గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత– నిరుద్యోగ సమస్యలపై వారం రోజులుగా మోతీలాల్‌ నిరాహార దీక్ష
– పరామర్శించేందుకు వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగుల చెదరగొట్టిన పోలీసులు
– వాగ్వాదం, తోపులాటలు
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజశ్వేర్‌రెడ్డి సహా పలువురి అరెస్ట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్‌ గాంధీ హాస్పిటల్‌ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని వారం రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మోలీలాల్‌ నాయక్‌ను పరామర్శించేందుకు ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాట జరిగింది. ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్పీ ప్రకటించాలని, గ్రూప్స్‌ పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ నాయకులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓయూ విద్యార్థి జేఏసీ నేత మోతీలాల్‌ నాయక్‌ గత నెల 24వ తేదీన ఓయూలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా.. ఆ రోజే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దాంతో వారం రోజులుగా ఆస్పత్రిలోనూ దీక్ష చేస్తున్నారు. ఆయనను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌వీ నాయకులు, విద్యార్థులు, నేతలు భారీగా ఆస్పత్రి వద్దకు వచ్చారు. లోపలికెళ్లేందుకు యత్నించిన బీఆర్‌ఎస్‌వీ నాయకులతోపాటు ఓయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించిన వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. లోపలికి ఎవరినీ అనుమతించకపోవడంతో విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. కొంత మంది విద్యార్థులు గాంధీ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనాల వైపు నుంచి ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు హాస్టల్‌ భవనాల వద్ద ఉన్న క్యాంటీన్‌ వైపు వెళ్లి నిరుద్యోగులను అడ్డుకున్నారు. గ్రూప్‌-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్పీ నిర్వహించాలని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులు దగ్గరలోని మెట్రో స్టేషన్లలోకి పరుగులు తీశారు. దాంతో మెట్రోనూ మూసేశారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులను అరెస్టు చేయడంతో గొడవ పెద్దదిగా మారింది. ఈ క్రమంలో స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్‌ బలగాలను మోహరించారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే హాస్పిటల్‌లోకి పంపించారు. మీడియాను కూడా అనుమతించలేదు. అదే సమయంలో మోతీలాల్‌ను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయినా లోపలికెళ్లేందుకు యత్నించడంతో వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
ఆదివారం రాత్రి ఆస్పత్రికి ఎమ్మెల్సీ బల్మూరి
మోతీలాల్‌ను కలిసేందుకు ఆదివారం రాత్రి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, రియాజ్‌, మానవతారారు తదితర కాంగ్రెస్‌ నాయకులు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలు, ఓయూ విద్యార్థులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దాంతో కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలకు నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువురినీ చెదరగొట్టారు.

Spread the love