Monday, April 27, 2026
E-PAPER
Homeక్రైమ్అలకనంద నదిలో తెలంగాణ విద్యార్థి గల్లంతు

అలకనంద నదిలో తెలంగాణ విద్యార్థి గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్ విద్యార్థి గల్లంతైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లిన యువకుడు, ప్రమాదవశాత్తు అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీనగర్‌లో నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ మోహన్ (21), శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి క్యాంపస్ సమీపంలోని అలకనంద నది ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడి దిబ్బపై నుంచి సరదాగా నదిలోకి దూకిన ఆనంద్, బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతను తిరిగి పైకి రాకపోవడంతో ఆందోళనకు గురైన స్నేహితులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న శ్రీనగర్ పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, చీకటి పడటం, నదిలో ప్రవాహం అత్యంత ఉధృతంగా ఉండటంతో ఆదివారం రాత్రికి గాలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. అలకనంద నదిలో ప్రవాహం చాలా బలంగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సోమవారం ఉదయం నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపును ముమ్మరం చేస్తామని శ్రీనగర్‌ కొత్వాలి ఇన్‌ఛార్జ్‌ ఇన్స్‌పెక్టర్ కులదీప్‌ సింగ్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -