గ్రేటర్‌లో సెల్‌ఫోన్ల స్నాచింగ్‌

Snatching of cellphones in Greater– సుడాన్‌కు స్మగ్లింగ్‌
– రాత్రి సమయంలో నిందితుల సంచారం
– షాపింగ్‌ మాల్స్‌, సినిమాకు వెళ్లొచ్చేవారి కదలికలపై కన్ను
– అడ్రస్‌ అడిగి ఫోన్‌ స్నాచింగ్‌
– రూ.1.75కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లు స్వాధీనం
– ఐదుగురు సుడాన్‌ దేశస్థులు సహా 12 మంది అరెస్ట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సెల్‌ఫోన్లు చోరీ చేస్తూ సుడాన్‌ దేశానికి స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు సుడాన్‌ దేశస్థులతోపాటు 12 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీలు రేష్మి పెరుమాళ్‌, జానకి, ఏసీపీ శ్రీనివాస్‌రావుతో కలిసి హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ షఫీ, బంజారాహిల్స్‌కు చెందిన జె.యలమందా రెడ్డి, తాడ్‌బన్‌కు చెందిన మహ్మద్‌ ముజమిల్‌ అలియాస్‌ ముజ్జు, సయ్యద్‌ అబ్రార్‌తోపాటు నగరానికి చెందిన మరో 8 మంది ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా పాత నేరుస్థులు. సులువుగా డబ్బులు సంపాదించాలంటే సెల్‌ఫోన్‌లు స్నాచింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ట్రై పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు, ఐదుగురు కలిసి సంచరించేవారు. పోలీసులకు చిక్కకుండా చోరీ చేసిన వాహనాలపై తిరిగేవారు. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేవారిని, ట్యాక్సీ డ్రైవర్లను, రెస్టారెంట్లు, సినిమా నుంచి ఇంటికి వెళ్లేవారిని, షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్‌లకు వెళ్లేవారితోపాటు, ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారిని టార్గెట్‌ చేసేవారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్‌లో ఉన్నవారిని టార్గెట్‌ చేసుకుని వారి వద్దకు వెళ్లి సమీపంలోని ఓ చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అడిగినట్టు నటిస్తూ వారి నుంచి సెల్‌ఫోన్లు లాకెళ్తున్నారు. రోడ్డు పక్కల పార్క్‌చేసిన కారు, ట్యాక్సీలు, ఆటోల్లో డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లేవారు. ముఠాలోని మరికొందరు కత్తులు చూపించి స్నాచింగ్‌లకు పాల్పడేవారు. చోరీ చేసిన సెల్‌ఫోన్లను అబిడ్స్‌లోని జగదీష్‌ మార్గెట్‌లో ఉన్న సెల్‌ఫోన్ల వ్యాపారి మహ్మద్‌ షఫీ, బంజారాహిల్స్‌కు చెందిన జె.యలమందా రెడ్డికి అందించేవారు. అందులో ఐఫోన్‌, ఇతర ఖరీదైన కొన్ని సెల్‌ఫోన్ల నుంచి కెమెరాలు, డిస్‌ప్లే, మదర్‌బోర్డు ఇలా విలువైన వాటిని తీసుకునేవారు. అవి కొత్తవిగా మార్చి వేలల్లో కస్టమర్లకు విక్రయించేవారు.పెద్దఎత్తున చోరీ చేస్తున్న సెల్‌ఫోన్లను విక్రయించాలని నిర్ణయించుకున్న నిందితులు.. సుడాన్‌ దేశానికి చెందిన (బంజారాహిల్స్‌లో నివాసముంటున్నారు) ఖలిద్‌ అబ్దెల్‌ బాగీ మొహమ్మద్‌ అల్బద్వీ, అబ్దలేలా అహ్మద్‌ ఉస్మాన్‌ బాబికర్‌, ఇమ్న్‌ మొహమ్మద్‌ సలీ అబ్దల్లా, అనస్‌ సిద్దిగ్‌ అబ్దెల్‌గాదర్‌ అహ్మద్‌, ఒమర్‌ అబ్దల్లా ఎల్తాయేబ్‌ మొహమ్మద్‌తో చేతులు కలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో చోరీ చేసిన వాటిని సముద్రమార్గంలో ఓ కంటైనర్‌లో సుడాన్‌ దేశానికి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. వచ్చిన డబ్బులల్లో వాటాలు వెళ్లేవి. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. ముందుగా 12 మంది నిందితులను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్సు విచారించగా.. స్మగ్లింగ్‌ అంతర్జాతీయ ముఠా గుట్టురట్టయింది.
ఫిర్యాదులు తీసుకోకుంటే చర్యలు : సీపీ
నగరంలో పెద్దఎత్తున సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. బాధితులు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే కొన్ని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులను తీసుకోవడం లేదని సీపీ దృష్టికి వచ్చింది. ఫిర్యాదులు తీసుకోకుంటే సంబంధిత అధికారికి మెమోలు జారీ చేస్తాం.

Spread the love