నిరంతరం మట్టితో సంబంధాన్ని ఆకాంక్షించే మనిషి ఆపరిమళాన్ని అణువణువూ నింపుకుంటాడు. ఎల్లలులేని ఆనందానుభూతుల్ని ప్రోవు చేసుకుంటాడు. బాధ్యతాయుత పదవిని, మాతృభాషపట్ల మమకారంతో ప్రవృత్తిగా సాహితీసేవను రెండింటినీ సమానంగా, సమర్థంగా నిర్వహిస్తున్న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డిగారు.
ఏనుగు నరసింహారెడ్డి గారు
అనునిత్యం పరిశీలనాత్మక పరిశోధనతో ఉద్యోగంలోను, సాహిత్యంలోనూ నిత్యవిద్యార్థిగా ఎప్పటికప్పుడు నూతన చైతన్యాన్ని నింపుకుంటున్నారు. ఉద్యోగధర్మంలో ఆదర్శాన్ని పాటిస్తూనే, మరోపక్క సాహితీపిపాసను తీర్చుకుంటున్న ధీశాలి ఆయన. ఉద్యోగ నిర్వహణలో గాంభీర్యత, కవిత్వంలో సృజనశీలత, రచనల్లో భావశబలత, విమర్శలో సహృదయత, సభావేదికలపై వాక్చతురత ఆయనకు సహజసిద్ధగుణాలు. అత్యంత సాహిత్యానురక్తితో ఆయన రచించిన అనేక ప్రక్రియలు పాఠకుల హృదయాలను పరవశింపజేస్తాయి. సమాజంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనలే అంశాలుగా ఆయన కలాన్ని ముందుకు నడిపిస్తాయి. నిర్దేశించిన వస్తువులపై కాకుండా వస్తు వైవిధ్యంతో తాను అనుభవించిన దానిని ఆయన సమాజానికి అందించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. ఇవి కొన్నిసార్లు కన్నీరు పెట్టిస్తాయి. మరికొన్నిసార్లు ఆవేశింపజేస్తాయి. ఇంకొన్నిసార్లు నిద్రాణమైన చైతన్యాన్ని తట్టిలేపి ఉద్దీపింపజేస్తాయి. పూలపాన్పుపై కాక కర్కశంగా దేహానికి నొక్కులు పెట్టే కటికనేల మీద జీవితాన్ని అనుభవించిన నరసింహారెడ్డిగారు ఆ మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. సవినయంగా ఆ జ్ఞాపకాలకు తలవంచి, నేర్చిన పాఠాలతో తనను తానే చెక్కుకున్న ఉదారవ్యక్తిత్వ శిల్పమయ్యారు.
పద్యమైనా, వచన కవిత్వమైనా, రుబాయీలైనా, కథయినా, నవలైనా, విమర్శ అయినా గాఢత, గొప్ప అభివ్యక్తి ఆయన రచనల్లో ప్రధానమైనవి. అందుకేనేమో! “అప్పుడప్పుడు తాత్త్విక చింతనలోకి తీసుకెళ్లే కవిత్వం / ఒక్కోసారి ఉద్విగ్న అనుభూతుల అంచుల్లోకి పాఠకుడిని లాక్కెళ్లే కవిత్వం ‘నేనే’ అనడంలో తానేమిటో, తన రచనా ఉద్దేశ్యమేమిటో స్పష్టంగానే చెప్తున్నారు.
”బాల్యం దోసిట్లోంచి జారిపోతుంది / యవ్వనం ఒడి నుండి పారిపోతుంది / కాలాన్ని నిలుప కసరత్తులెన్ని చేయి / చిలుక ఈ చెట్టు నుండి ఎగిరిపోతుంది” జీవితమంతా ఒక నాటకం. పాత్రధారణ ఒక పరిమితికి లోబడి ఉంటుంది. కాలప్రవాహం ఆగదు. పరిణామంలో దేహం పటుత్వాన్ని కోల్పోయి, ఎంత ప్రయత్నం చేసినా లోపల ప్రాణమనే చిలుక ఎగిరిపోతుంది. గొప్ప తాత్త్వికతతో కూడిన వాక్యాలివి. ఇదే అర్థాన్ని మరోచోట…. “పొద్దు గూకక ముందే / గూట్లో దీపం పెట్టడం మంచిది /హుషారుగా ఉన్నప్పుడే / పిట్ట ఎగిరిపోవడం ఉత్తమం / ఎవరూ ఈ లోకానికి ఎక్కువ కాలం అక్కరలేదు” మూడు సంవత్సరాల వయస్సులో తండ్రిని కోల్పోయిన నరసింహారెడ్డి గారు ….”పేదరికం వ్యాధితో పోరాడి / జీవితం నర్తనశాలలో / జీవించి మరణించిన నాన్న” అంటూ రాసుకున్నారు. పేదరికం ఎంత నరకప్రాయమో, జీవితాన్ని తృటిలో ఎంత అస్తవ్యస్తం చేస్తుందో తెలపడానికి ఈ వాక్యాలు అద్దం పడతాయి.
“కాలానికి ఆరబెట్టిన / నీటిరంగుల వర్ణచిత్రంలా/ నాన్న నాకొక అస్పష్ట జ్ఞాపకం” అంటారు. పల్లెగంధాన్ని ఆస్వాదించి ఆనందించినవాడు కాబట్టి పల్లెలు కనుమరుగైన తీరుకు ఆవేదన చెందుతూ… “అప్పటి పచ్చటి నేలమీద పరుగెత్తలేని / ఆరుద్ర పురుగుల ఆట బొమ్మలేవి?….అని ఆరోజులను గుర్తుకు తెచ్చుకుంటారు. “ఇక్కడొక ఊరుండేది / ఎవరైనా చూపిస్తారా?” అనడం మనస్సును మెలిపెట్టి తిప్పుతుంది. స్త్రీ హృదయంలోకి తొంగిచూసి, స్త్రీ సున్నితత్వాన్ని ఆయన అర్థం చేసుకున్న తీరు ఎంత ప్రశంసించినా తక్కువే. “నేన్నీతో రావాలంటే / ఇరవై వసంతాలను భగ్గున మండించి నట్లుంది” తల్లిదండ్రుల ఆలనాపాలనలో అల్లారుముద్దుగా, ముగ్ధగా పెరిగిన కొమ్మ ఇరవై ఏండ్ల తన ఆనందాన్ని బూడిదపాలు చేసుకొని, అవశేషంగా బయలుదేరుతుంది. ఎంతటి ఆవేదనాత్మక పంక్తులు? అంతటితో ఆగకుండా “గ్రీష్మాన్ని వలచిన కోయిలనై / నేను నీతో వచ్చేస్తున్నాను” వసంతాన్ని మరచి గ్రీష్మఋతువును కలకంఠం ఎక్కడైనా కోరుకుంటుందా? కానీ ఇక్కడ ఈ వాక్యాలు రాబోయే జీవితంలోని బాధలకు సిద్ధమై వెళ్తున్నట్లు కన్నీరు తెప్పిస్తాయి. “నేను నీతో శాశ్వతంగా వచ్చేయాలంటే / జ్ఞాపకాల కొండలు కరిగి / నన్నొక జీవనదిని చేస్తున్నాయి” గొప్ప వాక్యాలు.
ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలోని డొల్లతనాన్ని, ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నోట్లతో రాజకీయం చేస్తున్న నాయకుల వైఖరిని తూర్పారబడుతూ ఇటీవలే ఆయన ‘ఏడుకోలల బాయి’ అనే శతకాన్ని వెలువరించారు. ఆయన అన్ని రచనల వలె ఇది కూడా అనతికాలంలోనే పాఠకుల హృదయాలను ఆకట్టుకుంది.
“ఏరోజు కారోజు ఎదిరీదినట్టులే రాజకీయమ్మేమి రంజు కాదు. నిజము మాట్లాడితే నిలువనీయరు జనులు ఒడుపు నా తప్పులే నొడువ వలెను / మాట మీదుగ నిల్వ మా కష్ట కార్యమ్ము, నిలబెట్టుకోవడం నిప్పులాట / నిరుడు ఆడిన మాట నిన్న బల్కిన పల్కు, పొంతనే ఉండదు పోలదసలు” అని నిజాన్ని నిర్భీతిగా చెబుతూ రాజకీయపు ముసుగులో జరిగే అకృత్యాలను నూటొక్క పద్యాలలో ఎండగడతారు. ఈ శతకం దేశానికి మంచి నాయకత్వం ఉండాల్సిన ఆవశ్యకతను తెలుపుతుంది. అలతి పదాలుగా కనబడినప్పటికీ ఆయన రచనలో భావగాంభీర్యం ఎక్కువ. లయ ప్రాధాన్యంగా పాటరూపంలో సాగే లక్షణాలూ గోచరిస్తాయి. ‘ఊహల వేదిక’ పై ఆయన వాస్తవాలను నాట్యం చేయిస్తారు, ‘ఏడుకోలల’ లోతుల్లో ‘అంతరంగం’ వేదనలను స్పృశిస్తారు. ‘మట్టిపాట’ తో ప్రకృతిలో పరవశులై ‘సమాంతర స్వప్నాలను’ కళ్లపై ముద్రించుకుంటారు. ‘కొత్తపలక’ పై ‘నిన్న, నేడు,రేపు’ లను లిఖిస్తారు. ‘నీడల దృశ్యాల’లో ‘పూలపూల వాన’ను అనుభూతి చెందుతారు. అందుకే “ఏమీ చదవని రోజు, ఏమాత్రం ఎదగని రోజు” గా భావించి ‘తెరిపిలేని వాన’గా అక్షరమై కురవడానికి సిధ్ధమవుతారు.
1968, ఏప్రిల్ 6వ తేదీన రామన్నపేట మండలంలోని, కల్లోనికుంట అనే చిన్న గ్రామంలో జన్మించిన ఏనుగు నరసింహారెడ్డిగారు జీవితంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొంటూ Down to earth గా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు సంచాలకులుగా వ్యవహరిస్తున్న ఆయన ఇటీవలే ఐ ఏ ఎస్ హోదాను పొందారు. ప్రశంసాపాత్రం. ఏ స్థాయికి ఎదిగినా ఏ సమయంలోనూ దర్పానికి తావీయక అందరితో ఆత్మీయంగా కలిసిపోవడం ఆయనకున్న గొప్ప లక్షణం. వీరి సేవలకు గాను వరించిన పురస్కారాలు, గౌరవాలు అనేకం. వరంగల్ లోని సహృదయ సాహితీ సంస్థ వారు జూన్ 7వ తేదీన ‘అవధాన రారాజు’ బిరుదాంకితులు డా. రాళ్లబండి కవితా ప్రసాద్ గారి స్మృతిలో ఏనుగు నరసింహారెడ్డి గారికి “సహృదయానుబంధ పురస్కారం” ఇవ్వడానికి పూనుకోవడం ముదావహం.
(డా. రాళ్లబండి కవితా ప్రసాద్ పురస్కారాన్ని ఏనుగు నరసింహారెడ్డి గారు అందుకున్న సందర్భంగా)
‘ఊహల వేదిక’పై నిలిచిన వాస్తవ శిల్పం
- Advertisement -
- Advertisement -



