టాలన్స్‌ 30-30 ఐరన్‌మెన్‌

– ఫలితం తేలని అగ్ర జట్ల సమరం
– ఆఖరు క్షణంలో టాలన్స్‌ టై గోల్‌
– ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ 2023
జైపూర్‌ : ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) అగ్ర జట్ల నడుమ ముఖాముఖి పోరు ‘టై’గా ముగిసింది. ఆఖరు క్షణం వరకు అత్యంత ఉత్కంఠగా సాగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో తెలుగు టాలన్స్‌, మహారాష్ట్ర ఐరన్‌మెన్‌ 30-30తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఆట 59వ నిమిషంలో 30-28తో ఐరన్‌మెన్‌ రెండు గోల్స్‌ ఆధిక్యంలో నిలిచి గెలుపుపై దీమాగా కనిపించినా.. ఆఖరు 60 సెకండ్లలో తెలుగు టాలన్స్‌ అసమాన ప్రదర్శన చేసింది. రాహుల్‌ నైన్‌ మెరుపు గోల్‌తో ఆశలు సజీవంగా నిలుపగా.. ఆఖరు క్షణంలో కైలాష్‌ పటేల్‌ కండ్లుచెదిరే గోల్‌తో అదరగొట్టాడు. 30-30తో ఐరన్‌మెన్‌తో టాలన్స్‌ మ్యాచ్‌ టైగా ముగిసింది. టైగా ముగిసిన మ్యాచ్‌లో తెలుగు టాలన్స్‌, మహారాష్ట్ర ఐరన్‌మెన్‌ చెరో పాయింట్‌ పంచుకున్నాయి. 9 మ్యాచుల్లో ఏడు విజయాలు, ఓటమి, టైతో 15 పాయింట్లతో ఐరన్‌మెన్‌… 9 మ్యాచుల్లో ఆరు విజయాలు, రెండు ఓటములు, ఓ టైతో తెలుగు టాలన్స్‌ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. తెలుగు టాలన్స్‌, మహారాష్ట్ర ఐరన్‌మెన్‌ ఇప్పటికే సెమీఫైన్సల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు టాలన్స్‌ గ్రూప్‌ దశలో చివరి మ్యాచ్‌లో నేడు గార్విట్‌ గుజరాత్‌తో పోటీపడనుంది.
ఆఖర్లో అద్భుతం : ఆఖరు వరకు పోరాడే తత్వమే తెలుగు టాలన్స్‌ను ఐరన్‌మెన్‌తో మ్యాచ్‌లో నిలబెట్టింది. నిజానికి మ్యాచ్‌లో ఏ దశలోనూ తెలుగు టాలన్స్‌ ఆధిక్యంలో నిలువలేదు. ఆట ఆరంభమైన తొలి 3 నిమిషాల్లో 2-1తో ముందంజ వేసిన తెలుగు టాలన్స్‌.. ఆ తర్వాత ఐరన్‌మెన్‌ ఒత్తిడికి తలొగ్గింది. గోల్‌ కీపర్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లో అంచనాలను అందుకోలేదు. దీంతో ప్రథమార్థం 30 నిమిషాల ఆట ముగిసేసరికి తెలుగు టాలన్స్‌ 11-16తో ఐదు గోల్స్‌ వెనుకంజలో నిలిచింది. ద్వితీయార్థంలోనూ తెలుగు టాలన్స్‌ వెనుకంజలోనే కొనసాగినా.. గోల్‌ వేటలో రెచ్చిపోయింది. అయినా 13-17, 14-18, 16-21, 20-24తో ఐరన్‌మెన్‌ ముందంజ వేసింది. చివరి మూడు నిమిషాల ఆటలో తెలుగు టాలన్స్‌ తడాఖా చూపించింది. 27-29, 28-29తో ఆధిక్యం తగ్గించిన తెలుగు టాలన్స్‌ చివరి నిమిషంలో రెండు మెరుపు గోల్స్‌ కొట్టి లెక్క సరి చేసింది. విరామం అనంతరం సెకండ్‌ హాఫ్‌లో తెలుగు టాలన్స్‌ 19 గోల్స్‌ నమోదు చేయగా.. ఐరన్‌మెన్‌ 14 గోల్స్‌ మాత్రమే సాధించింది. తెలుగు టాలన్స్‌ స్టార్‌ ఆటగాడు దేవిందర్‌ సింగ్‌ భుల్లార్‌ ఏడు గోల్స్‌ కొట్టగా.. కైలాష్‌ పటేల్‌ ఐదు గోల్స్‌ సాధించాడు. మోహిత్‌ కుమార్‌, నసీబ్‌ సింగ్‌, రాహుల్‌లు మూడేసి గోల్స్‌తో రాణించారు.

Spread the love