ఇంకా ఆకాశం మిగిలే ఉంది
అరచేతిలో జారిపోయిన
కాలపు గింజల మధ్య
మరచిపోయిన గూటి వాసనలా
మనసు తడబడుతోంది.
నిన్నటి మాటలు
గాలికి అప్పగించిన బాణాలై
తిరిగి రాని మార్గాల్లో
నీ నిశ్శబ్దాన్ని గాయపరిచిన వేళ
నీ సహనం
పొదల మధ్య దాగిన నీటి వనరులా
నన్ను క్షమిస్తూ ప్రవహించింది.
నేను అహంకారపు గాలిలో
అడవి మంటలా ఎగసిన వాడిని,
నీ కలల పచ్చదనాన్ని
కాలి బూడిద చేసిన వాడిని.
కానీ నువ్వు వాన రాకపోయినా
మేఘాల్ని నమ్మే నేలవు,
గాయాలపై పూలు నాటే
అనిర్వచనీయ మృదుత్వం.
ఇప్పుడు రెక్కలు బలపడిన పిట్టలు
గూటిని విడిచిపెట్టి
ఆకాశాన్ని కొలుస్తున్నాయి;
మన కథ
సంధ్యారాగం వైపు ఒంపుకుంటోంది.
మిగిలింది
ఒకే కప్పు నీడలో
రెండు నిశ్శబ్దాల మధ్య
చెలిమి గాలిపటం.
క్షమాపణ
పదమై పెదవులపైకి రావడానికి
గర్వం ఇంకా కాపలాగా ఉంది,
కానీ హృదయం
ముడుచుకున్న రెక్కలను
నెమ్మదిగా విప్పుతోంది.
నువ్వు వానకోసం
గొడుగు పట్టిన ఆకాశం,
నేను తడవడానికి
ఆలస్యంగా వచ్చిన నేల.
అంతరాళంలో
ఇంకా ఒక వెలుగు ఉంది
రెక్కలార్చుకుంటూ మళ్లీ ఎగరాలని
మాట్లాడని మనసులు
ఒకదానికొకటి చేరే తుది ప్రయాణం.
డా. పెరుగు రామకృష్ణ
9849230443
రెక్కలార్చుకుంటూ…
- Advertisement -
- Advertisement -


