నిరుపేద గొంతుక బొల్లం ఎల్లయ్య
నవతెలంగాణ-నెల్లికుదురు
సభలో నిశ్శబ్దం పేదవాడి రోదనం భూమిలేని వాడికి రాజ్యంలో చోటు ఏది అని నిరుపేద గొంతుక బల్లం ఎల్లయ్య అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అది ప్రజాస్వామ్య దేవాలయం.. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే శాసనసభ. అక్కడ గంటల తరబడి చర్చలు జరుగుతాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటారు. కానీ, ఆ గొంతుకలన్నీ ఎకరం భూమి కూడా లేని నిరుపేద కూలీ దగ్గరికి వచ్చేసరికి మూగబోతాయెందుకు? అధికార పీఠం ఏదైనా, పాలకులు ఎవరైనా.. ప్రభుత్వ ఫలాలు కేవలం ‘భూమి’ ఉన్నవారికేనా? మరి ఆ భూమిని నమ్ముకుని, చెమటను చిందించే నిరుపేద బతుకులకు దిక్కెవరు?
అందలమెక్కిన వారికే అన్నీ..
నేడు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం భూమిని ప్రాతిపదికగా తీసుకుంటోంది. రైతుబంధు బోనస్ కావాలన్నా భూమి ఉండాలి, బ్యాంకులో క్రాఫ్ట్ లోన్ (పంట రుణం) తీసుకోవాలన్నా పట్టా ఉండాలి. చివరకు భూమిని తాకట్టు పెట్టి ల్యాండ్ మార్టిగేజ్ లోన్ తీసుకోవాలన్నా ఎకరాలు ఉండాలి. మరి ఇవేవీ లేని నిరుపేదకు బ్యాంకులు గడప తొక్కనిస్తాయా? ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఆ గుమ్మం చేరుతాయా? అప్పు పుట్టక, ఆకలి తీరక, ఆత్మగౌరవం చంపుకోలేక అలమటించే పేదవాడికి ఈ రాజ్యంలో భరోసా ఎక్కడ ఉంది?
ప్రశ్నించని గొంతుకలు – పట్టించుకోని నేతలు
అసెంబ్లీలో గాని, పార్లమెంటులో గాని గంటల తరబడి రైతుల గురించి మాట్లాడే నాయకులు.. ‘భూమి లేని నిరుపేద’ (Landless Poor) గురించి ఎందుకు మాట్లాడరు? భూస్వాములకు వేల రూపాయల పెట్టుబడి సాయం అందుతున్నప్పుడు, అదే భూమిలో రెక్కలు ముక్కలు చేసుకునే కూలీకి కనీసం ‘సామాజిక భద్రత’ కల్పించాలన్న ఆలోచన ఏ నాయకుడికైనా ఉందా? పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప, వారి జీవితాల్లో వెలుగులు నింపే ఒక్క చట్టమైనా ఈ సభల్లో రూపుదిద్దుకుందా? అంటే సమాధానం ‘లేదు’ అనే వస్తుంది.
ఓటు వేయడమే తప్పా?
ఓటు వేసేటప్పుడు పేదవాడు తన కష్టాలు తీరుతాయని ఆశిస్తాడు. కానీ గెలిచిన నాయకుడు పేదవాడిని కేవలం ఒక సంఖ్యగా (Data) మాత్రమే చూస్తున్నాడు. తన సమస్యను ఏ ఒక్కరూ పట్టించుకోనప్పుడు, తన కడుపు కోతను ఏ సభలోనూ వినిపించనప్పుడు.. ఈ మూర్ఖపు రాజకీయ వ్యవస్థకు ఓటు వేయడమే మనం చేస్తున్న అతిపెద్ద తప్పా అన్న ఆవేదన నేడు సామాన్యుడిలో రగులుతోంది. పేదల రక్తాన్ని పిండి, వారి శ్రమతో రాజ్యాధికారం అనుభవిస్తూ, మళ్లీ పేదవాడినే విస్మరించడం అమానుషం.
ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. సభల్లో జరిగే చర్చలు కేవలం ఉన్నవారి ప్రయోజనాల కోసమే కాకుండా, లేనివారి ఆకలి తీర్చేవిగా ఉండాలి. భూమి లేని నిరుపేద కూడా ఈ దేశ పౌరుడే అన్న స్పృహ నాయకుల్లో కలగాలి. లేదంటే, ఆ పేదవాడి ఆగ్రహం ఓటు రూపంలో విరుచుకుపడే రోజు ఎంతో దూరంలో లేదు.


