వేలం ఆపాలి

Stop the auction– సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలి
– సంస్థ నిర్వీర్యానికి కేంద్రం యత్నం
– ప్రజల ఆస్తులను ప్రయివేటుకు అప్పగించడంపై ఆగ్రహం
– శ్రావణపల్లి బ్లాకును సింగరేణికే ఇవ్వాలిొరాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) నిరసన ప్రదర్శనలు
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన బొగ్గు గనుల వేలం పాటను తక్షణమే ఆపేసి సింగరేణికి నేరుగా గనులను కేటాయించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) శ్రేణులు నినదించారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిని నిర్వీర్యం చేసే చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ సంపద, ప్రజల ఆస్తులను ప్రయివేటుకు అప్పగించడం సిగ్గుచేటన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణం నటరాజ్‌ సెంటర్‌లో పెద్దఎత్తున మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌ సంస్థలకు కేటాయించడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజె రమేష్‌ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌ మండల కేంద్రంలో నిరసన తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద పెద్దఎత్తున ధర్నా చేశారు. సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మెయిన్‌ చౌరస్తాలో ప్లకార్డ్స్‌ పట్టుకుని నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని, సింగరేణి కంపెనీ కూడా ప్రయివేట్‌ సంస్థలతో వేలం పాటలో పోటీ పడాలనే స్థితికి తీసుకొచ్చిందని నేతలు విమర్శించారు. బొగ్గు గనులన్నింటినీ ప్రయివేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదే ముంటుందని, క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి నిర్వీర్యం చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరేట్‌ ఏవోకు వినతి పత్రం అందజేశారు. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో సీపీఐ(ఎం) నాయకులు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఖమ్మం నగరంలోని సరిత క్లినిక్‌ సెంటర్‌ వద్ద నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా సరిత క్లినిక్‌ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం సింగరేణి 40 వేల మంది పర్మినెంట్‌ కార్మికులకు, మరో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదని, రికార్డు స్థాయిలో అతి తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్న ఘనత సింగరేణి సంస్థకే చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి
కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రయివేటీకరణ చేయడానికి వేలం వేయాలని చూస్తోందని, రాష్ట్రంలోని గనులను నేరుగా సింగరేణికే కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తీగల సాగర్‌, నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలి కానీ వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు అవకాశం కల్పించడం సరైంది కాదన్నారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేత కిషన్‌రెడ్డి స్వయంగా పాల్గొని హైదరాబాద్‌ కేంద్రంగా వేలం పాటను ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. శ్రావణపల్లి బ్లాకుతో పాటు మిగతా బ్లాక్‌లను కూడా తక్షణమే సింగరేణికి అప్పగించాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి.. ధర్నా చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాజీవ్‌ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాట ఆపాలని, సింగరేణికే నేరుగా గనులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీపీఐ(ఎం) శ్రేణులు నిరసనలు తెలిపారు. ముషీరాబాద్‌ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని గనులను ప్రయివేట్‌ సంస్థలకు అప్పజెప్పేందుకు యత్నిస్తోందన్నారు. బొగ్గు గనుల వేలం పాట చర్యను మానుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే, అంబర్‌పేట్‌, బంజారాహిల్స్‌, గుడిమల్కాపూర్‌ లక్ష్మీనగర్‌ చౌరస్తాలోనూ నిరసన తెలిపారు. అడ్డగుట్టలో, రహమత్‌ నగర్‌ డివిజన్‌లోని రెండు బొమ్మల సెంటర్‌ వద్ద, బన్సీలాల్‌పేట్‌లో ధర్నా చేపట్టారు. కంటోన్మెంట్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.

Spread the love