అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

Suspension of Anjani Kumar– కొత్తకోటకు నగర కొత్వాల్‌ పగ్గాలు
– సైబరాబాద్‌కు అవినాశ్‌ మహంతి
– రాచకొండకు సుధీర్‌బాబు
–  కొత్త సీపీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
– నార్కొటిక్‌ డ్రగ్స్‌ డైరెక్టర్‌గా శాండిల్య
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్ర పోలీసు శాఖలో భారీ మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఒకపక్క, రాష్ట్ర మాజీ డీజీపీ అంజనీకుమార్‌పై ఈసీ సస్పెన్షన్‌ ఎత్తివేయగా, మరోవైపు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండలకు కొత్త పోలీసు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్‌ పోలీసు శాఖ బాధ్యతలను అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించటం పోలీసుశాఖలో హల్‌చల్‌ సృష్టించింది. మరోవైపు, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అదే కమిషనరేట్‌లో జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న అవినాశ్‌ మహంతిని నియమించిన సర్కార్‌.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ సుధీర్‌బాబుకు రాచకొండ పగ్గాలను అప్పగించింది. కాగా, హైదరాబాద్‌ ప్రస్తుత కమిషనర్‌ సందీప్‌ శాండిల్యకు నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో డైరెక్టర్‌గా నియమించి, రాచకొండ, సైబరాబాద్‌ ప్రస్తుత కమిషనర్లు డి.ఎస్‌ చౌహాన్‌, స్టీఫెన్‌ రవీంద్రలను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.
ఐపీఎస్‌, రాజకీయ వర్గాల్లో చర్చ
1994 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డికి అత్యంత కీలకమైన హైదరాబాద్‌ కమిషనర్‌ బాధ్యతలను అప్పగించటం ఐపీఎస్‌, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అత్యంత నిజాయితీపరుడు, ముక్కుసూటిగా వ్యవహరించే పోలీసు అధికారిగా పేరు పొందిన శ్రీనివాస్‌రెడ్డిని కొంతకాలం మాత్రమే లా అండ్‌ ఆర్డర్‌ పోస్టింగ్‌లలో గత ప్రభుత్వాలు కొనసాగించాయి. ఎలాంటి పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు, సిఫారసులకు తలొగ్గకుండా చట్టపరిధిలోనే వ్యవహరించటానికి మొగ్గు చూపే శ్రీనివాస్‌రెడ్డికి కీలకమైన శాంతిభద్రతల పోస్టులను అప్పగించటానికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించేవారు కాదనే అభిప్రాయం ఉన్నది. అయితే, అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. శ్రీనివాస్‌రెడ్డికి సీపీ బాధ్యతలను అప్పగించటాన్ని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
రాష్ట్రంలో మరో కీలకమైన కమిషనర్‌ పోస్టు సైబరాబాద్‌ పగ్గాలను సైతం నిజాయితీపరుడు, సమర్థవంతమైన ఐపీఎస్‌ అధికారిగా పేరు పొందిన అవినాశ్‌ మహంతికి అప్పగించి పోలీసు వర్గాల్లో ప్లస్‌ మార్కులనే ప్రభుత్వం కొట్టేసింది. గతంలో రాష్ట్ర డీజీపీగా పని చేసి దేశంలోనే నిజాయితీపరులైన ఐపీఎస్‌ అధికారులలో ఒకడిగా పేరు పొందిన ఎ.కె మహంతి కుమారుడు అవినాశ్‌ మహంతి. రాష్ట్రంలో మాదక పదార్థాలను కఠినంగా అణచివేయడానికి ఉద్దేశించిన నార్కొటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా మరో సిన్సియర్‌ ఐపీఎస్‌ అధికారి సందీప్‌ శాండిల్యను నియమించటం కూడా మంచి చర్యల్లో ఒకటిగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
అంజనీకుమార్‌, సి.వి ఆనంద్‌ పోస్టింగ్‌లపై ఉత్కంఠ
ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా ఈనెల 3న కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన డీజీపీ అంజనీకుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవటంతో ఆయనకు కొత్త సర్కారు ఎలాంటి బాధ్యతలను అప్పగిస్తుందోనన్న ఆసక్తి నెలకొన్నది. డీజీపీగా రవిగుప్తాను ఎన్నికల కమిషన్‌ నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ హౌదాలో రాష్ట్రంలో ఏసీబీ డీజీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ పోస్టులు మాత్రమే మిగిలాయి. అయితే, అంజనీకుమార్‌తో పాటు ఎన్నికల సమయంలో నగర పోలీసు కమిషనర్‌ పదవి నుంచి తప్పించబడిన డీజీపీ స్థాయి అధికారి సి.వి ఆనంద్‌ సైతం పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిద్దరికి ఏ పోస్టింగ్‌ దక్కుతుందోననే ఉత్కంఠ ఐపీఎస్‌ వర్గాల్లో నెలకొన్నది.
ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను ఎన్నికల కమిషన్‌ నియమించినప్పటికీ వివాదరహితుడు, తన పని తాను చేసుకుపోయే అధికారిగా పేరుపొందిన రవి గుప్తాను ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తప్పించకపోవచ్చనే అభిప్రాయం అధికారిక వర్గాల నుంచి వినిపిస్తున్నది. అదే సమయంలో ఏపీ క్యాడర్‌కు చెందిన అంజనీకుమార్‌ అంశం రాష్ట్ర హైకోర్టు పరిశీలనలో ఉండటం కూడా గమనార్హం.

Spread the love