నవతెలంగాణ-జూబ్లీహిల్స్
యూసుఫ్ గూడా డివిజన్ శ్రీకష్ణ నగర్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పూర్ణ టిఫిన్ సెంటర్ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. మురికి కాలువలు కబ్జా చేసి ఇల్లు కట్టడం వల్ల గత 30 సంవత్సరాలుగా శ్రీకష్ణ నగర్ లో కొద్దిపాటి వర్షానికి డ్రయినేజీ మ్యాన్ హౌల్స్ తెరిచి వర్షపు నీరు మొత్తం రోడ్డు పైనుండే పంపుతారని పలువురు చెబుతు న్నారు. శ్రీకష్ణనగర్ పూర్తిగా దిగువ ప్రాంతంలో ఉన్నందున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, వెంకటగిరి, ఐలం కాలనీ ఎగువ ప్రాంతం అయినందున, ఆ నీరు మొత్తం శ్రీకష్ణ నగర్ రోడ్డు నుంచి యూసుఫ్ గూడా ప్రధాన రోడ్డుపై పారుతూ వెళ్ళాలి. అక్కడ నివసిస్తున్న వాళ్లకు ఈ వర్షపు బాధలు అలవాటైపోయింది. వర్షం తగ్గినా కూడా, డ్రయినేజీ నీరు మొత్తం వెళ్లే వరకు వారు ఇండ్ల నుండి బయటకు రాలేరు, బయటకు వెళ్లినవారు ఇండ్లలోకి చేరలేరు. ఎంతమంది నాయకులు వచ్చినా వర్షపు నీరు, డ్రయినేజీ నీరు సులువుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.