సనోఫీ యాజమాన్యానికి వ్యతిరేకంగా సమ్మె

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సనోఫి యాజమాన్యానికి వ్యతిరేకంగా సోమ, మంగళవారం రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించారు. ఆ యాజమాన్యం కార్మిక చట్టాలను పట్టించుకోకుండా కార్మిక వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నది.ఉద్యోగులను ఇష్టానుసారంగా తొలగిస్తున్నది.
గతంలో హొయెచెస్ట్‌ ఆల్‌ ఇండియా రిప్రజెంటీటివ్స్‌ కమిటీ (హెచ్‌ఏఐఆర్‌సీ)తో సనోఫీ యాజమాన్యంతో చర్చించి చాలా సమస్యలను పరిష్కరించింది. అయినప్పటికీ కొన్ని నెలలుగా మళ్లీ ఉద్యోగులను తొలగిస్తుండటంతో రాష్ట్రంలోనూ ఆ సంస్థ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటీటివ్స్‌ యూనియన్‌ (టీఎంఎస్‌ఆర్‌యూ), ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటీటివ్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎంఆర్‌ఏఐ) ఆధ్వర్యంలో ధర్నా, సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంఎస్‌ఆర్‌ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను కిరణ్‌ మాట్లాడుతూ సనోఫీ యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా అర్థరాత్రి ఉద్యోగులను తొలగించిందని విమర్శించారు. ఎఫ్‌ఎంఆర్‌ఏఐ కార్యవర్గ సభ్యులు ఐ.రాజుభట్‌ మాట్లాడుతూ బీజేపీ కార్మికుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు.
ఆ పార్టీ తీసుకొస్తున్న లేబర్‌ కోడ్‌ లకు వ్యతిరేకంగా కార్మికసంఘాలు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. సనోఫీ ఎంప్లాయీస్‌ రాష్ట్ర కన్వీనర్‌ సురేందర్‌ మాట్లాడుతూ తనను కూడా యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించిందనీ, తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు.
తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోతే ముంబయిలోని సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎంఎస్‌ఆర్‌ యూ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వర రావు, రాష్ట్ర నాయకులు జగదీష్‌ చారి, జిల్లా కార్యదర్శి రాజ్‌ కుమార్‌, సనోఫి కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love