూ.40, 84,826 కోట్ల పెట్టుబడులను మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టింది. ఇందులో రూ.28,85,569 కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలలో, హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ఎల్‌ఐసి కేటా యించింది. సుమారు ఒక లక్షల ఉద్యోగులను మాత్రమే కలిగిన ఎల్‌ఐసి సంస్థ దాదాపు 30కోట్ల వ్యక్తిగత పాలసీలకు సేవలు అందిస్తోంది. ఎల్‌ఐసి సంస్థ కోసం పని చేసే 13.43లక్షల ఏజెంట్‌లలో 48శాతం పైబడి గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నారు. నేడు దేశీయ బీమా రంగంలో ఉన్న 26 ప్రయివేటు బీమా కంపెనీలు అన్నీ కలిపి దేశంలో ఉన్న 79శాతం జిల్లాల్లో ఆఫీసు లు కలిగి ఉంటే,ఒక్క ఎల్‌ఐసి సంస్థనే దేశవ్యాప్తంగా ఉన్న 92 శాతం జిల్లాల్లో కార్యాలయాలు కలిగి ఉంది. ప్రయివేటు బీమా రంగంలో ఉన్న మొత్తం పాలసీల సంఖ్య దాదాపు 6 నుండి 6.5కోట్ల వరకు ఉంది. అయితే దాదాపు 2.45లక్షల మంది ఉద్యోగులు ప్రయి వేటు బీమా రంగంలో పనిచేస్తున్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల ఉత్పా దకత ప్రయివేటురంగ ఉద్యోగుల కంటే చాలా ఎక్కువ. మొత్తం ఖర్చులు, జీతానికి సంబంధించిన ఖర్చులు వంటి వాటిని పోల్చిన ప్పుడు ప్రతి అంశంలో ఎల్‌ఐసి, ప్రయివేటు బీమా కంపెనీలతో పోలిస్తే మెరుగ్గా ఉంది.
ప్రభుత్వ బీమా రంగం ముందున్న సవాళ్లు!
నేడు ప్రభుత్వ బీమా రంగం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వ బీమా రంగ ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉండే కొన్ని విధాన నిర్ణయాలను తీసుకురావడానికి బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డిఏఐ) ప్రయత్నాలు చేస్తోంది!ఈ మధ్య ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో బీమా చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ప్రచారం జరిగినా, ప్రభుత్వం వెనక్కు తగ్గింది. బీమా చట్ట సవరణల ద్వారా, కనీస మూలధన అవ సరాన్ని మార్చాలని, కమిషన్ చెల్లింపులో మార్పులను, మిశ్రమ లైసెన్సుల జారీని అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సవరణలు అమలైతే, ప్రజల పొదుపుకు హాని కలిగించే మోసపూరిత అవకాశాలు ఉన్న1956కి ముందు ఉన్న కాలానికి బీమా రంగం వెళ్లినట్లవుతుంది. ఐఆర్‌డిఏఐ కూడా లైఫ్, నాన్-లైఫ్ వ్యాపారంలో దాదాపు ఇరవై కంపెనీలకు లైసెన్స్‌లు జారీ చేసే అవకాశం ఉందని ప్రకటించడం ద్వారా బీమా మార్కెట్‌లో ఎక్కువ కంపెనీలను అనుమతించాలని యోచి స్తోంది. ప్రతి భారతీ యుడు 2047 నాటికి బీమా పాలసీని కలిగి ఉండాలని, దాని కోసం బీమా వ్యాప్తిని పెంచాలని ప్రభుత్వం, ఐఆర్‌డిఏఐ వాదిస్తూ వచ్చాయి. కానీ తామర తంపరాలుగా ప్రయివేటు బీమా కంపెనీలను అనుమతించడం ద్వారా, బీమా వ్యాప్తిని పెంచలేమని గమనించాలి.
జీఎస్టీ అన్యాయం
బీమా వ్యాప్తి ప్రజల మిగులు ఆదాయంపై ఆధారపడి ఉం టుంది, బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో ఇది చాలా తక్కువగా ఉంది. తలసరి ఆదా యంలో ప్రపంచ దేశాల్లో మన స్థానం 138వది. భారతదేశంలో జీవిత బీమా సాంద్రత, జీవిత బీమా వ్యాప్తి కెనడా కంటే చాలా ఎక్కువ, ఇది యునైటెడ్ స్టేట్స్‌తో సమానం. మన దేశంలో ఆర్థిక వాతా వరణం అంత ఆశాజన కంగా లేకున్నా ఎల్‌ఐసి, ప్రభుత్వ రంగ బీమాసంస్థలు అద్భుతమైన ప్రదర్శన నమోదు చేసాయి. ఇంత అద్భుతమైన పనితీరున్నప్పటికీ, ప్రభుత్వ బీమా రంగ ప్రయోజనాలను దెబ్బ తీసే చర్యలు తీసుకువ స్తుండటం ఏ మాత్రం సమంజసం కాదు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం అన్యాయం మాత్రమే కాదు, అనైతికం కూడా.భారత రాజ్యాంగం గౌరవ ప్రదంగా జీవించే హక్కును కల్పించిన సందర్భంలో ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా చూడాలి. అలాంటి బీమా పొదుపుపై రాయితీ ఇవ్వలేదు సరికదా, ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుండి అధిక ప్రీమియం పాలసీలపై తాజాగా పన్ను విధించింది. కచ్చితంగా, ఇది పరిశ్రమపై దీర్ఘకాలిక ప్రభావం చూపు తుంది. కాబట్టి ప్రభుత్వ రంగ బీమా పరిశ్రమ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల ప్రయోజనాల దష్ట్యా ఈ అంశాలను ప్రభు త్వం పునః పరిశీలించాలి. కస్టమర్ సేవలలో మరింత మెరు గుదలలు తీసుకురావడానికి, దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపశ మనం కలిగించడం కోసం ఎల్‌ఐసిలో తరగతి 3, 4 ఉద్యో గుల ఉద్యోగుల నియామకాలు తక్షణం చేపట్టవలసిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్‌లో నమోదైన మార్కెట్ కాపీటలైజషన్ కన్నా ఎల్‌ఐసి నిజవిలువ కొన్ని రెట్లు ఉంటుం దనే వాస్తవాన్ని ప్రజలకు, పాలసీదారులకు తెలియ చెప్ప డానికి జన సభలు, వీధి సమావేశాలు దేశవ్యాప్తంగా నిర్వ హించాలని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఇప్పటికే పిలుపునిచ్చింది. పార్లమెంటు సాక్షిగా ఎల్‌ఐసిని కీర్తించిన ప్రధాని ప్రభుత్వ బీమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. 76ఏండ్ల దేశ స్వాతంత్య్ర ప్రస్థానంలో దేశ ఆర్థిక పరిపుష్టికి, స్వావలంబనకు విశేష కృషిచేస్తున్న ఎల్‌ఐసి ని బలోపేతం చేయడమే నిజమైన దేశభక్తికి తార్కాణం.
పి. సతీష్
9441797900