ఐటీ కంపెనీల లాగవుట్‌కు ప్రత్యేక సమయం

– ట్రాఫిక్‌ నియంత్రణకు సైబరాబాద్‌ నిబంధనలు
– అమలు చేయాలని ఐటీ కంపెనీలకు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం అతలాకుతమవుతున్నది. ఎడతెరిపిలేని వానలకు నగరం చిగురుటాకులా వణికిపోతున్నది. ముఖ్యంగా సోమవారం సాయంత్రం కురిసిన జడివాన దెబ్బకు ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఉద్యోగులు ఇండ్లల్లోకి చేరడానికి 5గంటలకుపైగానే పట్టిందని పలు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ జామ్‌ను నియంత్రించడానికి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో నిబంధనలు రూపొందించారు. వీటిని కచ్చితంగా అమలు చేయాలని ఐటీ కంపెనీలకు ఆదేశాలు జారీచేశారు. వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు మూడు దశల్లో లాగ్‌ అవుట్‌ చేసుకోవడానికి సైబరాబాద్‌ పోలీస్‌ శాఖ సూచించింది. మొదటి దశలో ఐకియా నుంచి సైబరాబాద్‌ టవర్స్‌ వరకు ఉండే ఐటీ ఆఫీసులు, రహేజామైండ్‌ స్పేస్‌ పరిధిలోని అన్ని కంపెనీలు, టీసీఎస్‌, హెచ్‌ఎస్‌బీసీ, డెల్‌, మాదాపూర్‌, కొండాపూర్‌ పరిధిలోని అన్ని కంపెనీలు, ఒరాకిల్‌, క్వాల్‌కామ్‌, టెక్‌మహేంద్రా, పూర్వసమ్మిట్‌ ఏరియాలోని అన్ని కంపెనీలు మూడు గంటలకు లాగ్‌అవుట్‌ చేసుకోవాలని సూచించింది. రెండో దశలో ఐకియా నుంచి బయోడైవర్సిటీి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసుల్లో నాలెడ్జ్‌ సిటీ, నాలెడ్జ్‌ పార్కు, టీ-హబ్‌, ఎల్‌టీఐ, కమ్మరోజోమ్‌, ఆర్‌ఎంజడ్‌ నెగ్జిటీ, స్కైవ్యూ, దివ్వశ్రీ ఓరియన్‌ కంపెనీలు సాయంత్రం 4:30 గంటలకు లాగ్‌ ఔట్‌ చేసుకోవాలని సూచించింది. మూడో దశలో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు మైక్రోసాఫ్ట్‌, ఇన్‌ఫోసిస్‌, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్‌, క్యాప్‌జెమిన్‌ తదితర కంపెనీలు సాయంత్రం 3నుంచి 6గంటల మధ్యలో లాగ్‌అవుట్‌ చేసుకోవాలని సైబరాబాద్‌ పోలీస్‌ శాఖ ఆదేశాలు జారీచేసింది.

Spread the love