నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు

– రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌ ఏడీఏ డి.ఉపారాణి
– విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర టాస్క్‌ ఫోర్స్‌ బృందం
నవతెలంగాణ-ఆమనగల్‌
రైతులను మోసం చేసే విధంగా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌ ఏడీఏ డి.ఉషారాణి హెచ్చరించారు. ఆమనగల్‌ పట్టణంలోని పలు విత్తన విక్రయ కేంద్రాలలో ఆదివారం ఏడీఏ ఉషారాణి ఆధ్వర్యంలో రాష్ట్ర టాస్క్‌ ఫోర్స్‌ బృందం, శంషాబాద్‌ ఎస్‌ఓటీ సీఐ సత్యనారాయణ, సీడ్స్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీ అధికారి నగేష్‌ తదితరులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగ్రో రైతు సేవ కేంద్రం, సూర్య అగ్రి, శ్రీ మహేంద్ర ఫెర్టిలైజర్స్‌ సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌, వాసవి ఫెర్టిలైజర్స్‌, నాగార్జున ఆగ్రో కెమికల్స్‌ తదితర షాపుల్లో విస్తత తనిఖీలు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పత్తి విత్తనాలకు సంబంధించిన రిజిస్టర్లు, ఇన్వాయిస్‌ బిల్లులు తనిఖీ చేశారు. అదేవిధంగా హెర్బిసైడ్‌ టాలరెంట్‌ జన్యువు గురించి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మినచో పీడీ యాక్ట్‌ ప్రకారం చట్టరిత్యా శిక్షించబడతారని హెచ్చరించారు. అధిక ధరలకు విత్తనాలు విక్రయించరాదని, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని డీలర్లకు ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ రాష్ట్ర ట్రాన్స్‌ పోర్ట్‌ బందం, మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి, విక్రయ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Spread the love