వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలి

Support price for agricultural products should be legalized– స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలి
– జులై 10న ఢిల్లీలో రైతు సంఘాల సమావేశం : మాజీ మంత్రి, సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల (ఎంఎస్‌పీ)ను చట్టబద్ధం చేయాలని మాజీ మంత్రి, సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోపలు రైతు సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023-24 ఏడాదికి గాను కనీస మద్దతు ధరల పెంపుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫారుల మేరకు మద్దతు ధరలు దేశంలో ఇప్పటికీ అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చేందుకు స్వామినాధన్‌ సిఫారసులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధరలను చెల్లిస్తామని ప్రకటించిన ప్రధాని మోడీ వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. ఉత్పత్తి ఖర్చు, రైతుల సేవలకు అదనంగా 50 శాతాన్ని జోడించి మద్దతు ధర నిర్ణయించాలని కమిషన్‌ సూచిస్తే కేవలం మొదటి రెండింటిని మాత్రమే బీజేపీ సర్కార్‌ అమలు చేసిందని విమర్శించారు. రైతు రుణమాఫీ చేయాలని 2018 నుంచి చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిరుపేద, చిన్న, సన్నకారు రైతుల రుణాలను కాదని, పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేసిందని విమర్శలు గుప్పించారు. నేషనల్‌ క్రైం బ్యూరో రికార్డు లెక్కల ప్రకారం దేశంలో 1.9 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలను నిరోదించాలంటే కేరళ తరహాలో రైతు రుణ ఉపశమన చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేయనున్న రైతు రుణ మాఫీలో కేంద్రం సగం భరించాలని కోరారు. అఖిల భారత సభ జాతీయ కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ 2017లో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను కాల్పుల్లో చంపించిన వ్యక్తిని కేంద్ర వ్యవశాయశాఖ మంత్రిగా నియమిస్తే రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వెంటనే వ్యవశాయ శాఖ మంత్రిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఎంఎస్‌పీ పై కేంద్రం అనుసరించిన విధానంలో శాస్త్రీయత పూర్తిగా లోపించిందని గుర్తు చేశారు. ఫలితంగా గత పదేండ్లలో మద్దతు ధర 6 నుంచి 7 శాతం పెరిగిత,ే వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, కూలీలు, డీజిల్‌ తదితర వస్తువుల ధరలు 16 నుంచి 20 శాతం పెరిగాయని తెలిపారు. స్వామినాథన్‌ సిఫారసుల మేరకు పెంచితే ప్రస్తుతం వరికి క్వింటాలుకు రూ.2,183గా ఉన్న మద్దతు ధర రూ.3,150కి పెరిగేదని గుర్తు చేశారు.కేరళ సర్కార్‌ తరహాలో ఆహార ధాన్యాలతో పాటు పండ్లు, కూరగాయలకు సైతం మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్‌ పోరాటాల రూపకల్పన తదదితర అంశాలపై చర్చించేందుకు జులై 10న ఢిల్లిలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాల సమావేశాన్ని నిర్వహించన్నుట్టు తెలిపారు. రైతు స్వరాజ్‌ వేదిక నాయకులు విస్సా కిరణ్‌, కన్నెగంటి రవి మాట్లాడుతూ ఉత్పత్తి వ్యయంపై అదనంగా 50 శాతం జోడించి ఎంఎస్‌పీ ప్రకటించాల్సి ఉండగా, మొక్కుబడిగా ఏటా వంద, యాభై పెంచుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఇప్పటికైనా మద్దతు ధరల విషయంలో పునరాలోచించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకాలను కౌలు రైతులకు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు బి.కొండల్‌, జక్కుల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love