Thursday, May 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

- Advertisement -

బక్రీద్‌ సందర్భంగా అన్ని జాగ్రత్తలూ తీసుకోండి
జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ ఆదేశం
పాల్గొన్న ప్రభుత్వ కార్యదర్శులు జయేశ్‌ రంజన్‌, ఇలం బర్తి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

బక్రీద్‌ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్‌ ఆదేశించారు. బుధవారం బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్‌, రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి ఇలం బర్తీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ.. పశువుల అక్రమ రవాణా, అక్రమ వధలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా వేసి ఉంచాలనీ, నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా గోవధ నిషేధ చట్టం, గో అక్రమ రవాణా మొదలైన చట్టాలను అమలు జరపాలని ఆయన తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటక సరిహద్దులలో 52 చెక్‌పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాను నిరోధించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పశువుల రవాణా సాగుతున్న సమయంలో వాటికి సంబంధిత శాఖల నుంచి చట్టపరమైన అనుమతులు ఉన్నాయా, లేదా పరిశీలించుకోవాలని ఆయన తెలిపారు. ఎక్కువగా రవాణా జరుగుతున్న చోట చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి, అక్రమ రవాణాదారుల భరతం పట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. పశువుల అక్రమ రవాణా జరుగుతుంటే, వాటిని అడ్డుకునే ప్రయత్నాన్ని ఇటు గోరక్ష?కులు చేయొద్దనీ, ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేయాలనీ, వారే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. కొన్ని అవాంఛనీయ శక్తులు ఈ పండుగను ఆసరగా చేసుకొని మత కలహాలను రెచ్చగొట్టే ప్రమాదముందనీ, వారిపై నిఘా వేసి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ కోరారు. ముఖ్యంగా ఇరు వర్గాలకు చెందిన పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి శాంతియుతంగా బక్రీద్‌ పండుగ నిర్వహించుకునేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆవులను ఉంచడానికి స్థలాలను ఎంచుకొని అక్కడ వాటికి అవసరమైన గ్రాసం, నీళ్లు వంటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. పశువధశాలకు తరలించాల్సిన ఆవులకు సంబంధించి మునిసిపల్‌ శాఖ అధికారులు, సిబ్బంది తగిన ముద్రలతో చర్యలు తీసుకుంటున్నారనీ, ముద్రలు లేని పశువులను తరలించకుండా పోలీసులకు అవసరమైన సహకారాన్ని అందిస్తారని చెప్పారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఇలం బర్తి మాట్లాడుతూ.. అవసరమైన ప్రాంతాల్లో పశు వైద్యులు క్యాంపులు వేసుకొని తగిన వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేశ్‌ భగవత్‌తో పాటు నగర పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -