మరో 25 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ పనులు వేగవంతం చేయండి

– సమీక్షలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
మరో 25 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందని, ఈలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధికారులకు సూచించారు. నియోజవర్గంలో రూ.3 వేల కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు వెంటనే చేయాలని, ముఖ్యమంత్రిని అడిగి నిధులు తీసుకు వస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బుధవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గంలో నెల రోజులుగా వాతావరనం స్తబ్ధుగా ఉందని, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం, దేవుడి దయవల్ల కోర్టులో న్యాయం గెలిచిందని అన్నారు. కొత్తగూడెం నుంచి మీరే పోటీ చేయాలని కేసీఆర్‌ చెప్పారని వివరించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు సుమారు రూ.215 కోట్ల నిధులు మంజూరు చేశారని, నియోజకవర్గంలోని 4 మండలాల్లో అభివృద్ధికిగాను పంచాయతీ రాజ్‌ శాఖకు సీఎం నిధుల నుంచి రూ.96 కోట్లు కేటాయించారని చెప్పారు. కొత్తగూడెం ప్రజలకు తాగునీటి కోసం కిన్నెరసానినూతన పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.135 కోట్లు మంజూరు చేయించినట్టు తెలిపారు. మెర్రెడు వాగు ఒడ్డు కోత నుంచి రక్షించేందుకు రూ.33 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు చెప్పారు.
పాల్వంచ అస్పత్రిని 100 పడకలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాల్వంచలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. త్వరలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హారీష్‌రావు వస్తారన్నారు. సుజాత నగర్‌ మండల పరిధిలోని మంగపేట వంతెన ప్రారంభోత్సవానికి పంచా యతీ శాఖ మంత్రి రానున్నారని చెప్పారు. త్వరలో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలలో వివిధ రకాల 500 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పనులకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జెడ్పీ సీఈఓ మెరుగు విద్యాలత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, కొత్వాల శ్రీనివాస్‌, ఎంపీపీలు బాదవత్‌ శాంతి, భూక్య సోనా, డాక్టర్‌ రవిబాబు, డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, డాక్టర్‌ కుమారస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love