విద్యార్థులు ఉగ్రవాదులా?

– నాగర్‌ కర్నూల్‌లో అక్రమ అరెస్టులకు ఎస్‌ఎఫ్‌ఐ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆ సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులను పోలీసులు మధ్యలో అడ్డగించి, అక్రమంగా అరెస్ట్‌ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారని తెలిపారు. వారిపై కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సమస్యలను పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్‌ చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? అని ప్రశ్నించారు. పేద విద్యార్థుల చదువుకు ఆటంకంగా ఉన్న సమస్యలను పరిష్కరిం చాలనీ, లేదంటే ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love