ఐఏఏఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా సుమరివిల్ల

– ఏఎఫ్‌ఐ చీఫ్‌ అరుదైన ఘనత
బుదాపెస్ట్‌: భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు, మాజీ ఒలింపియన్‌ అదిల్లె సుమరివిల్ల అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గురువారం బుదాపెస్ట్‌లో జరిగిన ఐఏఏఎఫ్‌ ఎన్నికల్లో సుమరివిల్ల నలుగురు వైస్‌ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఎన్నికై, ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో నాలుగేండ్లు కొనసాగనున్నాడు. అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్యలో గత రెండు పర్యాయాలు కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికైన సుమరివిల్ల.. ఈసారి ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో అడుగుపెట్టాడు. ఓ భారతీయుడు ఐఏఏఎఫ్‌లో ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావటం ఇదే ప్రథమం. ఇక ఇంగ్లాండ్‌ మాజీ ఒలింపియన్‌ సెబాస్టియన్‌ ముచ్చటగా మూడోసారి ఐఏఏఎఫ్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు. అధ్యక్షుడిగా సెబాస్టియన్‌కు ఇదే చివరి టర్మ్‌ కానుంది. రూల్స్‌ ప్రకారం మూడు పర్యాయాల కంటే ఎక్కువగా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు వీల్లేదు.

Spread the love