– సాత్విక్, చిరాగ్ జోడీ ఓటమి
– గాయత్రి, ట్రెసా జంట సైతం
– సింగపూర్ ఓపెన్ 2023
సింగపూర్ : సింగపూర్ ఓపెన్‌లో భారత్‌కు డబుల్ నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి తొలి రౌండ్లో అనూహ్య పరాజయం చెందగా.. మహిళల డబుల్స్‌లో యువ జంట పుల్లెల గాయత్రి, ట్రెసా జాలి సైతం అదే దారిలో నడిచారు. 68 నిమిషాల ఆరంభ పోరులో జపాన్ షట్లర్ల చేతిలో సాత్విక్, చిరాగ్ ఓటమి చెందారు. 18-21 , 21-14, 18-21తో మనోళ్లు మూడు గేముల్లో పోరాడి ఓడారు. ఐదో సీడ్ సాత్విక్, చిరాగ్ తొలి గేమ్‌ను చివర్లో జారవిడిచారు. రెండో గేమ్‌లో ఏకపక్ష విజయం నమోదు చేసి, మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లారు. మూడో గేమ్‌లో మనోళ్లు ఆఖరు వరకు రేసులో నిలిచినా..16-16 తర్వాత లయ తప్పారు. జపాన్ జోడీ అకిరా, సయిటో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలి సైతం మూడు గేముల మ్యాచ్‌లో పోరాడారు. 14-21, 21-18, 19-21తో హాంగ్‌కాంగ్ షట్లర్ల చేతిలో భంగపడ్డారు. 66 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో రెండో గేమ్‌ను గెల్చుకున్న గాయత్రి, ట్రెసా.. మూడో గేమ్‌లోనూ మెప్పించారు. 18-18 వరకు సమవుజ్జీగా నిలిచారు. కానీ చివర్లో వరుస పాయింట్లు సాధించిన హాంగ్‌కాంగ్ జోడీ టోర్నీలో ముందంజ వేసింది.