– కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన
– మంత్రులు హరీష్ , గంగుల , తలసాని, శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కార్ విశేష కృషి చేస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని కోకాపేటలో 2.5 ఎకరాల్లో రూ.5కోట్లతో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కులవృత్తులకు చేయూత నిస్తూనే బలహీనవర్గాల్లో అక్షర చైతన్యం తీసుకొస్తున్నదని చెప్పారు. అందుకు తగిన విధంగా 310 బీసీ గురుకులాలను నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తుందన్నారు. గతంలో దరఖాస్తు ఇచ్చి దండంపెట్టినా ఒక్క రూపాయి ఏ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. అత్యధిక శాతంగా ఉన్న బీసీలకు ఆసరా పింఛన్లలో పెద్ద మొత్తం కేటాయిస్తూ ఆత్మగౌరవంతో జీవించేలా భరోసానిస్తున్నారన్నారు.