సక్సెస్‌ మంత్ర..

– అసంతృప్తులను చల్లార్చేందుకు కేసీఆర్‌ వ్యూహం
– దూరంగా ఉన్న వారిని కలుపుకుపోండి..
– ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను ‘చే’జారనీయొద్దు
– ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలకు గులాబీ బాస్‌ దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ సీఎం కేసీఆర్‌.. తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఎలక్షన్ల సమయంలో ఎక్కడా.. ఎలాం టి చిన్న లోపం లేకుండా చూసుకోవా లని, తద్వారా పార్టీని మూడోసారి కూడా విజయపథంలో నడిపించాలని ఆయన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. ఈ రకమైన ‘సక్సెస్‌ మంత్ర’ను అన్ని నియోజక వర్గాల్లోనూ అమలు చేయాలంటూ ఆయన ఆదేశించారు. 2018లో బీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు.. అధికార పార్టీలోకి జంప్‌ చేశారు. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీల నుంచి వలసలు జోరందుకున్నాయి. వీరితోపాటు కేసీఆర్‌తో ఉద్యమంలో పాల్గొన్న పాత నాయకులు, భవిష్యత్తుల్లో రాజకీయాల్లో రాణించాల నుకుంటున్న నూతన నాయకత్వంతో కారు నిండి పోయింది. అది నిండిపోవటమే కాదు.. లోడెక్కు వైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఇది ఇబ్బందులు తెచ్చేలా ఉంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు (సిట్టింగులతో కలిపి) సీటు కోసం పోటీ పడుతున్నారు. తమ పార్టీ బలానికి ఇది నిదర్శమంటూ నాయకులు చెబుతు న్నా.. ఎన్నికల నాటికి టిక్కెట్‌ దక్కని వారితోపాటు ఆశావహల్లో అసంతృప్తి పెరిగే అవకాశం లేక పోలేదు. అందుకే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న కేసీఆర్‌.. ఈ విష యాన్ని ముందే పసిగట్టి, అందుకనుగు ణంగా కార్యాచరణ రూపొందించారని పలువురు సీనియర్లు చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగా హైదరాబాద్‌తో పాటు మిగతా అన్ని జిల్లాల నియోజక వర్గాల్లోని ఎమ్మెల్యేలకు కీలక బాధ్యలను ఆయన అప్పగించారు. ముఖ్యంగా ఇప్పటిదాకా ఏ పదవులు దక్కని ఉద్యమ నాయకులు, సీటు దక్కని సీనియర్లు, సీటు కోసం ఎదురు చూస్తున్న ఆశావహులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సీఎం సూచిం చారు. వారిలో ఏ మాత్రం అసంతృప్తి ఉందని తెలి సినా.. వెంటనే పిలిచి మాట్లాడాలంటూ ఆదేశిం చారు. ఒకవేళ తాము చెప్పినా వినకపోతే సంబంధిత జిల్లా మంత్రి సమక్షంలో సుహృద్భావ వాతావరణం లో వారితో చర్చలు జరపాలని కోరారు. అసంతృప్తి తో ఉన్న వారి మనసు నొప్పించకుండా… వారిని ఒప్పించాలని మార్గదర్శనం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఎమ్మెల్యేలే నిర్వహించాలనీ, బాధ్యత మొత్తం వారిదేనని కేసీఆర్‌ సూచించినట్టు తెలిసింది. దీంతోపాటు నగరాలు, పట్టణాల్లో అయితే కార్పొరే టర్లు, కౌన్సిలర్లు, గ్రామాల్లో అయితే సర్పంచులు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల కదలి కలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలనీ, ఎన్నికల సమయంలో వారు ‘చే’జారకుండా చూసుకోవా లంటూ ఆయన నిర్దేశించారని తెలిసింది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాలు, అసెంబ్లీ సమావేశాల పేరిట బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు ప్రయత్నించిన సీఎం.. అసంతృప్తులను తేలిగ్గా తీసుకోవద్దంటున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే’ సామెత మాదిరిగా ఏ చిన్న అసంతృప్తి కనిపించినా.. దాన్ని ఆదిలోనే చల్లార్చేందుకు ఈ సక్సెస్‌ మంత్రాన్ని కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు ఉపదేశిం చారని ఆయా వర్గాలు పేర్కొనటం గమనార్హం.

Spread the love