వార్మప్ మ్యాచ్ లో స్టార్క్ హ్యాట్రిక్..

నవతెలంగాణ – తిరువనంతపురం: అక్టోబరు 5 నుంచి భారత్ లో వరల్డ్ కప్ పోటీలు జరగనుండగా, ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆస్ట్రేలియా జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతోంది. తిరువనంతపురంలో వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 23 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్ గా దిగిన స్టీవ్ స్మిత్ 55 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ 34, అలెక్స్ కేరీ 28 పరుగులు సాధించారు. మిచెల్ స్టార్క్ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అనంతరం, లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ జట్టును స్టార్క్ వణికించాడు. హ్యాట్రిక్ సాధించి డచ్ టాపార్డర్ ను దెబ్బతీశాడు. మొదటి ఓవర్ చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన స్టార్క్… ఆ తర్వాత మూడో ఓవర్ తొలి బంతికే వికెట్ తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ (0), వెస్లీ బరేసీ (0), బాస్ డీ లీడ్ (0) ముగ్గురూ స్టార్క్ ధాటికి పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. మరో ఓపెనర్ విక్రమ్ జిత్ సింగ్ వికెట్ ను మిచెల్ మార్ష్ తీయడంతో నెదర్లాండ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు 8 ఓవర్ల అనంతరం 4 వికెట్లకు 41 పరుగులు చేసింది. కొలిన్ అకెర్ మన్ 17, సైబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో 14.2 ఓవర్ల వర్ద వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

Spread the love