Sunday, May 24, 2026
E-PAPER
Homeదర్వాజపొగడ్తల మధ్య సన్నగిల్లుతున్న తెలుగు సాహిత్య విమర్శ

పొగడ్తల మధ్య సన్నగిల్లుతున్న తెలుగు సాహిత్య విమర్శ

- Advertisement -

గత కొంతకాలంగా తెలుగు సాహిత్యం కొత్త కళను సంతరించుకుంది. కవిత్వ కార్యశాలలు, కథా శిబిరాలు, జూమ్ సమావేశాలు, ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. వివిధ వేదికల్లో కవిత్వం ఎలా రాయాలి?, కథలు ఎలా అల్లాలి? అనే చర్చలు జరుగుతుంటే తెలుగు సాహిత్యానికి కొత్త చైతన్యం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ ఉత్సాహాన్ని చూసినప్పుడు కొంతమంది సాహితీ పెద్దలకు నేను ఒక విన్నపం చేశాను. ‘కవిత్వం, కథలపై ఇన్ని శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు కదా, మరి విమర్శపై ఎందుకు దృష్టి సారించడం లేదు? కొత్త తరానికి విమర్శ ఆవశ్యకతను ఎందుకు వివరించడం లేదు?’ అని అడిగాను. ప్రతిసారీ వారి నుంచి వచ్చే జవాబు ఒక్కటే. తప్పకుండా చేద్దాం మిత్రమా అని ఎంతో తియ్యగా చెబుతారు. ఆశ్చర్యం ఏమిటంటే చేద్దాం అన్న హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కవిత్వ, కథా శిబిరాలు వందల సంఖ్యలో జరుగుతుంటే, విమర్శపై సదస్సులు మాత్రం అత్యంత అరుదుగా కనిపిస్తున్నాయి.

ఇదే సాహితీ పెద్దలతో మనం మాట కలిపితే, ‘తెలుగులో సాహిత్య విమర్శ కరువైంది. కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, విశ్వనాథ సత్యనారాయణ, రాచమల్లు రామచంద్రారెడ్డి వంటి మహానుభావులు గొప్ప విమర్శలు రాశారు. వారి తర్వాత ఆ స్థాయి విశ్లేషణలు రావడం లేదు’ అని నిట్టూరుస్తారు. ఈ మాట విన్నప్పుడల్లా ‘చింత గింజలు నాటి మామిడి పండ్లు కోయాలనుకోవడం’ అనే సామెత గుర్తుకొస్తుంది. మనం ఏ విత్తనం నాటితే అదే పంట వస్తుంది. కవిత్వం కోసం కవిత్వ శిబిరాలు, కథా సృజన కోసం కథా శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు, విమర్శ కావాలంటే దాని కోసం మనం చేస్తున్న కృషి ఏమిటి? చింత గింజ నాటి మామిడి చెట్టు మొలవలేదని బాధపడితే ప్రయోజనం లేదు.
విమర్శ అనేది యాదృచ్ఛికంగా పుట్టుకురాదు. అదొక క్రమశిక్షణ, ఒక ప్రత్యేక దృష్టి, ఒక పద్ధతి. ఆ దృష్టిని నేర్పాలి, ప్రోత్సహించి పెంచాలి. సాహిత్య సంస్థలు విమర్శ గ్రంథాలకు ఇచ్చే పురస్కారాల విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాలి. అసలు ఇవ్వడం లేదని కాదు కానీ, అవి ఎప్పుడో ఒకసారి, కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయి. కథకు కిరీటం, కవిత్వానికి సింహాసనం, నవలకు నీరాజనాలు దక్కుతున్నాయి. ఏటా పూలదండలు, నగదు నజరానాలు వీటికి అందుతున్నాయి. మరి విమర్శకు దక్కుతున్న గౌరవం ఏమిటి? ఎవరైనా రాస్తే చూద్దాం అనే నిర్లిప్తతే కనిపిస్తోంది. ఏడాదికి డజను కవిత్వ, కథా సంపుటాలు సన్మానాలు అందుకుంటే, విమర్శకు మాత్రం ఎప్పుడో ఒకసారి పురస్కారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సృజనకు పట్టాభిషేకం జరుగుతుంటే, విమర్శకు అరకొర అక్షతలే దక్కుతున్నాయి.

‘ప్రస్తుతం తెలుగులో సాహిత్య విమర్శ లేదు’ అనే మాట నేడు ఒక నానుడిగా మారిపోయింది. అయితే, సాహిత్య లోకంలో విమర్శ పూర్తిగా కనుమరుగైందని భావించడం వాస్తవికతకు దూరం. సమస్య విమర్శ లేకపోవడం కాదు, అది విభిన్న పార్శ్వాల్లో విడిపోవడమే. నేడు విమర్శ ప్రధానంగా పత్రికల్లో వచ్చే తక్షణ సమీక్షలు, విశ్వవిద్యాలయ పరిధిలో సాగే అకడమిక్ పరిశోధనలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే చర్చలు అనే మూడు ధోరణుల్లో కనిపిస్తోంది. దురదృష్టవశాత్తూ, వీటి మధ్య ఉండాల్సిన సమన్వయ వారధి తెగిపోయింది. పత్రికా విమర్శల్లో సిద్ధాంత లోతు కొరవడుతుంటే, అకడమిక్ విమర్శలు సామాన్య పాఠకుడికి దరిచేరని స్థితిలో ఉన్నాయి. ఫలితంగా మూడు వర్గాలూ వేర్వేరు దీవుల్లో బతుకుతున్న చందంగా తయారైంది.

మరోవైపు వస్తున్న అరకొర విమర్శనైనా మనం లోతుగా చర్చించడం లేదు. ఒక గ్రంథంపై గంభీరమైన సమీక్ష వెలువడినా, అది సామాజిక మాధ్యమాల్లోని చిన్న సమూహాలకే పరిమితమైపోతోంది. దానిపై ప్రతి విమర్శలు గానీ, నిర్మాణాత్మక చర్చలు గానీ జరగడం లేదు. దీంతో విమర్శ తన చురుకుదనాన్ని కోల్పోయి ఒక ఏకపాత్రాభినయంలా మిగిలిపోతోంది. కాబట్టి విమర్శ లేదు అని నిట్టూర్చడం కంటే, ఉన్న విమర్శను మనం గుర్తించడం లేదని, దాన్ని చర్చకు పెట్టడం లేదని ఒప్పుకోవడమే నిజాయితీ. నేడు విమర్శ మూడు ప్రధాన అవరోధాలను ఎదుర్కొంటుంది. మొదటిది భజన సంస్కృతి. పుస్తకావిష్కరణ సభలో గ్రంథం గురించి హుందాగా మాట్లాడటం సాహిత్య మర్యాద. ఆ సంప్రదాయాన్ని మనం గౌరవించాల్సిందే. ఆ మర్యాద అక్కడితో పరిపూర్ణం అయితే పర్వాలేదు. తరువాత రోజుల్లో ఆ మర్యాద కాస్తా ఆ పుస్తకం గురించి లేదా ఆ రచయిత గురించి భజనగా పరిణమించినప్పుడే అసలైన ప్రమాదం పొంచి ఉంటుంది. నిజమైన గౌరవం అంటే ఒక రచనను దాని గుణదోషాలతో సహా స్వీకరించడం. రచనలోని నవ్యతను అభినందిస్తూనే, అందులోని లోటుపాట్లను నిర్మొహమాటంగా ఎత్తిచూపగలగాలి. రచయిత పట్ల గౌరవాన్ని కాపాడుకుంటూనే, రచన పట్ల నిష్పాక్షికంగా వ్యవహరించడమే విమర్శకుడికి ఉండాల్సిన అసలైన సంస్కారం. కానీ నేడు భజన అంటే పుస్తకం చదవకుండానే ‘యుగాంతర రచన’, ‘మహాకవి’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఫలితంగా సాహిత్య ప్రమాణాలు పతనం అవుతాయి. నిజమైన విమర్శకుడికి రచనతోనే సంబంధం ఉండాలి తప్ప రచయితతో కాదు. గౌరవార్థం సత్కరించిన చేత్తోనే, దోషాన్ని ఎత్తిచూపే నిజాయితీ విమర్శకుడికి ఉండాలి.

సాహిత్య శిబిరాలు/ అభిమాన సమూహాలు
భజన సంస్కృతి విమర్శకుడిని బయటి నుంచి దెబ్బతీస్తే, ఈ సమూహాలు లోపలి నుంచి నిర్వీర్యం చేస్తాయి. సిద్ధాంతం, ప్రాంతం, కులం, ఒక ప్రముఖ రచయిత చుట్టూ అల్లుకున్న వలయం అన్నీ సాహిత్య వర్గాలే. అక్కడ వాదం కాస్తా సాహిత్య యుద్ధం అవుతుంది. రచన కంటే రచయిత ముఖ్యం అవుతాడు. ఆ వర్గాల నియమావళి చాలా సులభం. మన వాడు రాసింది ఏదైనా గొప్పది, ఎదుటి వర్గం వాడు రాసింది చెత్త. విమర్శకుడు కక్షిదారుడి తరఫున వాదించే ప్లీడరులా మారిపోతాడు. తన సాహితీ పక్షాన్ని ఎలా గెలిపించాలా అని తాపత్రయపడతాడు. ఫలితంగా పనికిమాలిన రచన పొగడ్తలతో బతుకుతుంది, మంచి రచన ద్వేషంతో మరుగున పడుతుంది. పాఠకుడికి ఏది శ్రేష్ఠమో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. విమర్శకుడు కేవలం ప్రచారకర్తగా మిగిలిపోతాడు. విమర్శ బతకాలంటే ఈ సాహిత్య వర్గాల గోడలు కూలాలి. మంచి రచన శత్రువు రాసినా గౌరవించాలి, చెత్త రచన మిత్రుడు రాసినా నిశితంగా ఖండించాలి.

పాఠకుడి అసహనం
ఒక ప్రముఖ రచయితతో మాట్లాడుతుంటే ఆయన అన్న మాటలు నన్ను తీవ్ర ఆలోచనలో పడేశాయి. “మీరు విమర్శ రాస్తే 300 నుంచి 500 పదాల్లోనే రాయండి. అంతకు మించి చదివే ఓపిక ఎవరికీ లేదు. పెద్ద వ్యాసం రాస్తే అది వృథా” అన్నారాయన. దీని అర్థం ఏమిటంటే, ఒకవైపు రచయితే విమర్శను ఒక ‘ఉత్పత్తి’లా చూస్తున్నాడు. ‘మార్కెట్‌లో ఏది అమ్ముడవుతుందో అదే చేస్తాడు’ అనే వ్యాపార సూత్రం ఇది. పాఠకుడు 500 పదాలే చదువుతాడు కాబట్టి అంతే రాయాలి, పాఠకుడికి చేదు ఇష్టం ఉండదు కాబట్టి పొగడ్తలే కురిపించాలి అన్నట్టుంది పరిస్థితి. మరోవైపు రచయితకు కూడా లోతైన విమర్శపై నమ్మకం పోయింది. ‘ఏదైనా ఒక పుస్తకంపై 3000 పదాల విశ్లేషణ వచ్చినా ఎవరూ పట్టించుకోరు, అదే నాలుగు ముక్కల్లో అద్భుతం అని రాస్తే వైరల్ అవుతుంది’ అనే లెక్కలు నడుస్తున్నాయి. దాంతో రచయిత కోరుకునేది విమర్శ కాదు, సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించుకోవడానికి ఒక ప్రశంసా వాక్యం మాత్రమే.

ఒకప్పుడు పాఠకులకు సుదీర్ఘ విశ్లేషణలు చదివే ఓపిక ఉండేది. నేడు సెల్‌ఫోన్, రీల్స్ కాలం. 20 లైన్ల కవిత కూడా చాలా పెద్దది అని, 2000 పదాల వ్యాసం ఎవరు చదువుతారు? అని భావిస్తున్నారు. దీంతో విమర్శకుడు ముఖ్యాంశాలు, మూడు నిమిషాల్లో పరిచయం వంటివి రాస్తున్నాడు. అయితే ఆ సంక్షిప్తత కాస్తా సాహిత్యపరమైన సారహీనతకు దారితీస్తోంది. ఒక పుస్తకం ఆత్మను పట్టుకోవాలంటే 300 పదాలు సరిపోవు. విమర్శకు కావాల్సింది నిదానంగా, నిశితంగా చదవడం. కానీ పాఠకుడు ఫాస్ట్ ఫుడ్ కోరుకుంటే విమర్శ కూడా అలాగే తయారవుతుంది. నిజానికి సమస్య సమయం కాదు, ప్రాధాన్యం. సాహిత్య విమర్శకుడు నిజం కోసం ఎంత తెగించాలో నత్కీరుని ఐతిహ్యం చెబుతుంది. పరమశివుడే పద్యం రాసినా, దాంట్లో దోషం ఉంటే ‘తప్పు’ అని మొహం మీదే చెప్పిన ధైర్యం ఆయనది. అదే నిజమైన విమర్శకుడికి కావాల్సిన తెగువ. అధికారానికి భయపడి నిజాన్ని దాచడం విమర్శకు పెద్ద ద్రోహం. రాజశేఖరుడు కావ్యమీమాంసలో విమర్శకులను నాలుగు రకాలుగా విశ్లేషించాడు. అన్నిట్లో తప్పులే వెతికేవారు ఒకరైతే, మంచీచెడూ చూడకుండా అన్నీ పొగిడేవారు మరొకరు. అసూయతో మంచిని కూడా మెచ్చనివారు మూడో రకం కాగా, రచనలో మంచిచెడులు విడమర్చి, దాని అసలు సారాన్ని చూపేవారు నాలుగో రకం. మనకు కావలసింది ఈ చివరి రకం విమర్శకులే. నేడు తెలుగు విమర్శలో రెండు విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి.

ఒకవైపు అసూయతో ఏదీ నచ్చని వారున్నారు. వారు పుస్తకం చదవకుండానే విమర్శిస్తారు. ఇంకోవైపు గుడ్డిగా పొగిడే భజన బృందం ఉంది. వారు రచనలో లోపాలున్నా పట్టించుకోకుండా అద్భుతం అని ఆకాశానికి ఎత్తుతారు. ఈ రెండు వర్గాల మధ్య నిజమైన విమర్శ నలిగిపోతోంది. రచనను లోతుగా అర్థం చేసుకొని, దాని మంచీ చెడూ నిజాయితీగా చెప్పే పద్ధతి కనుమరుగవుతోంది. విమర్శ బలహీనపడితే సాహిత్య ప్రమాణాలు దెబ్బతింటాయి. సాహిత్య ప్రమాణాలు దెబ్బతింటే సమాజపు ఆలోచనా శక్తి మందగిస్తుంది. కాబట్టి విమర్శకు అడ్డుగా ఉన్న శక్తులను గుర్తించడం తక్షణ అవసరం. వాటిని ఎదిరించడం మనందరి బాధ్యత. వంద శాలువాల మధ్యలో ‘కానీ, ఈ పుస్తకంలో…’ అని నిలదీసే ఆ ఒక్క గొంతు కోసం తెలుగు సాహిత్యం ఎదురుచూస్తోంది. ఆ గొంతు మౌనం వహిస్తే సాహిత్యం మూగబోతుంది. ఆ గొంతు బతికితే తెలుగు సాహిత్యం వెలిగిపోతుంది.

ఆచార్య వెంకటరామయ్య గంపా, 09958607789

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -