అమెరికాలో ఘ‌నంగా తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుకలు

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకలను అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని కొలంబస్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ -యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్‌ తన్నీరు మహేష్‌ నేతృత్వంలో ఈ వేడుకలను నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు సిద్దిపేట వాస్తవ్యులు ఉమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించి, ప్రొఫెస‌ర్ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తన్నీరు మహేష్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారన్నారు. ప్రగతి, విద్య, వైద్యం ఆరోగ్యం, సంక్షేమం, విద్యుత్‌, వ్యవసాయ, సాగు, త్రాగు నీరు ఇలా ఏ రంగం తీసుకున్నా.. తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉమారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ పోరాటయోధుడని, బాల్యం నుండి పట్టుదల ఎకువ, సంకల్పం దార్శనికత, దక్షతకు మారు పేరని గుర్తుచేశారు. ఈ సందర్భంగా. తన చిన్ననాటి తీపి గుర్తులు నెమరువేసుకుని, కేసీఆర్‌ వ్యూహరచన, రాజకీయ చాతుర్యాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. వేణు పామేర, నరసింహ నాగులవంచ, డేవిడ్‌ విక్రమ్‌, సాజిత్‌ దేశినేని తదితన ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love