తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ అస్తవ్యస్తం..!

– రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అవకతవకలు
– కొందరు ఉద్యోగుల చేతివాటం..!
– త్వరలో ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికలు
– ప్రభావం చూపే ఛాన్స్‌..?
– ఎలక్షన్‌పై అనుమానాలెన్నో..?
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ అస్తవ్యస్తంగా తయారైంది. పైసలు ఉంటేనే పని జరుగుతుందన్నట్టుగా మారింది. ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు కౌన్సిల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌కు అయ్యే ఖర్చు కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ పని చేసే కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. మరి..! ఈ ఎన్నికలు సజావుగా జరుగతాయో..? లేదో..? వేచి చూడాలి..! 2018లో తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్‌లో ఇప్పటి వరకు దాదాపు 55వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 145 వరకు ఫార్మసీ కాలేజీలుండగా, ప్రతి ఏడాదీ సుమారు 10వేల మంది విద్యార్థులు బయటకు వస్తుంటారు. డిప్లొమా ఇన్‌ ఫార్మసీ, బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫార్మసీ, డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ చదివిన రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు.. వెంగళ్‌రావు నగర్‌లో ఉన్న తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రూ.560 ఫీజు చెల్లించాలి. రిజిస్టర్‌ అయిన తర్వాతే వారికి గుర్తింపు దక్కుతుంది. ఫార్మసీలో ఉద్యోగం పొందాలన్నా.. మెడికల్‌ హాల్‌ ప్రారంభించాలన్నా.. ఈ రిజిస్టర్‌ నెంబర్‌ను ఖచ్చితంగా అడుగుతారు. కౌన్సిల్‌లో పనిచేసే కొందరు సిబ్బంది ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ చేసుకునే సమయంలో అధిక డబ్బును వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ అసలు ఫీజు రూ.560 ఉంటే, ఈ డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించినప్పటికీ అదనంగా ఇతరాత్ర సాకులు చెప్పి మరో రూ.1,000, రూ.1,500, రూ.2,000, రూ.3,000, రూ.4,000 వరకు గుంజుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
నెలకు రూ.30 లక్షలకు పైగా వసూలు..
డిప్లొమా ఇన్‌ ఫార్మసీ, బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫార్మసీ, డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ చదివిన వారు సగటున రోజూ 150 మంది ఈ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. వీరందరి వద్ద కొంత మంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి అధికంగా గుంజుతున్నారనుకున్నా.. రోజూ దాదాపు రూ.లక్షకు పైగా అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇలా నెలకు దాదాపు 3,900 మంది వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు. ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి చొప్పున లెక్కేస్తే.. నెలకు దాదాపు రూ.30 లక్షలకు పైగా అధికంగా వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్స్‌ సరిగా లేవని, ఇతరాత్ర పత్రాల సాకు చూపి ఎక్కువ డబ్బులు లాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఆలస్యమైతే బయట ఖర్చు పెరుగుతుందనే భయంతో వారు అడిగినంత ముట్టజెప్పి రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ చేయించుకుంటున్నారు. ఇలా విద్యార్థుల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటున్న ఫార్మసీ కౌన్సిల్‌లోని కొందరు ఉద్యోగులు రూ.నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నారని వినికిడి. అడిగేవారు, పట్టించుకునే వారు లేకపోవడంతో వారి బిజినెస్‌ ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’ అన్నట్టుగా సాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఎన్నికలపై అనుమానాలెన్నో..?
త్వరలో ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడింది. అక్టోబర్‌ 19వ తేదీ నుంచి 21 మధ్య బ్యాలెట్‌ పేపర్‌ను డిస్‌ప్యాచ్‌ చేస్తారు. నవంబర్‌ 10వ తేదీ నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికలకు ఐఏఎస్‌ అధికారి దాసరి హరిచందనను ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా నియమించారు. కేవలం కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ చేసుకోవడానికే లంచం అడుగుతు న్నారంటే, త్వరలో జరుగబోయే ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయరన్న గ్యారంటీ ఏముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఎన్నికలు సజావుగా జరుగుతాయో.. లేదో.. అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను అమ్ముకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నికలకు ముందే సంబంధిత అధికారులు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పందించి అవకతవకలపై ఆరా తీసి చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

గతంలో ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ ఫార్మసీ సర్టిఫికెట్లు తయారీ..
తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో పని చేసే కొందరు ఉద్యోగులు గతంలో ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ ఫార్మసీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ పట్టుబడ్డారు. ఫార్మసీ రిజిస్ట్రేషన్‌కు ఫేక్‌ సర్టిఫికెట్లు విక్రయించి జైలుకు వెళ్లిన వారు కూడా ప్రస్తుతం ఈ కౌన్సిల్‌లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్న కౌన్సిల్‌లో రేపు జరుగబోయే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం ఏముంది..? చిన్నపాటి రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌కే అవకతవకలకు పాల్పడిన వారు, ఫేక్‌ బ్యాలెట్‌ పేర్లను తయారు చేసి ఎన్నికలను తప్పుదోవ పట్టించరనే గ్యారెంటీ ఏముంది..? ఫేక్‌ బ్యాలెట్‌ పేపర్లను విక్రయించి సొమ్ము చేసుకున్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నికలకు ముందే సంబంధిత అధికారులు స్పందించి, గతంలో జరిగిన అవకతవకలపై ఆరా తీసి, ఈ ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love