ఐద్వా నాయకురాలు వాసుకి రాసిన ”మహిళల చైతన్యం గురించి చర్చించుకుందాం” అన్న చిన్న పుస్తకం ఇప్పుడు ఇంగ్లీషులో వచ్చింది. కానీ దీనికో ప్రత్యేకత ఉన్నది. రచయిత్రి తమిళనాడు నాయకురాలు. రాసింది తమిళంలో. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వోపాధ్యాయుడు యతిరాజులు తెలుగులోకి అనువదించారు. దీనిని ఆంగ్లానువాదం చేసినవారు ఉష. హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు మహిళలు జనీలా, రమాదేవి పూనుకుని ఆంగ్లానువాదం చేయించారు. రైతు ఉద్యమ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరించారు. వీటివరకు పెద్దగా ప్రత్యేకత ఉన్నట్టు అనిపించదు. కానీ చెట్టుమీద కాయ, సముద్రంలో ఉప్పు కలిసి రుచికరంగా మారినట్టుగానే తమిళ పుస్తకం, ఆంగ్లంలో హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రభుత్వ ముద్రణాలయంలో కార్మిక నాయకుడుగా పనిచేసిన పి వెంకటేశ్వరరావు గారి 90వ జన్మదిన సందర్భంగా జరగడమే ప్రత్యేకత.
మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటానికి పెద్దగా అభ్యంతరాలు ఉండవు. భూస్వామ్య సమాజపు లక్షణాలు, వాటి భావజాలం మీద, సంప్రదాయాల పేరుతో అమలు జరిగే వివక్ష మీద పోరాటానికి కూడా కొంచెం కష్టపడితే కలిసొచ్చేవారు బాగానే ఉంటారు. కానీ తన ఇంట్లోనే పురుషాధిక్యత మీద పోరాటం అంత సులభం కాదు. దీనికి మద్దతు, సహకారం లభించటం కూడా అంత సులభం కాదు. అందుకే, ఈ పుస్తకం ఆంగ్లానువాదానికీ, హైదరాబాద్‌లో ఆవిష్కరణకు ప్రాధాన్యత ఏర్పడింది. సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గ్యాసు సిలిండర్ ధర వందరూపాయలు తగ్గిస్తూ ప్రధాని మోడీ ప్రకటించారు. మహిళలకు ఇది ప్రత్యేక కానుక అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికీ, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుకు సంబంధం ఏమిటి? మహిళలకే ఇది కానుక ఎట్లా అయ్యింది? ఆ సిలిండర్ల గ్యాసుతో చేసిన వంటలు మహిళలు మాత్రమే తింటారా? అందరూ తింటారని మనకు తెలుసు. ‘మహిళలకు కానుక’ అంటే మహిళలను వంట ఇంటికి పరిమితం చేసే ఆలోచనే కదా! అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తికి కూడా ఇది వ్యతిరేకం. కానీ కేంద్రంలో బీజేపీ సర్కారు, మోడీ నాయకత్వం చేయదల్చుకున్నదే చేస్తారు కదా! మనుస్మృతి ప్రకారం మహిళ వంటింటికే పరిమితం కావాలి. అందుకే ప్రధాని మోడీ ప్రకటన కూడా ఆ దిశలోనే ఉన్నది. ‘నస్త్రీ స్వాతంత్య్రమర్హతి’ (స్త్రీకి స్వాతంత్య్రం అనుభవించే అర్హత లేదు) అని చెప్పేది మనుస్మృతి. భూస్వామ్య వ్యవస్థే అన్నీ నిర్ణయించిన కాలంలో, రాచరిక వ్యవస్థలో ఈ విధానం బలపడింది. భావజాలం విస్తరించింది. తిట్లు కూడా మహిళలను, కొన్ని సామాజిక తరగతులను కించపరిచే విధంగా ఏర్పడ్డాయి. ‘ఛండాలం’, ‘కసాయి’ లాంటి తిట్టు పదాలు ఇలాంటివే. లం….కొడుకు, ముం….కొడుకు లాంటి తిట్లు మహిళను కించపరిచేవి. అమ్మ, అక్క, చెల్లిని ఉద్దేశించిన బూతులు అనేకం చూస్తున్నాం. తిట్టదల్చుకున్న వ్యక్తిని కాకుండా, ఆ వ్యక్తికి సంబంధించిన మహిళలను కించపరచటం. ‘ఆడంగలోడు’, ‘మగతనం ఉన్నదా?’, ‘వీడురా మగాడంటే’, ‘గాజులు తొడుక్కోలేదిక్కడ ఎవరూ’, ‘నిర్వీర్యం’ లాంటి మాటలన్నీ మహిళ లను తక్కువచేసి చూపించేవే. ప్రభుత్వం మీద పోరాటం అయినా, భూస్వామ్య సంబంధాలు, భావజాలం మీద అయినా పోరాడినపుడు మద్దతు కూడగట్టటం సులభమే! రాజకీయ పోరాటం, సైద్ధాంతిక పోరాటం, ఆర్థిక పోరాటం బాగానే ఉంటాయి. కానీ పురుషాధిక్యత మీద పోరాటం మాత్రం పెద్ద పరీక్ష. ఇది ఇంట్లో కూడా ప్రతిబింబిస్తుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
వాసుకి రాసిన పుస్తకం మహిళల చైతన్యం గురించి. మహిళా చైతన్యం అంటే…. తన భార్య, అక్క, చెల్లి కూడా కదా! ఇంటి పనీ-బయటి పని, కుటుంబంలో నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం, ఆస్తిలో వాటా, చదువులో ప్రాధాన్యతలు, ఆస్తి ఎవరిపేరు మీద రిజిస్టర్ చేయాలి… ఇలాంటి సమస్యలన్నీ ముందుకొస్తాయి. భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్న కుటుంబాలలో కొంతమేరకు ఇంటిపనిలో పరస్పర సహకారం కనిపిస్తుంది. అవసరంకొద్దీ చేయటమే తప్ప అక్కడ కూడా మహిళల హక్కుగా అంగీకరించడం కష్టం. పురుషులలో అంత చైతన్యం అరుదు. అందుకే మహిళా చైతన్యం గురించి మాట్లాడేటపుడు, ఉద్యమ సంబంధాలున్న పురుషులలో కూడా ఈ చైతన్యం అవసరం. అందుకే పుస్తకం చిన్నదే అయినా సందేశం పెద్దది. కుటుంబంలో భార్యాభర్తలు జీవిత భాగస్వా ములు. ఒకరికొకరు శత్రువులు కాదు. కానీ జీవిత భాగస్వామి మీద పురుషాధిక్యత మాత్రం ‘పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణసంకటం’ లాంటిదే. ఇది వికటిస్తే భయానకం కూడా. అన్యోన్య దాంపత్య సంబంధాలలో కూడా పురుషాధిక్యత స్పష్టంగానే ఉంటుంది. మహిళ అణగి ఉండటంలోనే ”అన్యోన్యత” వికసిస్తుంది. అలాంటి స్త్రీని ఆదర్శ మహిళగా కీర్తిస్తారు.
మనువాద భావజాలం ప్రభావం సమాజంలో నరనరాన జీర్ణించు కున్నది. పెట్టుబడిదారీ సమాజంలో కార్మికులు పెట్టుబడిదారుల కోసం బానిస చాకిరీ చేస్తున్నారు. ఈ బానిస చాకిరీని కార్మికులు వ్యతిరేకిస్తారు. కానీ ఇంటికి రాగానే, అదే కార్మికుడు భార్యతో బానిస చాకిరీ చేయించు కుంటాడు. ఇక్కడ స్త్రీ బానిసకు బానిస అయ్యింది. అగ్రవర్ణ పెత్తందారీ దురహంకారాన్ని అణగారిన తరగతులు వ్యతిరేకిస్తాయి. మనువాదం అంతం కావాలని నినదిస్తారు. కానీ అదే అణగారిన తరగతుల కుటుంబాలలో పురుషులు తమ స్త్రీల మీద కూడా ఆధిపత్యం చెలాయిస్తారు. ఇది కూడా మనువాదం ఫలితమేనన్న విషయం గుర్తించరు. ఇంట్లో మాత్రం తాను కుటుంబ పెద్దననీ, భార్యమీద తనకు సర్వాధికారాలున్నాయనీ భావిస్తారు. కుల వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి ఏ కులమూ మినహాయింపు కాదు. ఏ మతమూ స్త్రీ పురుష సమానత్వాన్ని ఒప్పుకోదు. సతీసహగమనం మీద పోరాటానికి ఎంతటి ఎదురుగాలి నెదుర్కోవల్సి వచ్చిందో తెల్సిందే. జ్యోతిబా ఫూలె, సావిత్రిబాయి ఫూలె ఎదుర్కొన్న ఎదురుగాలీ తెలిసిందే. ఆధునిక భారతదేశంలో కూడా బీజేపీ పార్లమెంటు సభ్యుడు చంద్ర ప్రకాశ్ జోషి బహిరంగంగానే ‘సతి’ని కీర్తించాడు. మేవార్ రాణి పద్మావతి ”తన ఆత్మగౌరవం కాపాడుకోడానికి సతీ సహగమనం పాటించింది” అన్నాడు. బీజేపీకి చెందిన మరో ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్ల (మల్లయోధులు) మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తీవ్రమైన ఆరోపణలు న్నాయి. వాటికి తగిన ఆధారాలు న్నాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అయినా బీజేపీ చర్య తీసుకోడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం కూడా నేరస్తులను రక్షించేందుకే ప్రయత్నించింది. జమ్ము-కాశ్మీర్‌లో బీజేపీ అధికారంలో ఉండగా ఒక మైనరు బాలికమీద గుడిలో సామూహిక లైంగిక దాడి జరిగింది. పోలీసు అధికారుల చొరవతో నేరస్తులు జైలుకు పోయారు. కానీ, వారిని విడుదల చేయాలని హిందూ మహాసభ ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శనలో ఇద్దరు రాష్ట్ర బీజేపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. హత్రాస్‌లో కూడా దళిత మహిళ లైంగిక దాడికి గురైనపుడు, నిందితులను విడుదల చేయాలని సాక్షాత్తూ బీజేపీకి చెందిన స్థానిక పార్లమెంటు సభ్యుడు డిమాండ్ చేసాడు. పదిన్నర మాసాలుగా మణిపూర్‌లో ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న దాడుల మీద ప్రధాని స్పందించడానికి సిద్ధంగా లేరు. కులవ్యవస్థ భారతదేశ అభివృద్ధికి మూలమని భావించే రాజకీయ పార్టీలు ఇంతకన్నా భిన్నంగా స్పందిస్తాయని ఆశించలేము. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే రాజకీయ పార్టీ, ఆ పార్టీ పాలనలో ప్రభుత్వాధినేతలు ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తిస్తారా? బాల్యంలో తండ్రి సంరక్షణలో, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకుల సంరక్షణలో ఉండటం తప్ప మహిళకు ప్రత్యేక స్థానాన్ని మనువాదం ఒప్పుకోదు. ఇలాంటి బలమైన సామాజిక బంధనాల మధ్య మనం మహిళల చైతన్యం గురించి మాట్లాతున్నాం. అందుకే పి.వెంకటేశ్వర రావు గారి పుట్టినరోజు పేరుతో ఈ పుస్తకం విడుదల ప్రత్యేకతను సంతరించుకున్నది.
ఈ పుస్తకం తెలుగులో వచ్చినపుడు వెంకటేశ్వరరావు గారు చదివారు. ”ఈ తరం పిల్లలు ఇంగ్లీషు చదువులు కదా! ఈ పుస్తకం ఇంగ్లీషులో వస్తే బాగుండును” అన్నారట. ఆయన బిడ్డ జెన్నీ (జెనీలా), తమ్ముడు చలపతిరావు బిడ్డ రమాదేవి చొరవ చేసి ఆంగ్లానువాదం చేయించారు. దానిని ఎడిట్ చేసినవారు రాఘవయ్య, రమాదేవి భర్త. ముందుమాట రాసింది ఎం కృపేందర్.., రమాదేవి అక్క విమల భర్త. పుస్తకావిష్కరణ సభ సమన్వయకర్త అశోక్… జెనీలా భర్త. మహిళా చైతన్యం గురించి చర్చించుకుందామన్న పుస్తకం ఆంగ్లంలో రావటంలో వెంకటేశ్వరరావు గారి కుటుంబంలోని పురుషుల పాత్ర ఇది.
మహిళా చైతన్యాన్ని ప్రోత్సహించటంలో స్త్రీ, పురుషుల సమిష్టి కృషి ఈ కుటుంబంలో చూడొచ్చు. ఉద్యమ సంబంధాలున్న పురుషులలో ఈ చైతన్యం పెరిగితే, సమాజంలో మార్పు కోసం జరిగే కృషి ఎంతటి అనుభూతినిస్తుందో కూడా గమనించవచ్చు. సుమారు అరవై సంవత్సరాల వెంకటేశ్వరరావు గారి ఉద్యమ జీవితం తన కుటుంబసభ్యుల ఆలోచనలను కూడా మలిచింది. తన కుటుంబంతో పాటు తన తమ్ముడి కుటుంబాన్ని కూడా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తీర్చిదిద్దారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగానే ఆయనతో పాటు, తన బిడ్డలు జెనీలా, సుశీల తమ మరణానంతరం మెడికల్ కాలేజీలకు శరీరదానం చేస్తూ సంతకాలు చేసారు. స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపిన వెంకటేశ్వరరావు గారికి పుట్టినరోజు వంటి వేడుకలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ చేసుకోలేదు. కానీ ఇప్పుడా యన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఎప్పుడో ఒకసారి తప్ప ఎవరినీ గుర్తుపట్టడంలేదు. అందుకే పుట్టినరోజు పేరుతో పుస్తకం విడుదల చేసారు. ఈ కృషి నేటి తరానికి ఆదర్శప్రాయం.
ఎస్. వీరయ్య