భూదాన్‌ భూములపై మౌనమేల?

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌ సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తన స్వగ్రామం తిమ్మాపూర్‌లోని భూదాన్‌ భూములు అన్యాక్రాంతమవుతుంటే కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ”తిమ్మాపూర్లో భూదాన్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయని భూదాన్‌ బోర్డు అక్కడి కలెక్టర్‌కి లెటర్‌ రాసింది. కిషన్‌రెడ్డి ఎమ్మేల్యేగా ఉన్నప్పుడు కూడా భూదాన్‌ భూములపై అప్పటి కలెక్టర్‌కి లేఖ రాశారు. అయితే ఆ కలెక్టర్లే తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆయన ఎందుకు లేఖ రాయడం లేదు… ” అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి రాసిన లెటర్‌ను ఆయనకే కోట్‌ చేస్తూ నేను ఆయనకే లెటర్‌ రాస్తాను…. అని రేవంత్‌ స్పష్టం చేశారు.
కేసీఆర్‌ పెద్ద దళారీ
ధరణి విషయంలో కేసీఆర్‌ పెద్ద దళారీ అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఆయన కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీదేనని ఎద్దేవా చేశారు. ధరణిలో ఉన్నంత దోపిడీ మరెక్కడా లేదనీ, 30 శాతం కమిషన్‌ తీసుకునే ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. ”నక్సలైట్ల నుంచి కాంగ్రెస్‌ వరకు పేదలకు భూపంపిణీ జరిగింది. యాజమాన్యపు హక్కులు లేని వారికి లక్షల ఎకరాలను మా పార్టీ పంచింది. కాంగ్రెస్‌ పాలనలో పారదర్శకంగా భూ రికార్డులు ఉండేవి. 2004 లో కాగితపు రికార్డులను భూభారతి పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజిటలైజ్‌ చేసింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లల్లో 23వేల ఎకరాల భూదాన్‌ భూములున్నాయి. ధరణి రాకముందు నిషేధిత భూములుగా ఉన్న వాటిపై ధరణి వచ్చాక నిషేధం ఎత్తేశారు. ధరణి వచ్చాక ఆయా భూములు కేటీఆర్‌ అనుచరుల పేర్లతో వచ్చాయి. రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను కేటీఆర్‌ అనుచరులు కొట్టేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి కలెక్టరేట్ల ముందు వేలాది మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధరణి సమస్యలు క్లియర్‌ కావాలంటే 30 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే అని బలవంతం చేస్తున్నారు… ”అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ధరణి రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తెస్తామంటే కేసీఆర్‌కి ఏడుపెందుకు? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ చేసిన భారత్‌ జోడో యాత్రలో కూడా ధరణి బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ వస్తే ధరణి రద్దు చేస్తామని, అది రద్దయితే రైతు బంధు, రైతు బీమా రావంటూ కేసీఆర్‌ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భూముల వివరాలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేవని తెలిపారు. ధరణి రద్దు చేస్తే తమ కుట్ర బయట పడుతుందనే కారణంతో ప్రభుత్వం భయపడుతున్నదని చెప్పారు. ధరణి ఫిర్యాదు దారుల నుంచి వసూలు చేసే రూ. వెయ్యి రుసుము డబ్బు ఎక్కడికి పోతోంది? అని ప్రశ్నించారు. ప్రజలు చెల్లించిన డబ్బులు వారికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
కలెక్టర్లనూ ఊచలు లెక్కపెట్టిస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లను ఊచలు లెక్కపెట్టిస్తామనీ, ఆయా జిల్లాల్లో భూములపై విచారణ జరిపిస్తామని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. భూ కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ నేతలు, పార్టీ ఫిరాయించిన నాయకులున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి కేటీఆర్‌ తిమ్మాపూర్‌ భూములను దోచుకుంటున్నారని విమర్శించారు. అక్కడి భూదాన్‌ భూములపై ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధరణిని రద్దుచేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన విధానం తెస్తామని మరోసారి ప్రకటించారు.

Spread the love