నవతెలంగాణ పెద్దవంగర: సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని సీఆర్పీలు సంతోష్, నిరంజన్, రంగన్న, రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన ఓ సీఆర్పీ శ్రీకృష్ణుడి వేషధారణలో నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు వ్యవస్థ ఉండకూడదని నాడు చెప్పిన సీఎం కేసీఆర్ తమ సమస్యల పరిష్కారానికి ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో తమ డిపార్ట్మెంట్ వారిని ఆయా ప్రభుత్వాలు పర్మినెంట్ చేయగా, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సుదీర్ఘకాలంగా చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని తమను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేసి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.