రేపటినుంచి సంగారెడ్డిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

From tomorrow in Sangareddy SFI State Plenary Meetings– తొలిరోజు విద్యార్థుల ప్రదర్శన, బహిరంగసభ
– ముఖ్యఅతిథిగా ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను
– బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం సంక్షోభం
– సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌ పోరాటాల రూపకల్పన : రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, నాగరాజు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు సంగారెడ్డిలో జరగనున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాల తొలి రోజు విద్యార్థుల ప్రదర్శన, బహిరంగ సభను నిర్వహిస్తున్నామనీ, దీనికి ముఖ్యఅతిథిగా ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను హాజరవుతారని చెప్పారు. రెండోరోజు శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులతో సభ జరుగుతుందన్నారు. మూడోరోజు ఆదివారం విద్యారంగం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌ పోరాటాలను రూపకల్పన చేస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యారంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగం సమస్యల వలయంలో చిక్కుకుందని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు అభివృద్ధి లేదన్నారు. పాఠశాలల్లో 24 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 5,089 పోస్టులనే భర్తీ చేయడం సరైంది కాదని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో 5,552 అధ్యాపక పోస్టులు, బోధనేతర సిబ్బంది ఖాళీలు న్నాయని వివరించారు. ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందలేదని విమర్శించారు. విద్యారంగంలో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలున్నాయనీ, మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సైకిల్‌ జాతాలు, పాదయాత్రలు, జీపు జాతాల ద్వారా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. పూర్తిస్థాయిలో సర్వేలు చేశామనీ, ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు, ప్రహరీగోడలు, కరెంటు, రన్నింగ్‌ వాటర్‌, సైకిల్‌ స్టాండ్లు, రవాణా సౌకర్యం, హాస్టళ్లు లేక అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కంప్యూటర్లు లేవనీ, స్కావెంజర్లను నియమించలేదని అన్నారు. మన ఊరు-మనబడి ద్వారా పాఠశాలలు బాగుపడకుండా కాంట్రాక్టర్లు నిధులను దండుకుంటున్నారని విమర్శించారు. మెస్‌చార్జీలను పెంచామంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికీ వాటిని అమలు చేయడం లేదన్నారు. పరోక్షంగా నూతన విద్యావిధానానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలియజేస్తున్నదని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో సంక్షేమం కరువైందనీ, అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలున్నాయని అన్నారు. గురుకులాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని కోరారు. ఆ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె అశోక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జె రమేష్‌, హైదరాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమాన్‌, స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love