అర్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న వారిపై ముందుగా చర్యలు తీసుకోండి

– టీఎస్‌ఎంసీకి డాక్టర్‌ రాజీవ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతూ అర్హత లేకున్నా అల్లోపతి వైద్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ ఆర్‌ డీఏ) మాజీ అధ్యక్షులు డాక్టర్‌ రాజీవ్‌ డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ), నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గుర్తించని, తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ) నమోదు చేయని డిగ్రీలను, అర్హతలను అల్లోపతి వైద్యులు డిస్‌ప్లే చేయకూడదని ఇటీవల టీఎస్‌ఎంసీ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం డాక్టర్‌ రాజీవ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర వైద్యవిధానాల్లో అర్హత పొందిన వ్యక్తులు ఆధునిక వైద్యం చేయడా నికి వీల్లేదని తెలిపారు. అల్లోపతి కాకుండా ఇతరులు వైద్యం చేస్తే తప్పుడు రోగ నిర్దారణ, చికిత్సలో జాప్యంతో ఆరోగ్యం క్షీణించడం, అవసరం లేని మందులను సూచించటం ద్వారా దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించారు. ఉదాహరణకు అధికంగా పెయిన్‌ కిల్లర్స్‌ మందుల వాడకంతో మూత్రపిండాలు విఫలమై ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు. ఇలాంటి అర్హత లేని వారిపై ముందుగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్‌ఎంపీల ద్వారా గర్భస్రావాలు ఎక్కువగా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love