స్వామినాథన్‌ సేవలు మరువలేనివి..

Swaminathan's services are unforgettable..– వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి
– విత్తన రంగంలో నిరంతరం పరిశోధనలు జరగాలి
– కేరళ తరహాలో పంట క్వింటాకు రూ.700 బోనస్‌ ఇవ్వాలి : సెమినార్‌లో అఖిలభారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
భారత వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎంఎస్‌.స్వామినాథన్‌ చేసిన సిఫారసులు మరువలేనివని అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌.స్వామినాథన్‌ స్మారకార్థం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నర్సింహారెడ్డి భవన్‌లో గురువారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ‘భారత వ్యవసాయరంగం- స్వామినాథన్‌ సంస్కరణలు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో సారంపల్లి ప్రసంగించారు. స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పదేండ్లు అవుతున్నా చేయలేదని విమర్శించారు. స్వామినాథన్‌ రైతుల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు చేశారని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలని, అప్పుడే దేశం అభివృద్ధి అవుతుందని, రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలని.. ఇలాంటి అనేక సిఫారసులు స్వామినాథన్‌ చేశారని చెప్పారు. విత్తన ఉత్పత్తి సంస్థగా భారతదేశం అభివృద్ధి కావాలని నిరంతరం ఆకాంక్షించారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల మూలంగా రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కొంతమంది విద్యుత్‌ ప్రమాదం మూలంగా చనిపోయారని వివరించారు.
మరికొందరు రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక, తెచ్చిన అప్పులు తీరక చనిపోయారని చెప్పారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ వామపక్ష ప్రభుత్వం పంటలకు మద్దతు ధరతోపాటు రూ.700 అదనంగా బోనస్‌ ఇస్తోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లోబీజేపీ, బీఆర్‌ఎస్‌ను రైతాంగం ఓడించాలని పిలుపునిచ్చారు. మహిళా రైతుల అభ్యున్నతి కోసం కుటుంబ స్త్రీ పథకం అమలు చేయాలని స్వామినాథన్‌ సిఫారసు చేశారన్నారు.
విత్తన రంగంలో వస్తున్న మార్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిశోధనలు జరపాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 1991 నుంచి ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాలు, ప్రతిపాదనల వల్ల దేశంలో సంస్కరణలు వేగవంతం అయ్యాయని తెలిపారు. ఫలితంగా రైతాంగం అనేక సబ్సిడీలను కోల్పోయిందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు లాభం జరిగే చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుం టున్నాయన్నారు.
అంతకుముందు ఎంఎస్‌.స్వామినాథన్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభానాయక్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, మట్టిపల్లి సైదులు, కోటగోపి, చెరుకు ఏకలక్ష్మీ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love