ఎన్నిక‌ల్లో మోడీ సార‌ధ్యంలోని బీజేపీకి భంగ‌పాటు త‌ప్ప‌దు : తేజ‌స్వి యాద‌వ్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సార‌ధ్యంలోని బీజేపీకి భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. విప‌క్ష ఇండియా కూట‌మికి ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని అన్నారు. రోజురోజుకూ త‌మ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతున్న‌ద‌ని చెప్పారు. అన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాల నుంచి విపక్ష కూట‌మికి సానుకూల స్పంద‌న ల‌భిస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల ప్రేమాభిమానాలు, వారి ఆశీస్సుల‌తో విప‌క్షాలు ఇప్ప‌టికే 300 సీట్ల‌ను దాటామ‌ని ఈసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బిహార్ ప్ర‌జ‌లు దీటైన స‌మాధానం ఇస్తార‌ని చెప్పారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ న‌య వంచ‌న‌తో బిహార్‌ను న‌ట్టేట ముంచార‌ని అంత‌కుముందు పాట‌లీపుత్ర లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ఆర్జేడీ అభ్య‌ర్ధి మిసా భార‌తి ఆరోపించారు. ప్ర‌ధాని మోడీ పాట‌లీపుత్ర రావ‌డం స్వాగ‌తిస్తున్నామ‌ని, ఆయ‌న రాక‌తో ఆ పార్టీకి రావాల్సిన మరో 5,000 నుంచి 10,000 ఓట్లు రాకుండా పోతాయ‌ని అన్నారు. బిహార్‌కు ప్ర‌త్యేక రాష్ట్ర హోదా, ప్య‌త్యేక ప్యాకేజ్ ప్ర‌క‌టిస్తామ‌ని కాషాయ పాల‌కులు ఊద‌ర‌గొట్టి ఉసూరుమ‌నిపించార‌ని చెప్పారు. బిహార్‌లో యువ‌త‌కు ఉపాధి పేరిట ప‌లు క‌ర్మాగారాలు ప్రారంభిస్తామ‌ని గొప్ప‌లు చెప్పార‌ని గుర్తుచేశారు. తేజ‌స్వి యాద‌వ్ యువ‌త‌కు పెద్ద‌సంఖ్య‌లో ఉపాధి అవ‌కాశాలు అందుబాటులోకి తీసుకువ‌చ్చార‌ని అన్నారు. 17 ఏండ్లుగా సాధ్యం కాని ప‌నుల‌ను తేజ‌స్వి యాద‌వ్ 17 నెల‌ల్లో సాధించార‌ని చెప్పారు.

Spread the love