ఎన్నికల బరిలో ఏడుగురు ఎంపీలు

Seven MPs in the election ring– కాంగ్రెస్‌, బీజేపీల నుంచి ముగ్గురు..
– బీఆర్‌ఎస్‌ నుంచి ఒకరు
– అందరూ హేమాహేమీలే
– గెలుపు ఎవరిని వరించేనో?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి అంకమైన నామినేషన్ల ఘట్టం పూర్తయే సరికి ఏడుగురు ఎంపీలు బరిలో మిగిలారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు, బీజేపి నుంచి ఎన్నికైన నలుగురిలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాత్రం ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో ఎంతమంది గెలిచి తమ ఎంపీ పదవి వదులుకుంటారో డిసెంబర్‌ 3న తేలి పోనుంది.
కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలిచిన ముగ్గురు ఎంపీలు ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నవారే. టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మేడ్చల్‌ మల్కాజిగిరి నుంచి గెలుపొందారు. ప్రస్తుతం. తన సొంత నియోజక వర్గమైన కోడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీలో ఉన్న కామారెడ్డి నుంచి బరిలో దిగారు. మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌ నగర్‌ నుంచి పోటీలో నిలబడ్డారు. 2018 శాసన సభ ఎన్నికల్లో ఆయన హుజూర్‌ నగర్‌ నుంచి గెలిచినప్పటికి, 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశం మేరకు నల్గోండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన సతీమణి పద్మావతి రెడ్డిని హుజూర్‌నగర్‌ నుంచి బరిలోకి దించగా సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌కు చెందిన శానంపూడి సైది రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక మరో కాంగ్రెస్‌ నేత కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గోండ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం నల్గోండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఇక బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు సైతం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్తి గంగుల కమలాకర్‌ చేతిలో ఓడిపోయారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌ కుమార్‌పై గెలుపొందారు. 2019 ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన ధర్మపురి అర్వింద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. మరో బీజేపీ ఎంపీ సోయం బాబురావు 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఆయన బోథ్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. బీఆర్‌ఎస్‌ నుంచి మెదక్‌ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీలో నిలబడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన వీల్‌ చైర్‌లోనే వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి మొత్తం ఏడుగురు ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. :హౌరా హౌరిగా సాగుతున్న సమరంలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

Spread the love