Sunday, June 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒప్పందంపై సంతకం చేయాల్సిందే

ఒప్పందంపై సంతకం చేయాల్సిందే

- Advertisement -

ఇరాన్‌కు వేరే దారి లేదు : ట్రంప్
వాషింగ్టన్ : యుద్ధానికి ముగింపు పలకాలంటే అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనని, అంతకంటే దాని నాయకులకు వేరే దారి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘వారు బలంగా ఉన్నారు. గర్వంతో ఉన్నారు. శాంతి ఒప్పందంపై సంతకం చేయాల్సి వస్తుందని వారు ఎన్నడూ అనుకోని ఉండరు. కానీ వారు ఆ పని చేయాల్సి వస్తోంది. మరో దారి లేదు. దానికి కొంత సమయం పడుతుంది’ అని విస్కాన్సిన్‌లోని చిప్పేవా ఫాల్స్‌లో జరిగిన ఎన్‌బీసీ న్యూస్ ‘మీట్ ది ప్రెస’ కార్యక్రమంలో ట్రంప్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకడానికి ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వారి ఆయుధ నిల్వలు అడుగంటుతున్నాయి
ఇరాన్ వద్ద ఇప్పటికీ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని ట్రంప్ అంగీకరించారు. అయితే ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలలో అధిక భాగాన్ని అమెరికా పూర్తిగా ధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు. ‘డ్రోన్’క్షిపణి తయారీ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలు చాలా వరకూ నాశనమయ్యాయి. అయినప్పటికీ వారికి ఇంకా కొంత సామర్ధ్యం ఉంది. వారి వద్ద కొన్ని క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. బహుశా 21-22 శాతం క్షిపణులు ఉండవచ్చు. అవి పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ మనం తొలుత దాడి చేసినప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇది చాలా స్వల్పం’ అని తెలిపారు.

అంత ఈజీ కాదు
టెహ్రాన్‌తో త్వరితగతిన ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలంటూ సూచిస్తున్న వారిని ట్రంప్ విమర్శించారు. ఇలాంటి పనులు చేయడానికి సంవత్సరాల కాలం పడుతుందని అన్నారు. ‘ఇరాన్ నేతలు 47 ఏండ్లుగా పోరాడుతున్నారు. అమెరికన్లను చంపుతున్నారు. మన వారి కాళ్లు, చేతులను నరుకుతున్నారు. ముఖాలను తీవ్రంగా గాయపరుస్తున్నారు’ అని చెప్పారు. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలను ట్రంప్ వియత్నాం యుద్ధంతో పోల్చారు. ‘నేను చాలా వేగంగా ముందుకు సాగుతున్నాను. వియత్నాం యుద్ధం 19 ఏండ్ల పాటు సాగిందని మీకు తెలుసు కదా. నేను యుద్ధ రంగంలోకి దిగి మూడు నెలలే అయింది. అయినప్పటికీ ఎప్పుడు విజయం సాధిస్తారంటూ కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నేను డెమొక్రాట్‌ని అయి ఉంటే ఎవరూ అలా మాట్లాడే వారు కాదు. అయినా నేను దీనిని పట్టించుకోను. ఇదంతా నాకు అలవాటై పోయింది’ అని ట్రంప్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -