నా సాహిత్య ప్రస్థానంలో ఆ సినిమా పాటకు ప్రత్యేక స్థానముంది..

ఏ కవికైనా, కళాకారునికైనా తన జీవితంలో కొన్ని మధురానుభూతులు ఉంటాయి. అవి మనసులో స్థిరపడి మనల్ని పదే పదే పులకింపజేస్తుంటాయి. అలాంటి అనుభూతులు నా జీవితంలో చాలానే ఉన్నాయి..కాని వాటన్నింటిలోకెల్లా గొప్ప అనుభూతి అంటే అది నేను ‘దక్ష’ సినిమాకు పాట రాసిన సందర్భమే.. కవిగా వందలాది కవితలు రాశాను. వాటిని పుస్తకాలుగా ప్రచురించాను. అపుడు పొందిన ఆనందానుభూతి కూడా మధురమైనదే. కాని ‘దక్ష’ సినిమాకు పాట రాసినపుడు నేను పడిన యాతన, సన్నివేశాన్ని అక్షరీకరించేటప్పుడు నేను పడ్డ తపన, పదాల శోధనకై నేను పడిన ఆరాటం, నిద్రలేని రాత్రుల్లో పాట కోసం నేను చేసిన పోరాటం అంతా ఇంతా కాదు.. ట్యూన్ లో పదబంధాల్ని పేర్చడం, అందునా సంగీతదర్శకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా అందరినీ మెప్పించిన ఆ సందర్భం నభూతోనభవిష్యతి.. నిజానికి నా తొలి సినిమాపాట కాదిది. 2021లో వచ్చిన ‘ఒక్కడే’ సినిమాలోని ‘సవాలు నిన్ను తాకి చుట్టు ముట్టె చూడరా’..అనేది నేను రాసిన తొలి సినిమాపాట. అది మొదటిపాటైనా దానికి నేనసలు అంతగా కష్టపడలేదు. అవలీలగా, అలవోకగా రాసేశాను.. ఆ తరువాత ‘కలియుగ భగవాన్’ వంటి డివోషనల్ మూవీకి 5 పాటలు రాశాను.. ఆ తరువాత..అంతిమసమరం, కాలమేగా కరిగింది?, కలవరమాయే మదిలో, వారధి ఇలా చాలా సినిమాలకు పాటలు రాశాను… ఏదీ నన్ను అగ్నిపరీక్షకు గురి చేయలేదు.. అది ఒక్క దక్ష సినిమాపాట వల్లే జరిగిందని చెబుతాను..
సినిమాకథ మొత్తం వినిపించారు దర్శకులు వివేకానంద విక్రాంత్ గారు. కథ మొత్తం ఆ పాటలో వినిపించాలి..కథా సన్నివేశమంతా ఆ పాటలో కనిపించాలి…పైగా సినిమా మొత్తానికి ఈ ఒక్కటే పాట ఉందన్నారు.. మన సినిమాను ఈ పాటే నిలబెట్టాలన్నారు..అలా పెద్ద బాధ్యతే నా మీద పెట్టారు దర్శకులు విక్రాంత్ గారు.. ఈ సినిమా నిర్మాత తల్లాడ సాయికృష్ణ గారు నాకు ఆత్మీయమిత్రుడు. అతను కూడా దర్శకుడే..అప్పటికే మూడు, నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవముంది అతనికి.. ఈ సినిమాకు మాత్రం అతడు నిర్మాతగా ఉన్నాడు.. అతను కొన్ని సూచనలు చేశాడు.. అది ఏమిటంటే.. ఇది హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ.. కొంతమంది యువకులు వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులకు శిక్షగా ఒక ప్రేతాత్మ వారి వెంట పడుతుందని భ్రమపడుతూ, భయపడుతూ పరుగెడుతుంటారు. ఇది ఆ సందర్భం.. ముందు పాట రాయండి…ఆ తర్వాత ట్యూన్ చేద్దామన్నారు నిర్మాత కథ మొత్తాన్ని పాటలో పలికించడానికి నేను రెండు రోజులు ఆలోచనాలోచనాల లోతులు మధించాను వెంటనే ‘సాగుతోంది వింతకథ వెంటాడే చీకటిలా.. తరుముతోంది ఒక నీడ వేటాడే శత్రువులా..’ అంటూ పల్లవి ప్రారంభించాను.. పల్లవికే రెండు రోజులు పట్టింది..అలా చరణాలతో పాటు దాదాపు ఐదు రోజుల్లో పాటను పూర్తి చేశాను.. అయితే ఈ సినిమాకు సంగీతదర్శకుడు శేఖర్ ఆయనేమన్నారంటే ఇలాంటి కథాసన్నివేశానికి పాటను రాశాక ట్యూన్ చేయడం కంటే, ట్యూన్ కే పాట రాస్తే బాగుంటుందన్నారు.. మరి అలాయితే.. అనుకున్న పదాలు, సందర్భం ట్యూన్ కి ఒదగగలుగుతాయా? అనుకున్న కథాసందర్భాన్ని పాటలో ఇమిడ్చగలుతామా? అని అనేశారు దర్శకనిర్మాతలు.. కాని నేను రాయగలను అన్నాను..దర్శక నిర్మాతలకు బలమొచ్చినట్టయింది.. నాక్కూడా చెప్పలేనంత ఆత్మవిశ్వాసం లోపలి నుండి తన్నుకొచ్చేసింది…అదే సన్నివేశం, సందర్భం…కాని ట్యూన్ లో ఒదగాలి పాట మొత్తం.. ఇక్కడ నాకు స్వేచ్ఛ ఉండదు.. ఆ బాణీలో ఒదిగే పదాలు కొన్ని మాత్రమే ఉంటాయి..అవి మాత్రమే నేను ప్రయోగించగలుగుతాను..అవి కూడా సందర్భానికి తగినట్టుగా ఉండాలి..అదీ..పబ్లిక్ కి రీచ్ అయ్యేలా ఉండాలి..ఇదంతా కత్తిమీద సాము.. అయినా..అలా నాలుగు రోజులు కలాన్ని కత్తిలా పట్టుకుని సాన పెడుతూనే ఉన్నాను.
అయితే సినిమాకథను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే ఒకరోజు రాత్రి ఒక ఊహ తళుక్కున మెరిసింది..అయితే కథలో కొంతమంది యువకులు కొన్ని తప్పులు చేస్తుంటే, ప్రేతాత్మ వారిని వెంబడిస్తుంటుందని, రాత్రిపూట వారు అడవిలో భయపడుతూ పరుగెడతారని చెప్పుకున్నాం కదా! అలా పరిగెడుతున్న వారికి కొన్ని నిప్పులగుండాలు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి..అరుపులూ వినిపిస్తాయి..అలా ఆ సన్నివేశం తాలూకు పదబంధాలు నాకు ఇలా స్ఫురించాయి.. అప్పుడు వెంటనే పల్లవి తన్నుకొచ్చేసింది..అదే..’చితి రగిలెనేమో నాలో నీలో ఊగే ఊపిరిగా..కథ మిగిలెనేమో నీదీ నాదీ సాగే చీకటిగా..’అంటూ పల్లవి రాసేశాను.. చరణాలు రాయడానికి ఎనిమిది రోజులు పట్టింది.. పాట మొత్తం రెడీ అయ్యాక దర్శకుడికి, సంగీతదర్శకుడికి, నిర్మాతకి చూపించాను..ఏమంటారో ఒకే చేస్తారో లేదో అన్న టెన్షన్ ఉండింది.. ట్యూన్ కి, సన్నివేశానికి తగినట్టుగా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. హీరో, హీరోయిన్లకైతే తెగనచ్చేసిందీపాట. రోజు పాడుకునేవారు. మూవీ టీమ్ అంతటికి భలేనచ్చిందంట పాట. ప్రళయం ప్రాణం తీయడం, విలయం విరుచుకుపడడం..వంటి పదాలు చరణాల్లో భలే పేలాయి. సింగర్ సాయినాథ్ తో ఆ పాట పాడించి రికార్డ్ చేయించారు. అనుకున్నట్టు గానే దక్ష సినిమా విడుదలై మీ ఆదరణతో మంచి గుర్తింపును పొందింది..పాటకి కూడా ప్రత్యేకమైన ప్రశంసలందాయి.


పాట రికార్డింగ్ అవ్వగానే ముందు మా అమ్మానాన్నలకు వినిపించాను. నీకు ఈ పాట బాగా పేరు తెస్తుందని అభినందించారు.వారన్నట్టే ఈ పాట నాకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. సీనియర్ నటుడు శరత్ బాబు అబ్బాయి ఆయుష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆయుష్ ఈ పాటను శరత్ బాబుకి వినిపించారట.. శరత్ బాబు చాలా మెచ్చుకున్నారు.. అంతేకాకుండా మా మూవీ టీమ్ కి సపోర్ట్ గా ఉన్న డైరెక్టర్ బి.గోపాల్, డైరెక్టర్ తేజ, సీనియర్ నటులు తనికెళ్ళ భరణి లాంటి ప్రముఖుల ప్రశంసలు ఈ పాటకి లభించాయి. ఇది నా జీవితంలో గొప్ప అచీవ్ మెంట్ గా, అనుభూతిగా నేను భావిస్తాను.. అందుకే నా సాహిత్యప్రస్థానంలో ఈ సినిమాపాటకు ప్రత్యేకస్థానముందంటాను.. కొన్ని పాటలు మనల్ని మధిస్తాయి.. సాగరమధనంలా మనలో మేధోమధనం జరుగుతుంది.. అలా మనల్ని కాసేపు అవి కలవరపెట్టినా.. చివరికి మనకు అదే ఒక వరమై నిలబడుతుందని నేనంటాను. ఇలాంటి క్లిష్టమైన సందర్భాలకు, బాణీలకు పాటలు రాసినప్పుడు ఎన్నెన్నో సాహసకృత్యాలు చేసినంత గర్వంగా అనిపిస్తుంటుంది..
– డా.తిరునగరి శరత్ చంద్ర

Spread the love