Monday, June 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగద్వాలలో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి

గద్వాలలో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి

- Advertisement -


ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం) నాయకులను బేషరతుగా విడుదల చేయాలి : జాన్‌‌వెస్లీ
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గద్వాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే ఎర్రవల్లికి చెందిన నీట్ విద్యార్థిని ఇందు మృతి చెందిందనీ, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శ జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. న్యాయం చేయాలని ధర్నా చేసిన సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన విద్యార్థినిని శవంగా మార్చి కుటుంబ సభ్యులకు అప్పగించడం పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వైద్యులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోస్టుమార్టం నిర్వహించారని విమర్శించారు. ఏ తప్పూ లేకుంటే దొడ్డిదారిన అంబులెన్స్ లో శవాన్ని తరలించాల్సిన అవసరం ఆస్పత్రి యాజమాన్యానికి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణమే స్పందించి విద్యార్థిని ఇందు మృతికి కారణమైన నిర్లక్ష్యపు డాక్టర్లను వెంటనే సస్పెండ్‌ ‌చేయాలని కోరారు. గతంలోనూ ఇలాంటి అనేక మరణాలకు కారణమైన గద్వాల ప్రభుత్వాస్పత్రి సూపరిండెంటెంట్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. ఇందు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని కోరారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇవ్వాలనీ, ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలని డిమాండ్‌ ‌చేశారు. తమ బిడ్డను కోల్పోయి న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను, ఎర్రవల్లి గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. ధరూర్, గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లలో ఉంచిన నాయకులను, బాధితులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -