ముంబయి : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నియంత పాలనను ప్రజలు తిరస్కరించా రని నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్‌సీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభ సభ్యులు సుప్రియా సూలే అన్నారు. ఇటీవల ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను ‘ఇండియా’ ఫోరం గెలుచుకోవడంపై ఆమె స్పందించారు. ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు దేశంలో ధరలు, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా ఓటేశారని, బీజేపీ నియంతృత్వ పాలనను తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అదేవిధంగా మహారాష్ట్రలో కరువు పరిస్థితులు, మరాఠా రిజర్వేషన్‌లపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.