Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఢిల్లీ పోలీసుల వేధింపులకు ఎస్ఎఫ్ఐ తలొగ్గదు

ఢిల్లీ పోలీసుల వేధింపులకు ఎస్ఎఫ్ఐ తలొగ్గదు

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ పై కక్షసాధింపు చర్యలు సిగ్గుచేటు
విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై ఎస్ఎఫ్ఐ ఖండన
నవతెలంగామ బ్యూరో -హైదరాబాద్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి ఘోష్ పై ఢిల్లీ పోలీసులు కక్షసాధింపు చర్యలకు దిగడం పట్ల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి ఉద్యమానికి సంబంధించిన నిరసనల్లో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్బంధ చర్యలు కొనసాగిస్తోందని వారు విమర్శించారు. ఇందులో భాగంగానే మంగళవారం ఢిల్లీలోని ఏకేజీ సెంటర్‌కు వెళ్లి కామ్రేడ్ ఐషేను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనను వ్యక్తం చేసిన విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులపై తప్పుడు కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, దాడులకు పాల్పడడం వంటి చర్యలు దేశవ్యాప్తంగా కొనసాగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాట్నా, కోల్‌కతా, గువాహటి, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఇటువంటి నిర్బంధ చర్యలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ పరిణామాలు భిన్నాభిప్రాయాలను సహించలేని కేంద్ర ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేస్తున్నాయని ఆక్షేపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని తప్పుపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై ప్రతీకార చర్యలను మరింత తీవ్రతరం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిపై దాడే అని మండిపడ్డారు. విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమ నాయకులపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని వారు తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు కలిగించిన ఎస్ఎఫ్ఐ దృఢంగా నిలబడి పోరాడుతుందే తప్ప ఎలాంటి బెదిరింపులు, నిర్బంధాలు విద్యార్థి ఉద్యమాలను ఆపలేవని స్పష్టం చేశారు. అణచివేత చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్య పోరాటాలను ఎస్ఎఫ్ఐ ఉధృతం చేస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -