ఖమ్మంలో కాంగ్రెస్‌కు షాక్‌..

– మాజీ మంత్రి సంభానితో పాటుపలువురు బీఆర్‌ఎస్‌లో చేరిక
–  సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్న నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, టీపీసీసీ ముఖ్య నేత సంభాని చంద్రశేఖర్‌ సహా పలువురు నాయకులు సీఎం కేసీఆర్‌ సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఎడవల్లి కృష్ణ, కోటూరి మానవతారారు, డాక్టర్‌ రాంచందర్‌నాయక్‌, మడత వెంకట్‌ గౌడ్‌ లకు కేసీఆర్‌ ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దగ్గరుండి మరీ నేతలందరినీ పార్టీలో చేర్పించారు. బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయటం కోసమే తామంతా పార్టీలో చేరుతున్నామని వారు ప్రకటించారు. పార్టీలో చేరిన నాయకులందరి సేవలు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్‌ ఖమ్మం జిల్లా నేతలకు సూచించారు. అంతకు ముందు వీరందరినీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రగతిభవన్‌కు పిలిపించుకుని పార్టీలోకి ఆహ్వానిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love