మన జోడీ వరల్డ్‌ నం.3

–  సాత్విక్‌, చిరాగ్‌ కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌
–  ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కొంతకాలంగా దిగజారుతున్న భారత షట్లర్ల ర్యాంకింగ్స్‌ పరంపరకు ఈ వారంతో బ్రేక్‌ పడింది!. ఇటు మెన్స్‌ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ సాధించగా.. అటు మెన్స్‌ సింగిల్స్‌లో మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌, యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ సైతం చెప్పుకోదగిన పురోగతి సాధించారు. ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ పురుషుల డబుల్స్‌ చాంపియన్స్‌గా నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌ ద్వయం ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీ, విలువైన పాయింట్లతో పాటు వరల్డ్‌ నం.3 ర్యాంక్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జంట మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానం దక్కించుకుంది.
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ మూడు స్థానాలు మెరుగయ్యాడు. యువ సంచలనం లక్ష్యసేన్‌ సైతం రెండు స్థానాలు ఎగబాకాడు. కిదాంబి శ్రీకాంత్‌ వరల్డ్‌ నం.19, లక్ష్యసేన్‌ వరల్డ్‌ నం.18 ర్యాంక్‌లతో తిరిగి టాప్‌-20లోకి అడుగుపెట్టారు. ఇండోనేషియా ఓపెన్‌ సెమీఫైనల్లో విక్టర్‌ అక్సెల్సెన్‌కు టైటిల్‌ పోరు బెర్త్‌ చేజార్చుకున్న హెచ్‌.ఎస్‌ ప్రణరు ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌లో భారత్‌ నుంచి ఉత్తమ ర్యాంక్‌ ఆటగాడు ప్రణయే. వర్థమాన షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌ నాలుగు స్థానాలు మెరుగై 30వ స్థానంలో నిలిచాడు. టాప్‌-30లోకి ప్రవేశించటంతో రజావత్‌కు ఇదే ప్రథమం. మహిళల సింగిల్స్‌లో టాప్‌ షట్లర్‌ పి.వి సింధు వరల్డ్‌ నం.12గా నిలువగా.. వెటరన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓ స్థానం మెరుగై 31వ స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి 16వ, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి, రోహన్‌ కపూర్‌లు 33వ స్థానాల్లో నిలిచారు.
తైపీలో మెరుస్తారా? : ఇక తైపీ ఓపెన్‌లో నేటి నుంచి ప్రధాన టోర్నీ పోటీలు ఆరంభం కానున్నాయి. మెన్స్‌ సింగిల్స్‌లో మూడో సీడ్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు నేడు తొలి మ్యాచ్‌లో క్వాలిఫయర్‌ చైనీస్‌ తైపీ ఆటగాడితో తలపడనున్నాడు. టాప్‌ సీడ్‌ ఉపసంహరణతో నేరుగా ప్రధాన డ్రాలోకి వచ్చిన పారుపల్లి కశ్యప్‌ నేడు జర్మనీ క్వాలిఫయర్‌తో ఆడనున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి, రోహన్‌ కపూర్‌లతో మరో భారత జోడీ నవనీత్‌, ప్రియ జంట ఢకొీట్టనుంది. మిథున్‌ మంజునాథ్‌, ఆకర్షి కశ్యప్‌, కిరణ్‌ జార్జ్‌, శంకర్‌ ముతుస్వామి, సతీశ్‌ కుమార్‌లు సైతం నేడు తొలి రౌండ్లో పోటీకి సై అంటున్నారు.

Spread the love