– సహకార వ్యవస్థ కంప్యూటరీకరణ
– 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు
– వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రూ.1050 కోట్లతో ఐదు పామాయిల్ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలి రోజే పామాయిల్, రైతు వేదికలు, సహకార వ్యవస్థ కంప్యూటరీకరణ మొదలగు మూడు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఐదేండ్లలో ఏడాదికొకటి చొప్పున పామాయిల్ పరిశ్రమను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నెల కొల్పుతామన్నారు. పరిశ్రమల స్థాపనతో ప్రతీ జిల్లాలో ప్రత్యక్ష, పరోక్ష, ఉపాధి లభిస్తుందని అన్నారు. టీఎస్ ఆయిల్ ఫెడ్ 2023-24 నుంచి ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. 25 నుంచి 30 ఏండ్ల వరకు దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పంటగా రైతుకు స్థిరమైన ఆదాయం పామాయిల్ సాగు ద్వారా వస్తుందన్నారు. ఈ సంట సాగుతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ.4.07కోట్లతో అధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రైతు వేదికల్లో రైతులకు అత్యాధునిక సాగుపద్దతులపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. వ్యయసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికల్ని తీర్చిదిద్దుతామన్నారు.సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు గానూ వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గద్వాల కు చెందిన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తూ మంత్రి నియామక పత్రాన్ని అందజేశారు..