సీపీఐ(ఎం) వల్లే సీతారామ ప్రాజెక్టు

సీపీఐ(ఎం) వల్లే సీతారామ ప్రాజెక్టు– చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటేనే పేదల బతుక్కి భరోసా
– పొంగులేటీ.. పార్టీ ఫిరాయించనని ఏడవ గ్యారంటీ ఇస్తావా?
– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులిద్దరూ ఫిరాయింపుదారులే : సీపీఐ(ఎం) పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రం
– కార్పొరేట్‌ వ్యక్తులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి : బి.వెంకట్‌
నవతెలంగాణ- నేలకొండపల్లి
కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలను రోజూ పేపర్లలో చూస్తున్నాం.. టీవీల్లో వింటున్నాం.. కానీ ఏడో గ్యారంటీగా పొరపాటున నువ్వు ఎన్నికల్లో గెలిస్తే పార్టీ ఫిరాయించననే మాట ఇస్తావా అని పాలేరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని గ్రామాల్లో ప్రజలు ప్రశ్నించాలని సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి కూడా ఫిరాయింపుదారుడేనని దుయ్యబట్టారు. మండలంలోని భైరవునిపల్లి, అజరు తండా, తిరుమలాపురంతండా, కొత్త కొత్తూరు, నేలకొండపల్లి పట్టణంలో తమ్మినేని వీరభద్రం మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ప్రజలు, రైతులు, కూలీలు, కార్మికులు, ప్రత్యేకించి మహిళలు పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. పాలేరులో కోట్లు కుమ్మరించి, ఓట్లు దండుకొని పదవి దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కాంట్రాక్టర్లు ఆశపడుతున్నారన్నారు. పొరపాటున ఆ రెండు పార్టీల నుంచి ఎవరు గెలిచినా రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కే పార్టీ వైపే ఈ నాయకులు తమ స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం, డబ్బు సంపాదన కోసం పార్టీ ఫిరాయించడం ఖాయమని, ఈ విషయాలను ప్రజలు, ఓటర్లు గమనించాలన్నారు. కష్టజీవుల సమస్యల పరిష్కారమే ఏజెండాగా తీసుకొని రాష్ట్రంలో 19 స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా చట్టసభల్లో ప్రాతినిధ్యం పొందడం ద్వారా అధికారం చేపట్టే పార్టీ మెడలు వంచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టంచేశారు. పాలేరులో పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి ఏనాడైనా రోడ్లెక్కి ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళన చేశారా.. అసెంబ్లీలో, మరెక్కడైనా ప్రజా సమస్యలపై చర్చించిన దాఖలాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. కందాల కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరారని, గతంలో సీపీఐ(ఎం) మద్దతుతో వైఎస్సార్‌ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తన అవకాశవాదం కోసం బీఆర్‌ఎస్‌లో చేరారని గుర్తుచేశారు. తద్వారా రూ.28 వేల కోట్ల విలువగల కాంట్రాక్టులు దక్కించుకున్నారన్నారు. తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో బీజేపీతో మంతనాలు చేసి బేరం కుదరకపోయేసరికి కాంగ్రెస్‌లో చేరి ఊరూరా తిరుగుతూ పాలేరును ఉద్ధరిస్తానంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అమ్ముడుపోయే నాయకులను దృష్టిలో పెట్టుకొని రంగులు మార్చే రాజకీయ నాయకులను నమ్మి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ చరిత్ర కలిగి ఎత్తిన జెండాను దించకుండా కడదాకా కష్టజీవుల కోసం పోరాడుతున్న తమను సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మాట్లాడుతూ.. బీజేపీ, జగన్మోహన్‌ రెడ్డి కలిసి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి వారిని తయారుచేసి కాంగ్రెస్‌లో చేర్చి అనంతరం బీజేపీ రాజకీయాలను తెలంగాణపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారన్నారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈ రాజకీయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డికి వేసే ఓటు జగన్మోహన్‌రెడ్డికి, బీజేపీకి వేసినట్టేనన్నారు. ఈ కుట్రలను తిప్పి కొట్టాలంటే కష్టజీవుల కోసం పోరాడే తమ్మినేని వీరభద్రంకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కేవీ రామిరెడ్డి, నాయకులు ఏటుకూరి రామారావు, రచ్చ నరసింహారావు, దుగ్గి వెంకటేశ్వర్లు, పగిడికత్తుల నాగేశ్వరరావు, కట్టెకోల వెంకన్న, మారుతి కొండలరావు, సిరికొండ ఉమామహేశ్వరి, తమ్మినేని సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Spread the love