Sunday, June 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

ట్రంప్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

- Advertisement -

ఇమ్మిగ్రేషన్ విధానం చెల్లదంటూ అమెరికా ఫెడరల్ జడ్జ్ తీర్పు 39 దేశాల దరఖాస్తుదారులపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్య
నిర్ణయం కోసం సుదీర్ఘ నిరీక్షణ
తప్పడం లేదని ఆక్షేపణ


వాషింగ్టన్ : అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానాలు తరచూ మొట్టి కాయలు వేస్తున్నాయి. ఆయన నిర్ణయాలను కొట్టి వేస్తున్నాయి. తాజాగా అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను రోడ్ ఐలండ్‌లోని ప్రావిడెన్స్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జాన్ మెక్‌కానెల్ కొట్టివేశారు. ట్రంప్ ప్రభుత్వం అనేక చట్టవిరుద్ధ విధానాలను అనుసరించిందని అక్షింతలు వేశారు. ఆశ్రయం, పని చేసేందుకు అనుమతులు, గ్రీన్‌కార్డులు, పౌరసత్వం కోసం పెట్టుకున్న దరఖాస్తులపై నిర్ణయాలు పొంద కుండా 39 దేశాల ప్రజలను ఈ విధానాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలు అనేక ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య దేశాల ప్రజలను నిరవధిక చట్టపరమైన సందిగ్థంలో పడేశాయని అన్నారు. కాంగ్రెస్ ఆమోదించిన, అమెరికా సిటిజన్‌షిప్-ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ -యూఎస్‌సీఐఎస్) అవలంబించిన చట్టపరమైన ప్రక్రియలకు వలసదారులు కట్టుబడి ఉన్నప్పటికీ నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు.

ఇమ్మిగ్రేషన్ సంస్థలు, కార్మిక సంఘాల విజయం
ట్రంప్ ప్రభుత్వం వలసవాద వ్యతిరేక భావాల ఆధారంగా ఈ విధానాలను రూపొందించిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖలో భాగమైన యూఎస్‌సీఐఎస్ ఆమోదించిన విధానాలను సవాలు చేస్తూ మార్చిలో పలు ఇమ్మిగ్రేషన్ సంస్థలు, కార్మిక సంఘాలు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ తీర్పు ద్వారా ఆయా సంస్థలకు పెద్ద విజయం లభించినట్లయింది. ‘ఈ తీర్పు ఓ ప్రాథమిక సూత్రాన్ని పునరుద్ఘాటిస్తోంది. సమాఖ్య ప్రభుత్వం చట్టపరమైన వలస మార్గాలను మూసివేయకూడదు. ప్రజలు ఎక్కడ నుంచి వచ్చారనే అంశం ఆధారంగా వారి పట్ల వివక్ష చూపకూడదు’ అని ఈ కేసులో ఆయా సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన డెమొక్రసీ ఫార్వర్డ్ సంస్థ అధ్యక్షురాలు, సీఈఓ స్కై పెర్రీమాన్ చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ చట్టవిరుద్ధ విధానాలు దేశంలోని కుటుంబాలు, కార్మికులు, ఆశ్రయం కోరే వారు, సమాజాలకు అపారమైన హాని కలిగిస్తాయని విమర్శించారు. ప్రభుత్వ విధానాలు వారిని అనిశ్చితిలో పడేస్తాయని, పని చేయలేక…రక్షణ పొందలేక జీవితంలో ముందుకు సాగలేరని తెలిపారు.

యూఎస్‌సీఐఎస్‌ పై ఆగ్రహం
‘విధానాల రూపకల్పనలో తనకు లేని చట్టబద్ధతను, నియంత్రణ అధికారాన్ని యూఎస్‌సీఐఎస్ క్లెయిమ్ చేసుకుంటోంది. తాను విధిగా అందించాల్సిన హేతుబద్ధమైన వివరణలను ఇవ్వకుండానే నిర్ణయాలు తీసుకుంటోంది. తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన దరఖాస్తుదారుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక భావాలను కప్పిపుచ్చేందుకు జాతీయ భద్రత పేరుతో తన చర్యలను సమర్ధించుకుంటోంది. చట్టపరంగా చెప్పాలంటే యూఎస్‌సీఐఎస్ చర్యలు ఏకపక్షంగా, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిలో హేతుబద్ధత లోపించింది’ అని న్యాయమూర్తి
వ్యాఖ్యానించారు.

ఏమిటీవిధానాలు?
ట్రంప్ ప్రభుత్వ విధానాలు యూఎస్ సిటిజన్‌షిప్-ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)కు వర్తిస్తాయి. అమెరికాలో పని చేయడానికి లేదా ఆ దేశ పౌరులుగా మారడానికి వివిధ దేశాలకు చెందిన వారు చేసుకునే దరఖాస్తులను ఈ సంస్థ ఆమోదిస్తుంది. ఈ సంస్థ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పరిధిలో ఉంటుంది. ఆశ్రయం కల్పించాలంటూ వచ్చే దరఖాస్తులను కూడా ఈ సంస్థే ఆమోదిస్తుంది. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో అప్పటికే అమెరికాలో ఉన్న వారికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తారు. అలాగే సరిహద్దు వద్ద ఆపేసే వారికి ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులు ఆశ్రయాన్ని మంజూరు చేస్తారు. తాజా తీర్పు వీరికి వర్తించదు. ఈ తీర్పు కేవలం వ్యాజ్యం లో చేర్చిన కేసుల పైనే కాకుండా యూఎస్‌సీ ఐఎస్ వద్ద పెండింగులో ఉన్న కేసులపై కూడా ప్రభావం చూపు తుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్‌లో ప్రభుత్వ సంబంధాల సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న షెవ్ దలాల్ ధేనీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -