78 మంది ఎంపీల సస్పెన్షన్‌

– పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారి
– రాజ్యసభలో 45 మంది
– లోక్‌సభలో 33 మంది
– ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లుల ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్య ఘటనపై ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. ఈ వైఫల్యంపై చర్చ జరపాలనీ, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసినందుకు ఉభయ సభల్లో 78 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. పార్లమెంట్‌ చరిత్రలో ఇంత మందిని సస్పెండ్‌ చేయటం ఇదే తొలిసారి. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రకటించారు. గత వారం 14 మందిని సస్పెండ్‌ చేయగా, సోమవారం 78 మందిపై వేటు వేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 92 మందిపై వేటు పడింది. ప్రతిపక్షాల ఆందోళనతో సోమవారం సభా కార్యకలాపాలు స్తంభించాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారని పేర్కొంటూ రాజ్యసభలో 45 మంది, లోక్‌సభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సహా 33 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటువేశారు. కాగా, లోక్‌సభలో ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు ముగ్గురిని సస్పెండ్‌ చేశారు. లోక్‌సభలో ఎంపీలు కె జయకుమార్‌, విజరు వసంత్‌, అబ్దుల్‌ ఖలీక్‌ అనే ముగ్గురు స్పీకర్‌ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారని, వారిని ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక వచ్చేవరకు సస్పెండ్‌ చేశారు. రాజ్యసభలో 11 మంది ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెన్షన్‌కు గురయ్యారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రివిలేజెస్‌ కమిటీకి సూచించారు. ప్రివిలేజెస్‌ కమిటీకి నివేదించిన వారిలో జెబి మాథర్‌ హిషామ్‌, ఎల్‌.హనుమంతయ్య, నీరజ్‌ డాంగి, రాజమణి పటేల్‌, కుమార్‌ కేత్కర్‌, జి. సి. చంద్రశేఖర్‌, బినోరు విశ్వం, పి. సంతోష్‌ కుమార్‌, మొహమ్మద్‌ అబ్దుల్లా, జాన్‌ బ్రిట్టాస్‌, ఎ. ఎ. రహీమ్‌ లు ఉన్నారు.
లోక్‌సభ సోమవారం ప్రారంభం కాగానే పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై చర్చించాలని, ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుపట్టారు. అందుకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ సభ లోపల నిరసనలు, ప్రదర్శనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ సక్రమంగా పనిచేయాలని అన్నారు. ‘ఈ అంశంపై రాజకీయాలు చేయడం బాధాకరం. వెల్‌లోకి ప్రవేశించి నినాదాలు చేయడం సభ గౌరవానికి విరుద్ధం. ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపేందుకు మీ (ప్రతిపక్షం) సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను’ అని బిర్లా అన్నారు. వెంటనే సభను వాయిదా వేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధపడకపోవడం, ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించకపోవడంతో సభలో వరుసగా వాయిదాల పరంపర కొనసాగింది. చివరికి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసి సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ ఆందోళనల మధ్యే టెలి కమ్యూనికేషన్‌ బిల్లు, పోస్ట్‌ ఆఫీస్‌ బిల్లు-2023ను మూజువాణి ఓటుతో ఆమోదించారు.
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే అంశంపై ఆందోళన జరిగింది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ భద్రత వైఫల్యంపై చర్చించాలని పట్టుపట్టారు. అందుకు ప్రభుత్వం సిద్ధపడకపోవడం, ప్రతిపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఇక్కడ కూడా పదే పదే వాయిదాల పర్వమే కొనసాగింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు జమ్మూ, కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లు, 2023, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు 2023ని రాజ్యసభలో పరిశీలన, ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. ఆ రెండు బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. 45 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసి సభను నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.

ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదు : హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌
ఎంపీల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని ఎస్‌ఏడీ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అన్నారు. ‘ఇది పెద్ద భద్రతా లోపం, ఇంటెలిజెన్స్‌ వైఫల్యం.. ఇది ఎలా జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రశ్నలు అడిగిన వారిని సస్పెండ్‌ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదు’ అని ఆమె అన్నారు.

పార్లమెంట్‌, ప్రజాస్వామ్యంపై దాడి : ఖర్గే
రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ‘మొదట, చొరబాటుదారులు పార్లమెంటుపై దాడి చేశారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌, ప్రజాస్వామ్యంపై దాడి చేసింది. మూకుమ్మడిగా ఎంపీలను సస్పెండ్‌ చేయడం ద్వారా నిరంకుశ మోడీ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను చెత్తబుట్టలో పడవేస్తోంది’ అని విమర్శించారు. పార్లమెంట్‌ భద్రతలో క్షమించరాని ఉల్లంఘనపై కేంద్ర హౌంమంత్రి పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేయాలి. దీనిపై సవివరమైన చర్చ జరగాలి. ప్రధాని మోడీ వార్తాపత్రికలకు ఇంటర్వ్యూ ఇవ్వవచ్చు. హౌంమంత్రి టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. కానీ, భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటుకు మాత్రం సమాధానం చెప్పరు. ‘ప్రతిపక్షాలు లేని పార్లమెంటుతో, మోడీ ప్రభుత్వం ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన చట్టాలను బుల్డోజ్‌ చేయగలదు. అసమ్మతిని ఎలాంటి చర్చ లేకుండానే అణిచివేయగలదు’ అని విమర్శించారు.

Spread the love